Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట.. తోషఖానా కేసులో జైలు శిక్ష రద్దు.. ఎన్నికల్లో పోటీ చేస్తారా..?
ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధుల్ని ఇమ్రాన్ సొంత ఖాతాకు మళ్లించారని, నిబంధనల్ని ఉల్లంఘించారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనపై నమోదైన అభియోగాలు నిజమే అని నమ్మింది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషఖానా కేసులో ఆయనకు సెషన్స్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఫరూక్, జస్టిస్ తారిఖ్ మెహ్మూద్ జహంగిరి ధర్మాసనం ఈ నిర్ణయం వెల్లడించింది. ఈ ఆదేశాలు అమలై, కోర్టు నుంచి ఇమ్రాన్ విడుదలైతే.. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుంది.
ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా 2018లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ ఖజానాకు చెందిన వస్తువుల్ని, ప్రధాని నివాసానికి చెందిన లగ్జరీ కార్లను వేలం వేశారు. ఈ నిధుల్ని ప్రభుత్వ ఖాతాకు జమచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డట్లు ఆయనపై 2022లో అభియోగాలు మోపింది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధుల్ని ఇమ్రాన్ సొంత ఖాతాకు మళ్లించారని, నిబంధనల్ని ఉల్లంఘించారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనపై నమోదైన అభియోగాలు నిజమే అని నమ్మింది. దీంతో ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనివల్ల అతడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోయాడు.
సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఇమ్రాన్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇమ్రాన్‌కు విధించిన శిక్షను రద్దు చేసింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇమ్రాన్ పంజాబ్‌లోని అటాక్ జైలులో ఖైదీగా ఉన్నాడు. అక్కడ అతడు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వెలుతురు, గాలి వంటి సరైన వసతులు కూడా లేని జైలులో ఇమ్రాన్ ఉంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయనపై నమోదైన అభియోగాల్ని కొట్టేయాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు సెషన్స్ కోర్టు తీర్పులో లోపాలున్నట్లు గుర్తించింది. వెంటనే ఇమ్రాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్రాన్ పీటీఈ అనే పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవలి కాలంలో అక్కడ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాక్‌లో ప్రభుత్వం ఇప్పటికే రద్దైంది. త్వరలోనే జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.