Mood Of The Nation: ప్రజల మూడ్ మారిందా..? బీజేపీకి మూడినట్టేనా..? మోదీ గ్రాఫ్ డౌన్..!
గతంలో మోదీకి 72 శాతం మంది మద్దతు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 52 శాతానికి పడిపోయింది. అది కూడా కొద్ది నెలల గ్యాప్‌లోనే ఇంత భారీ మార్పు కనపడింది. అటు రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. 'INDIA" కూటమిని నడిపించే నాయకుల్లో అందరికంటే ఎక్కువగా రాహుల్‌కే ఓట్లు పడ్డాయి.

Mood Of The Nation: మూడు, నాలుగు నెలల ముందు వరకు సర్వే ఏదైనా.. పోల్ ఏదైనా మోదీదే హవా. అయితే పరిస్థితి మారుతోంది. ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.
‘ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ ఈసారి బీజేపీకి షాక్ ఇచ్చింది. 2024 జనరల్ ఎలక్షన్స్‌లోనూ మోదీని ప్రధానిగా చూడాలని 52 శాతం మంది కోరుకుంటున్నట్టు సర్వే తేల్చింది. ఇదేంటి.. మోదీకి 52 శాతం మంది సపోర్ట్‌గా ఉంటే బీజేపీకి షాక్ ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే గతంలో మోదీకి 72 శాతం మంది మద్దతు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 52 శాతానికి పడిపోయింది. అది కూడా కొద్ది నెలల గ్యాప్‌లోనే ఇంత భారీ మార్పు కనపడింది. అటు రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ‘INDIA” కూటమిని నడిపించే నాయకుల్లో అందరికంటే ఎక్కువగా రాహుల్‌కే ఓట్లు పడ్డాయి.
తక్కువ సమయంలోనే మోదీ గ్రాఫ్ పడిపోవడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి మణిపూర్ అంశం. మణిపూర్ అల్లర్లను మోదీ ఏ మాత్రం పట్టించుకోలేదని.. అక్కడ ప్రజలు మరణిస్తున్నా కనీసం స్పందించలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముగ్గురు మహిళలను వివస్త్రలుగా మార్చి ఊరేగించి, అందులో ఒక మహిళపై అత్యాచారం చేసిన ఘటన బయటకు తెలిసిన తర్వాతనే మోదీ రియాక్ట్ అవ్వడంపై సామాన్య ప్రజలు సైతం మండిపడ్డారు. మణిపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత.. అది కూడా పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు మోదీ అక్కడి అల్లర్లపై మౌనం వీడారు. ఇది ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఇక మోదీ గ్రాఫ్ పడిపోవడానికి రెండో కారణం.. ఇటివల రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు. రాహుల్ జోడో యాత్ర సక్సెస్ అవ్వడం.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తినడం.. ప్రతిపక్షాలు ఏకమవ్వడమే కాకుండా ఒకే మాటపై నిలపడుతుండడం బీజేపీకి తలనొప్పిగా మారాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్‌తో యాంటి-బీజేపీ పార్టీలు ఏకమయ్యాయి. అయితే అప్పుడు ఇంత యూనిటీ లేదు. ఇప్పుడంతా మోదీని గద్దే దింపడమే పనిగా పెట్టుకొని, కలిసి అడుగులేస్తున్నారు. కాంగ్రెస్‌పై ఛాన్స్ దొరికినప్పుడల్లా కస్సుబుస్సుమనే పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ప్రస్తుతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందు బీజేపీని ఓడించడమే ప్రధాన ఎజెండాగా వాళ్ల తీరు కనిపిస్తోంది. అందుకే బీజేపీ వైఫల్యాలను కలిసికట్టుగా ఎండగడుతున్నారు. ప్రజలకు వాటిని అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అందుకే మోదీపై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పోతుందని తెలుస్తోంది. 72 శాతం ఉన్న ఓటింగ్.. ఇప్పుడు 52శాతంగా మారడమే దీనికి సంకేతం..!