INDIA: ఇండియా కూటమి మూడో భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్..!
ఇండియా కూటమి మూడో సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో ఇండియా చైర్‌పర్సన్, కన్వీనర్ పదవులకు నేతల్ని ఎన్నుకుంటారు. అలాగే వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యహాన్ని కూడా ఖరారు చేస్తారు.
INDIA: దేశంలో ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మూడో భేటీ ముంబైలో గురువారం జరగనుంది. మొదటి భేటీ పాట్నాలో జరగగా, రెండో భేటీ బెంగళూరులో జరిగింది. మూడో భేటీకి మహారాష్ట్ర రాజధాని ముంబై ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో విపక్షాల భేటీపై ఆసక్తి నెలకొంది. గురు, శుక్రవారాల్లో ఈ సమావేశం జరుగుతుంది.
ఇండియా కూటమి మూడో సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో ఇండియా చైర్‌పర్సన్, కన్వీనర్ పదవులకు నేతల్ని ఎన్నుకుంటారు. అలాగే వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యహాన్ని కూడా ఖరారు చేస్తారు. అలాగే ఇండియా కూటమి తరఫున ఉమ్మడి లోగోను కూడా ఆవిష్కరించబోతున్నారు. ఇండియా కూటమి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు 11 ప్రధాన పార్టీల నుంచి 11 మందితో ఒక సమన్వయ కమిటీని ఎన్నుకోబోతున్నారు. చైర్‌పర్సన్, కన్వీనర్, కమిటీ ఎంపిక ఈ రెండు రోజుల్లో జగరబోతుంది. ఈ భేటీలోనే కమిటీలోని పార్టీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఉంటూనే.. కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీకి సహకరిస్తున్నాయి. అలాంటి పార్టీల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రధానంగా శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కొంతకాలంగా ఎన్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇటు ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్డీయేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఎన్సీపీపై ఏదో ఒకటి తేల్చాలనుకుంటున్నారు. ఇప్పటివరకు ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. మరికొన్ని పార్టీలు కూడా కూటమిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని అభ్యర్థిత్వంపై భిన్న ప్రకటనలు
ఇండియా కూటమికి ఉన్న ప్రధాన సమస్య.. ప్రధాని అభ్యర్థి. ఏ పార్టీ నుంచి, ఏ నాయకుడు కూటమి ప్రధానిగా ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో బీజేపీ విమర్శలు చేస్తోంది. కూటమిగా ఏర్పడటం కాదు.. ముందు ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చాలని బీజేపీ సవాల్ విసిరింది. కూటమిలోని సీఎంలైన మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వంటి వాళ్లు ప్రధాని అభ్యర్థిత్వాన్ని వదులుకోలేరు. అయితే, ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. దీనికి కూటమిలోని పార్టీలు కూడా అంగీకరించాయన్నారు. మరోవైపు ఆప్ నేతలు మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రధాని అయితే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో ఏ ప్రతిపాదనకు కూటమిలోనే పార్టీలు ఇప్పుడప్పుడే అంగీకరించే అవకాశం లేదు. మరోవైపు వివిధ రాష్రాల్లో కలిసి పోటీ చేసే అంశంపై పార్టీల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. వాటిని ఎలా పరిష్కరించుకుంటాయో చూడాలి.