India-Canada: భారత్, కెనడా మధ్య సిక్కు వేర్పాటువాదులే చిచ్చు పెట్టారా..? ట్రూడో ప్రభుత్వంపై మోదీ కోపానికి కారణాలేమిటి..?

కెనడాలో సిక్కు వేర్పాటువాదుల 'ఆందోళనలు', భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించే ఘటనలపై భారత ప్రధాని ఆగ్రహంగా ఉన్నారు. కెనడా అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని జస్టిన్ ట్రూడో కూడా గతంలో అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 20, 2023 | 07:38 PMLast Updated on: Sep 20, 2023 | 7:38 PM

India Canada Relations Crumbled This Way Ties With Canada Soured Over Hardeep Singh Nijjar Killing

India-Canada: కెనడా-భారత్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంటోంది. ఇటీవల జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానం చెడిపోవడంతో రెండు రోజులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ, ఆయన స్వదేశం చేరుకోగానే భారత్‌తో కెనడా ట్రేడ్ మిషన్‌ను నిలిపివేసినట్లు వార్తలొచ్చాయి. ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను కెనడా నిలిపివేసినట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జీ శుక్రవారం వెల్లడించారు. జీ20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వాడీవేడీ చర్చ జరిగినట్లు తెలిసింది. కెనడాలో సిక్కు వేర్పాటువాదుల ‘ఆందోళనలు’, భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించే ఘటనలపై భారత ప్రధాని ఆగ్రహంగా ఉన్నారు. కెనడా అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని జస్టిన్ ట్రూడో కూడా గతంలో అన్నారు. అయితే, ట్రూడో.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి కారణం అక్కడి సిక్కులు. వారితో ముడిపడి ఉన్న కెనడా రాజకీయాలు. తన రాజకీయ భవిష్యత్తు.
ఖలిస్తాన్ ఉద్యమ ప్రభావం
ఇండియాలో రెండు శాతం ఉన్న సిక్కులు అన్యాయానికి గురవుతున్నారని, వారికి ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలని కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లోని సిక్కులు ఉద్యమిస్తున్నారు. వారికి అనేక సంస్థలు నేతృత్వం వహిస్తున్నాయి. వారిలో అమృత్‌పాల్ సింగ్, హర్దీప్ సింగ్ నిజ్జర్, అవతార్ సింగ్ ఖండా, పర‌మ్‌జీత్ సింగ్ పంజ్వాడ్ వంటి నేతలున్నారు. వీళ్లు సిక్కులకు సంబంధించిన సంస్థలు స్థాపించి, ఖలిస్తాన్ అనుకూల ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వీరిలో హర్దీప్ సింగ్ నిజ్జర్, పర‌మ్‌జీత్ సింగ్ పంజ్వాడ్, అవతార్ సింగ్ ఖండా వంటి వారిని భారత ప్రభుత్వం తీవ్రవాదులుగా ప్రకటించింది. వీరు భారత్‌లో ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. వీళ్లలో పర‌మ్‌జీత్ సింగ్ పంజ్వాడ్ గత మే నెలలో లాహోర్‌లో హత్యకు గురయ్యాడు. ఇదే ఏడాది జూన్‌లో అవతార్ సింగ్ ఖండా బ్రిటన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనను ‘ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్’ చీఫ్‌గా చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని పబ్లిక్ మార్కెట్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. నిజ్జర్ హత్య విషయంలోనే కెనడా ప్రధాని భారత్‌పై ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక భారత ఇంటెలిజెన్స్ సంస్థల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఇతర సిక్కు నేతల హత్య వెనుక కూడా భారత్ పాత్ర ఉందని సిక్కు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కెనడా ప్రభుత్వం మద్దతు
ఖలిస్తాన్ ఉద్యమకారులకు కెనడా ప్రభుత్వం మద్దతిస్తోంది. దీనికి రాజకీయ కారణాలున్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి అక్కడి పార్లమెంటులో సరైన మెజారిటీ లేదు. ఆయన ప్రభుత్వం కొనసాగాలంటే ఇతర పార్టీల మద్దతు కావాలి. ట్రూడో ప్రభుత్వానికి ఖలిస్తాన్ అనుకూల, సిక్కు పార్టీలు మద్దతిస్తున్నాయి. ట్రూడో ప్రభుత్వం కొనసాగాలన్నా.. తిరిగి గెలవాలన్నా కెనడాలో అధికంగా ఉన్న సిక్కుల మద్దతు అవసరం. అందుకే సిక్కులు చేస్తున్న ఖలిస్తాన్ ఉద్యమానికి అక్కడి ప్రభుత్వం సహకరిస్తోంది. ఈ కారణంగానే ఇండియా వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కెనడాలోని భారతీయ రాయబారిని బహిష్కరించింది. ఈ చర్యకు బదులుగా కెనడా రాయబారిని ఇండియా బహిష్కరించింది. రెండు దేశాల చర్యల ద్వారా ఇరు దేశాల మధ్య సంక్షోభం మరింత ముదిరింది.
భారత ప్రభుత్వం ఖండన
కెనడాలో జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై మన ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖలిస్తాన్ అనుకూల కార్యక్రమాల్ని అడ్డుకోవాలని కెనడాకు గతంలోనే సూచించింది. దీనివల్ల చాలా కాలంగా ఇరు దేశాల మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. కాన్ఫరెన్స్‌లో అధికారికంగా శుభాకాంక్షలు చెప్పే సమయంలోనూ ట్రూడో, మోదీతో కరచాలనం చేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ దృశ్యం ఇరుదేశాల సంబంధాల్లో నెలకొన్న ‘ఉద్రిక్తత’కు తార్కాణంగా కనిపించింది. ఆ తర్వాత ట్రూడోతో చర్చల సందర్భంగా కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలు పెరగడాన్ని మోదీ లేవనెత్తారు.
సంబంధాలు ఇంకా దెబ్బతింటాయా?
ట్రూడో ప్రకటన భారత ప్రభుత్వానికి రుచించకపోవడంతో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దానికి తోడు, కెనడా అంతర్గత వ్యవహారాలను భారత్ ప్రభావితం చేస్తోందని ట్రూడో ఆరోపించారు. ద్వైపాక్షిక స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై చర్చలను కెనడా నిలిపివేయడం ఇరుదేశాల సంబంధాలు క్షీణించాయనడానికి నిదర్శనంగా చూడొచ్చు. ట్రూడో అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితి మెరుగుపడేలా కనిపించడం లేదు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోని కీలకాంశాలు
మార్చి 2022లో జరిగిన మధ్యంతర ఒప్పందంతో ఇరుదేశాలు చర్చలను పునఃప్రారంభించాయి. ఈ ఒప్పందాల ప్రకారం, చాలా వస్తువులపై ఇరుదేశాలు సుంకాన్ని గణనీయంగా తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంటుంది. కెనడియన్ మార్కెట్లలో తమ టెక్స్‌టైల్, లెదర్ వస్తువులపై సుంకం రద్దు చేయాలని భారత కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. నిపుణుల కోసం వీసా నిబంధనలను సులభతరం చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. కెనడా తన డైరీ, వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్‌లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. 2022లో కెనడాకు పదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది. 2022-23లో కెనడాకు 4.10 బిలియన్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. 2021-22లో ఇది 3.76 బిలియన్ డాలర్లు. 2022-23లో భారత్‌కు 4.05 బిలియన్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను కెనడా ఎగుమతి చేసింది. కెనడాకు చెందిన సుమారు 600 కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో 1000 కంపెనీలు వ్యాపార అవకాశాల కోసం చూస్తున్నాయి. అటు కెనడాలో ఐటీ, సాఫ్ట్‌వేర్, సహజ వనరులు, బ్యాంకింగ్ రంగాల్లో భారతీయ కంపెనీలు చురుగ్గా ఉన్నాయి.