అర్జెంటుగా POK నుంచి దొబ్బేయండి, పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ చేసేసిన భారత్

ఓవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు తాలిబన్ల ఆక్రమణ వ్యూహం, ఇంకోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం.. విధ్వేషం, విభజన పునాదులపై పురుడుపోసుకున్న పాకిస్తాన్‌‌లో పరిస్థితులే ఇవి. కానీ, ఇవేవీ పాకిస్తాన్ పాలకులకు సమస్యల్లా కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 12:20 PMLast Updated on: Mar 26, 2025 | 12:20 PM

India Has Made Pakistan Mind Blank Urgently Withdraw From Pok

ఓవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు తాలిబన్ల ఆక్రమణ వ్యూహం, ఇంకోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం.. విధ్వేషం, విభజన పునాదులపై పురుడుపోసుకున్న పాకిస్తాన్‌‌లో పరిస్థితులే ఇవి. కానీ, ఇవేవీ పాకిస్తాన్ పాలకులకు సమస్యల్లా కనిపించడం లేదు. తమ దేశానికి ఉన్న సమస్యల్లా కశ్మీర్‌ మాత్రమే అన్నట్టుగా ఫీలవుతున్నారు. ఐక్యరాజ్యసమితిలోనూ ఆ అంశాన్నే లేవనెత్తి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇంత చేస్తే భారత్ ఊరుకుంటుందా? వెంటనే పీవోకేను ఎప్పుడు ఖాళీ చేస్తున్నావో చెప్పు అంటూ అంతర్జాతీయ వేదికపై పాక్ గాలి తీసేసింది. ఇంతకూ, ఐక్యరాజ్యసమితి సాక్షిగా అసలేం జరిగింది? దేశం తగలబడిపోతున్నా కశ్మీర్‌‌పై కారుకూతలను ఎందుకు ఆపడంలేదు? ఐక్యరాజ్యసమితిలో పీవోకేను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న ప్రశ్న వెనుక భారత్ వ్యూహం ఏంటి? టాప్ స్టోరీలో చూద్దాం..

ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై సీరియస్ డిబేట్ నడుస్తోంది. ప్రపంచ శాంతికి అవసరమైన సంస్కరణలు తీసుకురావడం ఈ చర్చల అజెండా. సభ్య దేశాలు తోచిన సూచనలు చేయొచ్చు. ఆ చర్చల్లో పాకిస్తాన్ వంతొచ్చింది. ఇంకేముంది అరిగిపోయిన పాత క్యాసెట్‌ను రీలోడ్ చేసి కశ్మీర్ రాగం అందుకుంది. జమ్మూకశ్మీర్‌కు భారత్ ఆక్రమించుకొందనీ, మోడీ ప్రభుత్వం మైనారిటీలను అణచివేస్తోందనీ నోటికొచ్చిందల్లా వాగింది. ఇంత చేస్తే భారత్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది? వెంటనే పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసింది.

ఇదీ ఐక్యరాజ్యసమితి వేదికగా ఇండియా మార్క్ మాస్ కౌంటర్. జమ్మూకశ్మీర్‌ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. ఈ ప్రాంతంలో కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉంది. విభజన ఎజెండాతో ప్రపంచం దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మీకే మంచిది” అని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌.. పాకిస్తాన్‌కు హితవు పలికారు. అయితే, ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రతినిధులు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం, వాటిని భారత ప్రతినిధులు తిప్పికొట్టడం కొత్తేం కాదు.. ఇవి నిత్యం జరిగేవే. గతవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం సమావేశంలోనూ పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి భారత్ కూడా దీటుగా బదులిచ్చింది. పాక్‌ పదే పదే అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టింది. కానీ, ఇప్పుడు ఇచ్చిన కౌంటర్ మాత్రం పాకిస్తాన్ ఏ మాత్రం ఊహించి ఉండదు. ఎందు కంటే, భారత ప్రతినిధి పర్వతనేని ప్రపంచ నేతల ముందే పాకిస్తాన్‌ను పీవోకే నుంచి బయటకు పొమ్మ న్నారు. మీరు ఆక్రమించుకున్న మా భూభాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారని ప్రశ్నించారు. ఈ దెబ్బకు పాక్ ప్రతినిధి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

పీవోకేను ఎప్పుడు ఖాళీ చేస్తారనే ప్రశ్న వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది. గత వారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కశ్మీర్ వివాదంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదానికి కారణం ఐక్యరాజ్యసమితి, పశ్చిమ దేశాలే అన్నారు. కశ్మీర్ అంశంపై తాము ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించామన్న జైశంకర్.. అప్పుడు వారు పాకిస్తాన్ దురాక్రమణను రెండు దేశాల వివాదంగా మార్చేశారని విమర్శించారు. అందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర ఉందన్నారు. దాంతో భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచం చూసే దృష్టిపై దీని ప్రభావం పడిందని మండిపడ్డారు. కశ్మీర్ సమస్య విషయంలో తప్పుడు కథనాలు రూపొందిం చడంలో యూకే, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, అమెరికా కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇండియా ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం క్లిష్టతరంగా మారిందన్నారు.

జైశంకర్ మాటలు అర్ధం లేనివేం కాదు.. కశ్మీర్ వివాదానికి మూలం ఎక్కడుందో అందరికంటే ఎక్కువగా ఐక్యరాజ్యసమితికే తెలుసు. పాక్ దురాక్రమణ గురించీ ఆ సంస్థకు పూర్తి క్లారిటీ ఉంది. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు మహారాజు హరిసింగ్ సంతకం చేశారన్న నిజం కూడా ఆ సంస్థకు తెలుసు. ఆ మాటకొస్తే ఒక్క ఐక్యరాజ్యసమితికే కాదు.. ఈ పచ్చి నిజాలన్నీ పశ్చిమ దేశాలకూ తెలుసు. అయినా వాంటెడ్‌గా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచి కశ్మీర్‌ను రెండు దేశాల వివాదంగా మార్చేశారు. దశాబ్దాలుగా రక్తపుటేరులు పారడానికి కారకులయ్యారు. విచిత్రం ఏంటంటే.. ఇప్పటికీ ఇటు ఐక్యరాజ్యసమితి కానీ, అటు పశ్చిమ దేశాలు కానీ కశ్మీర్ వివాదంలో నిజంవైపు నిలబడే ధైర్యం చేయడం లేదు. ప్రపంచంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌కే వంతపాడుతూ ఇండియాను ఇరుకునపెట్టాలని చూస్తున్నాయి. అందుకే అదే ఐక్యరాజ్యసమితి వేదికగా పీవోకే ఆక్రమణ నిజాన్ని వేలెత్తి చూపుతూ గెటౌట్ ఫ్రం పీవోకే అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది భారత్.

మోడీ సర్కార్ ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో వ్యూహం మార్చింది. పాకిస్తాన్ నిండా మునిగిన ఈ సమయం.. పీవోకే విలీనానికి సరైందిగా భావిస్తోంది. అందుకే, ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై పాకిస్తాన్ పనిపడుతోంది. పరోక్షంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ విలీనానికి వేళైందని పశ్చిమ దేశాలకు హింట్స్ ఇస్తోంది. వివరంగా చెప్పాలంటే కశ్మీర్ వివాదాన్ని రాజేసిన వాళ్లు పీవోకే విలీనం విషయంలో వేలు పెట్టొద్దని ఇన్‌డైరెక్ట్‌ వార్నింగ్ ఇస్తోంది. సో.. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం విషయంలో ఏదైనా జరగొచ్చు. అప్పటివరకూ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా.. కశ్మీర్‌పై పాక్ కారుకూతలు కూస్తూనే ఉంటుంది.