Parliament Session: నూతన భవనంలో పార్లమెంట్ సమావేశాలు.. పాత భవనానికి గుడ్‌బై..!
పార్లమెంట్ ప్రారంభమై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా కూడా జరగబోయే ఈ సమావేశాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కొత్త భవనంలో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఆదివారం పార్లమెంట్ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగరేశారు.

Parliament Session: నూతనంగా నిర్మించిన భవనంలోనే ఇకపై పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. తొలిసారిగా సెప్టెంబర్ 18, సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నె 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈసారి జరగబోయే సమావేశాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు, యూసీసీ వంటివి ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, కేంద్రం ప్రకటించిన ఎజెండాలో ఇవేవీ లేవు.
పార్లమెంట్ ప్రారంభమై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా కూడా జరగబోయే ఈ సమావేశాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కొత్త భవనంలో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఆదివారం పార్లమెంట్ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ పతాకాన్ని ఎగరేశారు. ఆదివారం సాయంత్రం పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం జరగనుంది. సాధారణంగా ఈ సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఉండవు. ప్రతి ఏడాది బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు మాత్రమే జరుగుతాయి. అంటే ఏడాదికి మూడుసార్లే. ఈసారి నిర్వహించబోయే సమావేశాలు కూడా మూడోవే. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌లో జరిగితే.. నాలుగో సమావేశాలవుతాయి. అందుకే ఈ సారి సమావేశాలు నిర్వహిస్తుండటం అన్ని పార్టీల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రత్యేక డ్రెస్ కోడ్
పార్లమెంట్‌లో సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేయబోతున్నారు. భారతీయ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా పార్లమెంట్‌లో సిబ్బంది దుస్తులు ధరిస్తారు. మగవాళ్లు తలపాగా చుట్టుకుని ఉండాలి. ఆడవాళ్లు చీరతోపాటు ప్రత్యేక జాకెట్ ధరించాలి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. డ్రెస్సులపై తామర పువ్వు ఉండటమే దీనికి కారణం. డ్రెస్సులపై బీజేపీ తమ పార్టీ గుర్తు ముద్రించి, చీక్ ట్రిక్స్‌కు పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
చరిత్రగా మిగలనున్న పాత భవనం
ఇంతకాలం పార్లమెంట్ కార్యకలాపాలకు వేదికగా నిలిచిన భవనం ఇకపై చరిత్రగా మిగలనుంది. పాత పార్లమెంట్ భవనం జనవరి 18, 1927లో ప్రారంభమైంది. బ్రిటీష్ వైస్‌రాయ్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. కొలోనియల్ రూల్, రెండో ప్రపంచ యుద్ధం, స్వాతంత్ర్యం, రాజ్యాంగం అమల్లోకి రావడంతోపాటు అనేక బిల్లులు, రాజ్యాంగ సవరణలకు పాత బిల్డింగ్ వేదికగా నిలిచింది. నూతన భవనాన్ని గత మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.