ఇండియా వర్సెస్ కెనడా, ఓ ఉగ్రవాది

కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా అరెస్ట్ అయ్యాడని, చట్ట ప్రకారం విచారణ నిర్వహించేందుకు అతడిని భారత్‌కు అప్పగించాలని కెనడా ప్రభుత్వాన్ని భారత్ విజ్ఞప్తి చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 07:24 PMLast Updated on: Nov 14, 2024 | 7:24 PM

India To Push For Terrorist Arsh Dallas Extradition After Arrest In Canada

కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా అరెస్ట్ అయ్యాడని, చట్ట ప్రకారం విచారణ నిర్వహించేందుకు అతడిని భారత్‌కు అప్పగించాలని కెనడా ప్రభుత్వాన్ని భారత్ విజ్ఞప్తి చేసింది. ఒంటారియోలోని మిల్టన్ పట్టణంలో అక్టోబర్ 27 లేదా 28న జరిగిన ఓ ఘటనలో అతని ప్రమేయం ఉందనే కారణంతో అదుపులోకి తీసుకున్నారు కెనడా పోలీసులు. ఈ అరెస్ట్ గురించి తెలుసుకున్న భారత ప్రభుత్వం… వెంటనే కెనడా ప్రభుత్వానికి ఓ అభ్యర్ధన పంపింది.

భారతదేశంలో నేర చరిత్ర, కెనడాలో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ… అతన్ని గత ఏడాది అదుపులోకి తీసుకోవాలని భారత ప్రభుత్వం కెనడాను కోరగా కెనడా ప్రభుత్వం తిరస్కరించింది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ కు చెందిన డి-ఫాక్టో చీఫ్ గా చెప్పుకుంటున్న అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లాను కెనడాలో అరెస్టు చేయడంపై నవంబర్ 10 నుండి వార్తలు వస్తున్నాయని కేంద్రం తెలిపింది. తాము ధ్రువీకరించిన తర్వాతనే… అక్కడి ప్రభుత్వానికి అభ్యర్ధన పంపినట్టు ప్రభుత్వం పేర్కొంది.

అతన్ని 2023లో ఉగ్రవాదిగా గుర్తించామని… జూలై 2023లో, అతని తాత్కాలిక అరెస్టు కోసం భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్థించినా… తిరస్కరించారని వెల్లడించింది. జనవరి 2023లో, అర్ష్ డల్లా ఇంటి అడ్రస్, అతని ఆర్ధిక లావాదేవీలు, ఆస్తులు, మొబైల్ నెంబర్ లను కెనడా ప్రభుత్వానికి భారత్ అందించింది. ఈ వివరాలన్నీ జనవరి 2023లో కెనడియన్ అధికారుల అందించారు. డిసెంబర్ 2023లో, కెనడా న్యాయ శాఖ ఈ కేసుపై అదనపు సమాచారాన్ని కోరగా… ఈ ప్రశ్నలకు ఈ ఏడాది మార్చిలో సమాధానం పంపామని విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.