INDIA bloc: ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలు.. ‘ఇండియా’ వర్సెస్ ఎన్డీయే ఢీ..!
దేశంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే కూటమికి, ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి.
INDIA bloc: బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు మధ్య తొలిపోరుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మంగళవారం (సెప్టెంబరు 5) ఉప ఎన్నిక జరగబోతోంది.
ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా గెలిచిన దరా సింగ్ చౌహన్ ఇటీవల బీజేపీలోకి జంప్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఘోసి సెగ్మెంట్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున దరా సింగ్ చౌహన్ బరిలోకి దిగగా.. ఆయన్ను ఎదుర్కొనేందుకు సుధాకర్ సింగ్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నిలబెట్టింది.ఇండియా కూటమిలో ఎస్పీ కూడా ఉంది. దీంతో ఘోసీ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎల్‌డీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ (ఎంఎల్)- లిబరేషన్, సుహల్దేవ్ స్వాభిమాన్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థికి అప్నాదళ్(సోనేవాల్), నిషాద్ పార్టీ మద్దతు ప్రకటించాయి. ఈ బై పోల్‌లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో ఈ ఎన్నిక బీజేపీ, ‘ఇండియా’ కూటమి మధ్య ద్విముఖ పోరుగా మారింది. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ఉంది.
ఓట్ల లెక్కలు, సామాజిక సమీకరణాలు..
ఘోసి అసెంబ్లీ సెగ్మెంట్ బై పోల్‌లో మొత్తం 4.38లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడి ఓటర్లలో 90,000 మంది ముస్లింలు, 60,000 మంది దళితులు , 77,000 మంది అగ్రవర్ణాల వారు ఉన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబరు 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అధికార బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఈ ఒక్క ఉప ఎన్నికతో ప్రభుత్వంలో ఎలాంటి మార్పు ఉండదు. అయినప్పటికీ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం జట్టు కట్టిన ఇండియా కూటమిలోని పార్టీలకు ఇది కీలక పరీక్షే. అందువల్లే ఘోసీ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరో 6 చోట్ల కూడా బైపోల్..
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్, త్రిపురలోని బోక్సా నగర్, కేరళలోని పుతుప్పల్లి, జార్ఖండ్ లోని డుమ్రి, పశ్చిమ బెంగాల్ లోని ధుప్ గురి అసెంబ్లీ స్థానాలకు కూడా సెప్టెంబరు 5 (మంగళవారం) ఉప ఎన్నిక జరుగుతుంది. త్రిపురలోని ధన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే రాజీనామాతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. అంటే ఘోసి స్థానంతో కలుపుకొని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాల్లోనూ ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వేచిచూడాలి.