BJP Vs BRS: తెలంగాణలో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే.. ఇండియా టీవీ సంచలన సర్వే…
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో విజయం ఎవరిది అన్న దానిపై ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించగా.. ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయ్.
BJP Vs BRS: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఆసక్తి రేపుతోంది. పార్టీలన్నీ ఎలక్షన్ స్ట్రాటజీల్లో బిజీగా ఉంటే.. ఏ పార్టీ గెలుస్తుందా అని జనాలు లెక్కేస్తున్నారు. దీంతో సర్వే పేరుతో ఏది వచ్చినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో విజయం ఎవరిది అన్న దానిపై ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించగా.. ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయ్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పరిస్దితి ఎలా ఉండబోతోందన్నది తేలిపోయింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ.. లోక్‌సభ ఎన్నికల విషయంలో తెలంగాణ ఓటరు ఎలా స్పందిస్తున్నాడన్నది ఈ ఫలితాలు చెప్పాయ్. గతంతో పోలిస్తే ఓ సీటు తగ్గినా అధికార బీఆర్ఎస్ మాత్రం మరోసారి తన పట్టు కొనసాగించబోతున్నట్లు ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది.
ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్‌కు 40శాతం ఓట్లు రావచ్చని, బీజేపీకి 28 శాతం ఓట్లు రావచ్చని తేలింది. అలాగే కాంగ్రెస్ 23 శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకోవచ్చని అంచనా వేసింది. రాష్ట్రంలో లోక్‌సభ సీట్ల వారీగా చూస్తే బీఆర్ఎస్ 8 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు దక్కించుకుంటాయని ఈ సర్వే తేల్చింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్ధానాలుండగా.. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, ఎంఐఎం ఒక్క సీటు గెల్చుకున్నాయి.
ఈసారి బీఆర్ఎస్ ఒక్క సీటు కోల్పోయి 8 సీట్లకు పరిమితం కానుందని తేలింది. అలాగే బీజేపీ అదనంగా రెండు సీట్లు పెంచుకుని 6 సీట్లకు చేరుకుంటుందని, కాంగ్రెస్ ఓ సీటు కోల్పోయి 2 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే చెప్తోంది. ఎంఐఎం మాత్రం ఎప్పటిలాగే హైదరాబాద్ ఎంపీ సీటును నిలబెట్టుకునే అవకాశం ఉంది.