అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి ఇంటి బాట పడుతున్న ఇండియన్ టెకీస్
అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్ఫోర్స్, వాల్మార్ట్, ప్రైప్ లాంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి.

అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్ఫోర్స్, వాల్మార్ట్, ప్రైప్ లాంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి. 2025లో మరిన్ని ఉద్యోగాల కోతలకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీలు ముందస్తు సంకేతాలను చూపడంతో, యూఎస్ జాబ్ మార్కెట్ ఈ ఏడాది బలహీనపడవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. USకు చెందిన కోచింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్తో పోలిస్తే జనవరిలో యూఎస్లోని కంపెనీలు అధికంగా ఉద్యోగులను తగ్గించాయి.జనవరిలో 49 వేల 795 ఉద్యోగాల కోత పడింది. డిసెంబర్లో ప్రకటించిన 38 వేల 792తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. 2024 జనవరిలో ప్రకటించిన 82 వేల 307 లేఆఫ్స్ కంటే ఈ సంఖ్య 40 శాతం తక్కువ. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అంశమే తొలగింపునకు దారితీస్తోంది.
ముఖ్యంగా కొవిడ్ సమయంలో కంజ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి. వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. జనవరిలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ 3 లక్షల 53 వేల కొత్త ఉద్యోగాలను జోడించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పింక్ స్లిఫ్‌లు అందజేశాయి. యూఎస్‌లో కనీసం 25కు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేని 3 వేల 600 మందిని ఈ ఏడాది తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు.
ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని తెలిపారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ వర్క్ 1,750 మందికి ఉద్వాసన పలుకుతోంది. ఏఐ ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వాల్మార్ట్ తాజాగా కాలిఫోర్నియా, ఆకన్సవ్‌లలోని కన్సాలిడేషన్లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది. నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది. అమెజాన్ తన కమ్యూనికేషన్స్ యూనిట్లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను కుదించింది. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి పంపిన నోటీసులో తెలిపింది. ఈ టెరిమినేషన్ లెటర్స్ ప్రకారం బాధిత ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు. అంతేగాక వారికి ఎటువంటి ప్యాకేజీ ఉండదు.
ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ వంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ ఆర్గనైజేషన్‌లోని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద నిష్క్రమణ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేసింది. వీరికి పరిహారం అందించనుంది. 1,000 మందిని తగ్గించాలని సేల్స్‌ఫోర్స్ యోచిస్తోంది. అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది. జనవరి 20 నాటి అంతర్గత మెమో ప్రకారం ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో 300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఫ్రైప్ ప్రకటించింది. అయితే, కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2025 చివరినాటికి 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందిలో 4 శాతం లేదా 100 కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు జనవరిలో పేర్కొంది.