YCP Government : కృష్ణా జిల్లాలో ఎవరి లెక్కలు వారివే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈసారి కొత్త వాతావరణం కనిపిస్తోంది. ఏదో.. కోటాలో ఇవ్వాలి కాబట్టి పార్టీలు ఇచ్చింది తీసుకోవడం కాకుండా.. ఈసారి మేము సైతం అంటూ.. కొందరు మహిళా నేతలు టిక్కెట్ల కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట. వైసీపీ, టీడీపీ రెండిట్లో ఈ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే టీడీపీ తరుపున నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈసారి కొత్త వాతావరణం కనిపిస్తోంది. ఏదో.. కోటాలో ఇవ్వాలి కాబట్టి పార్టీలు ఇచ్చింది తీసుకోవడం కాకుండా.. ఈసారి మేము సైతం అంటూ.. కొందరు మహిళా నేతలు టిక్కెట్ల కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట. వైసీపీ, టీడీపీ రెండిట్లో ఈ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే టీడీపీ తరుపున నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. కానీ.. ఈసారి మహిళా నేతల ప్రయత్నాలు చూస్తుంటే.. అధికార, ప్రతిపక్షాల నుంచి ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివిధ పదవుల్లో ఉన్న నాయకురాళ్ళు కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ రేస్‌లో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అందరికంటే ముందున్నట్టు తెలిసింది. మేయర్ సొంత సామాజికవర్గం బీసీ.. నగరాలుకు చెందిన ఓట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 40 వేలకుపైగా ఉన్నాయి.
దీంతో బీసీ కార్డ్, మహిళా కోటాను కలిపి.. పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారట బెజవాడ మేయర్. సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ని మారిస్తే.. ప్రత్యామ్నాయంగా టిక్కెట్ తనకే ఇవ్వాలని ఆమె గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. తాజా పరిణామాలు కూడా అందుకు ఊతం ఇస్తున్నాయి. సీఎంవో పిలుపుతో క్యాంప్ ఆఫీస్‌కు వెళ్ళి ఇద్దరు నేతలు కలిసి రావడం ఆసక్తి రేపుతోంది. ముందు ఎమ్మెల్యే వెలంపల్లికి పిలుపురాగా ఆయన వెళ్లి కలిశారు. వెంటనే భాగ్యలక్ష్మిని కూడా పిలిపించడంతో విజయవాడ వెస్ట్‌లో పొలిటికల్ సెగ పెరిగింది. ఇక నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మేయర్ భాగ్యలక్ష్మికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఇక వెస్ట్ అభ్యర్థిగా ఆమెను ప్రకటించినట్టేనంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఇక పెనమలూరు నియోజకవర్గం నుంచి DCMS చైర్ పర్సన్ పడమటి స్నిగ్ధ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. రక్ష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్నిగ్ధ తండ్రి పడమట సురేష్ బాబు 2009 నుంచి 2012 వరకు వైసీపీలో పెనమలూరు ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన పార్టీ టిక్కెట్ ఆశించినా ప్రయోజనం లేకపోవడంతో సైలెంట్ అయ్యారట. గత ఎన్నికల్లో బీసీ కోటాలో మాజీ మంత్రి పార్థసారధికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు, పార్టీ అధిష్టానానికి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారంతోపాటు సిట్టింగులను వైసీపీ అధిష్టానం మారుస్తున్నందున మళ్ళీ పడమట సురేష్ బాబు తన కుమార్తె స్నిగ్ధకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది.
పెనమలూరులో 50 వేలకుపైగా బీసీ ఓట్లు ఉన్నాయని, తనకు గతంలో టికెట్ ఇవ్వనందున ఈసారైనా న్యాయం చేయమని కోరుతున్నారట సురేష్ బాబు. అటు తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకుంటే.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ నుంచి గెలిచారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక తాజాగా పసుపు కండువా కప్పుకున్నారామె. ఈసారి తిరువూరు నుంచి టీడీపీ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారట ఆమె. శ్రీదేవిది ఎస్సీ సామాజికవర్గం కాగా.. ఆమె భర్త కాపు కావటంతో రెండు కులాల ఈక్వేషన్‌ను పార్టీ పెద్దల ముందు ఉంచుతున్నారట ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో కూడా నాన్ లోకల్ అయిన మాజీ మంత్రి జవహర్‌కు తిరువూరు టిక్కెట్ ఇచ్చారు కాబట్టి ఈసారి తనకు ఇవ్వాలని కోరుతున్నారట శ్రీదేవి. ఇలా మొత్తంగా ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మహిళా నేతలు టిక్కెట్ల కోసం జోరుగా పోటీ పడుతున్నారు. చివరకు పార్టీల అధిష్టానాలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయో చూడాలి.