Chandrababu Naidu: టీడీపీని ఆకర్షించే పనిలో ఇండియా కూటమి..? ఇండియా నుంచి చంద్రబాబుకు వెల్లువెత్తిన సానుభూతి..!
చంద్రబాబుకు ప్రతిపక్ష ఇండియా కూటమిపార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. సమాజ‌్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్లు చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ అరెస్టును రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. చంద్రబాబులాంటి రాజకీయ నేత, మాజీ సీఎంను అరెస్టు చేయాలంటే కేంద్ర సహకారం కావాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కన బీజేపీ మద్దతుతోనే బాబును అరెస్టు చేశారని అనుమానిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే బీజేపీ నుంచి చంద్రబాబు అరెస్టు విషయంలో సరైన స్పందన లేదు.
బీజేపీ ఆచితూచి స్పందిస్తోంది. దీంతో బీజేపీ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబుకు ప్రతిపక్ష ఇండియా కూటమిపార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. సమాజ‌్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్లు చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ అరెస్టును రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. స్నేహితుల్ని అవకాశవాద రాజకీయాల కోసం వాడుకుని వదిలేయడం బీజేపీకి అలవాటని ఆ పార్టీలు విమర్శించాయి. అలాగే కూటమిలోని భాగస్వామ పార్టీలైన శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత సుక్వీర్ సంగ్ బాదల్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత డా.ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు.
ఇండియా కూటమి మద్దతు
ఇండియా కూటమి నుంచి చంద్రబాబుకు మద్దతు రావడం ఆసక్తి కలిగిస్తోంది. అలాగే బీజేపీ మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా ఉంటోంది. దీంతో చంద్రబాబను ఇండియా కూటమి వైపు ఆకర్షించే ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం గ్యారెంటీ. బీజేపీ కలిసి వస్తుందా.. లేదా.. అనే అంశం తేలాల్సి ఉంది. బీజేపీ కలిసొస్తే సరే. లేదంటే జనసేన, టీడీపీ కూటమి ఇండియా వైపు వెళ్లే అవకాశాల్ని కొట్టిపారేయలేం. అప్పటి పరిస్థితుల్ని బట్టి ఈ విషయంలో పార్టీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.