పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు టర్కీ వెపన్స్ పినాకాను రంగంలోకి దించిన భారత్

టర్కీ.. అన్నంపెట్టినోడిని సున్నం పెట్టడంలో ఈ దేశం తర్వాతే ఎవరైనా. 2023లో భూకంపం దెబ్బకు ధ్వంసమైపోయిన టర్కీకి భారత్ అన్ని విధాలుగా అండగా నిలిచింది. కానీ, ఆ సాయాన్ని మరచి కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 11:45 AMLast Updated on: Feb 22, 2025 | 11:45 AM

India Has Deployed Turkeys Weapons To Pakistan And Bangladesh

టర్కీ.. అన్నంపెట్టినోడిని సున్నం పెట్టడంలో ఈ దేశం తర్వాతే ఎవరైనా. 2023లో భూకంపం దెబ్బకు ధ్వంసమైపోయిన టర్కీకి భారత్ అన్ని విధాలుగా అండగా నిలిచింది. కానీ, ఆ సాయాన్ని మరచి కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. తాజాగా తాజాగా ఇస్లామాబాద్‌కు తన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ KAANను ఆఫర్ చేసింది. అది కూడా భారత్‌కు అమెరికా ఎఫ్-35 ఫైటర్లు ఆఫర్ చేసిన కొద్దిరోజుల్లోనే. వివరంగా చెప్పాలంటే ఇండియా చేతికి ఎఫ్-35 ఫైటర్లు వస్తే పాకిస్తాన్‌ కథ ముగిసిపోతుందని తెలుసు కాబట్టే KAAN ఫైటర్లను ఇస్లామాబాద్‌కు ఆఫర్ చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో అంటకాగుతున్న బంగ్లాదేశ్‌కు ఆయుధాలను విక్రయించడం మొదలు పెట్టింది. డ్రోన్లతోపాటు అత్యాధునిక ఆయుధాలు ఢాకాకు సమకూరుస్తోంది. ఈ చర్యలు స్వతహాగానే మోడీ సర్కార్‌కు ఆగ్రహం తెప్పించాయి. అందుకే టర్కీ మైండ్ బ్లాంక్ చేసే మాస్టర్ స్ట్రాటజీని అమల్లోకి తేవాలని డిసైడ్ అయింది. టర్కీ బద్ధశత్రువు గ్రీస్‌ను సీన్‌లోకి దించుతోంది. ఆ దేశానికి మన పవర్‌ఫుల్ పినాకా రాకెట్ వ్యవస్థలను ఇచ్చి టర్కీని చావుదెబ్బ కొట్టాలని డిసైడైంది. కానీ, గ్రీస్‌కు పినాకా ఇస్తే టర్కీకి ఎలా చెక్ పడుతుంది? టాప్ స్టోరీలో చూద్దాం..

పినాకా.. ఈ పేరు వింటే పాకిస్తాన్‌ సైన్యంలో వణుకు పుడుతుంది. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో ఆ దేశ సైన్యానికి భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఇదే. శత్రువుల లక్ష్యాలపై పినాకా నిప్పుల వర్షం కురిపించింది. కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం పోరాటానికి శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఇండియాకు విజయాన్ని అందించింది. మేడ్‌ ఇన్ ఇండియా వెపన్స్‌లో అత్యంత కీలకమైనది ఈ పినాకా. పినాకను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసింది. మహాశివుడి విల్లు‌ పినాకా పేరునే దీనికి పెట్టారు. 1999లోనే భారత అమ్ముల పొదిలోకి పినాకా చేరింది. అదే ఏడాది యుద్ధంలోకి దిగిన పినాకా.. యుద్ధ భూమిలో ఇండియా పవర్ ఎలాంటిందో ప్రపంచానికి చాటింది. భారత ఆయుధాల్లో అత్యంత ప్రభావవంతమైన, విశ్వసనీయమైన ఆయుధాల్లో ఒకటిగా పినాకాకు పేరుంది. అమెరికాకు చెందిన పవర్‌ఫుల్‌ రాకెట్‌ లాంచర్ సిస్టమ్‌ హైమార్స్‌కు దీటుగా పినాకా పని చేస్తుంది. అలాంటి పవర్‌ఫుల్ రాకెట్ సిస్టమ్‌ను టర్కీ శత్రు దేశం చేతిలో పెడితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఇంత పవర్‌ఫుల్ వెపన్‌ను గ్రీస్‌కు విక్రయించడానికి రీజనేంటి?
.
నాటో దేశాలైన టర్కీ, గ్రీస్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చమురు, ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్‌లో ఎయిర్‌, సముద్ర హక్కుల కోసం రెండు దేశాలు గొడవపడుతూనే ఉన్నాయి. ఎడారిగా ఉన్న ఏజియన్‌ ద్వీపం కోసం గ్రీస్-టర్కీ 1996లో యుద్దానికి సైతం సిద్దపడ్డాయి. వివాదాస్పద దీవుల గగనతలంలో రోజువారీ ఎయిర్‌ఫోర్స్ పెట్రోలింగ్, ఇంటర్‌సెప్షన్‌ మిషన్లు ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. ఈ వివాదాన్ని అంతర్జాతీయ కోర్టులో పరిష్కరించుకుందామని గ్రీస్ కోరుతున్నా అందుకు టర్కీ నో చెబుతోంది. టర్కీ, గ్రీస్ మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన ఏడాదే పీక్స్‌కు చేరాయి. ఎయిర్‌స్పేస్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. ఒకరిని ఒకరు వెలి వేసుకున్నారు. నాటో ఎయిర్ డ్రిల్ నుంచి టర్కీని నిషేధిస్తూ గ్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 మే 9న ఏథెన్స్‌లో జరిగిన నాటో ఎయిర్ డ్రిల్‌ కార్యక్రమంలోనూ టర్కీ పాల్గొనకుండా అడ్డుకుంది. ఇంతటితో కథ ముగియలేదు.. టర్కీ ఇక ఏమాత్రం తమ మిత్రదేశం కాదని గ్రీస్ సంచలన ప్రకటన చేసింది. అప్పట్నుంచే ఈ రెండు దేశాల మధ్య ఎనీటైం యుద్ధం అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి సమయంలో ఇండియా పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను కనుక గ్రీస్‌కు ఇస్తే టర్కీ గేమ్ ఓవర్ కావడం ఖాయం.

నిజానికి.. టర్కీకి చెక్ పెట్టే వ్యూహాలను అమలు చేయడం ఇండియాకు కొత్తేం కాదు.. గతంలోనూ ఇదే పినాకాతో అంకారాకు చెక్ పెట్టారు. దీనికి ఆర్మేనియా, అరజ్‌బైజాన్ ఉద్రిక్తతలను అస్త్రంగా వాడుకున్నారు. అజర్‌బైజాన్‌కు మద్దతుగా ముందు నుంచీ పరోక్షంగా ఆర్మేనియాపై విరుచుకు పడుతున్న టర్కీ, పాకిస్తాన్‌లు 2021కి ముందు త్రీ బ్రదర్స్‌గా మారాయి. అంటే ఆర్మేనియాపై మూడు దేశాలు కలిసి ఒక్కటిగా యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అజర్‌ బైజాన్‌కు మద్దతుగా టర్కీ తన అత్యాధునిక డ్రోన్లను రంగంలోకి దించితే.. పాక్ ఏకంగా బలగాలనే పంపించిందనే ఆరోపణలున్నాయి. ఈ రెండు దేశాల జోక్యంతో విసిగిపోయిన ఆర్మేనియా మోడీ సర్కార్ సాయం కోరింది. త్రీ బ్రదర్స్‌తో ఉన్న ఇబ్బందులను చూపించి అత్యాధునిక ఆయుధాలివ్వాలని కోరింది. సాధారణంగా ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్లో తల దూర్చని మోడీ సర్కార్.. కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు అండగా నిలవడాన్ని దృష్టిలో పెట్టుకుని టర్కీ తిక్క కుదర్చాలనుకుంది. వెంటనే ఆర్మేనియాకు అండగా మేమున్నాం అంటూ దాదాపు 250 మిలియన్ డాలర్ల ఆయుధాలను ఎగుమతి చేసింది. వాటిలో గ్రీస్‌కు విక్రయించబోతున్న పినాకా రాకెట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత టర్కీ, పాక్.. ఆర్మేనియా జోలికి వెళ్లే సాహసం చేయలేదు. ఇప్పుడు గ్రీస్‌కు పినాకాను అందిస్తే టర్కీ లెక్క సరిచేసినట్టు అవుతుంది.