దేశం మీసం మెలేసే ఘట్టం 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ప్రయాగలోనే సగం దేశం!

ఇసుకేస్తే రాలనంత జనం! ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం! పాపాల్ని కడిగేసి.. మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశం! 144 ఏళ్లకోసారి వచ్చే మహా వైభవం! ఈ భూమి మీద జరిగే.. అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 02:20 PMLast Updated on: Feb 20, 2025 | 2:20 PM

Intersting Facts About Maha Kumbhamela

ఇసుకేస్తే రాలనంత జనం! ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం! పాపాల్ని కడిగేసి.. మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశం! 144 ఏళ్లకోసారి వచ్చే మహా వైభవం! ఈ భూమి మీద జరిగే.. అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం.. మహా కుంభమేళా! అత్యంత అరుదైన ఈ మేళాకు..ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. ఇప్పుడు.. దేశంలోని దారులన్నీ ప్రయాగవైపే వెళ్తున్నాయ్. యాత్రికులంతా మహా కుంభమేళా వైపే కదులుతున్నారు. ఇప్పటికే 55 కోట్ల మందికి పైగా.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారంటే.. మహా కుంభమేళా ఎంత గొప్పగా సాగుతుందో అర్థంచేసుకోవచ్చు.

మహా కుంభమేళా అంటేనే.. సమస్త హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహోత్సవం. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం! అణువణువునా ప్రసరించే భక్తిభావంతో.. భారతీయ సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే.. అత్యంత గొప్ప మేళా. ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనేందుకు.. భారతీయులంతా ప్రయాగ వైపు కదులుతున్న అద్భుత క్షణాలివి! మానవ చరిత్రలోనే.. ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంత జనం పాల్గొనలేదు. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సామాన్యులు, ప్రముఖులు తరలివచ్చి.. గంగ, యమున, సరస్వతి కలిచే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అందుకే.. మహా కుంభమేళా.. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా నిలుస్తోంది. కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది సాధువులు, ప్రపంచం నలుమూల నుంచి తరలివస్తున్న యాత్రికులతో ప్రయాగ్‌రాజ్ కిక్కిరిసిపోతోంది.

ఈ మహా కుంభమేళా.. ఈ మొత్తం దేశాన్ని ఆధ్యాత్మిక భావనలో మునిగితేలేలా చేసింది. ఇంతమంది భక్తజన కోటి ఒకచోట చేరే ఈ గొప్ప వేడుక గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుకతో.. ప్రయాగ్ రాజ్ వైభవోపేతంగా వెలిగిపోతోంది. 45 కోట్ల మందికి పైగా వస్తారనే అంచనాలను కూడా మించి.. భక్తజనం ఊహించని రీతిలో కుంభమేళాకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే.. అంచనా వేసిన దానికన్నా 10 కోట్ల మంది ఎక్కువ భక్తులు.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భారతదేశంలో 140 కోట్ల మందికి పైగా జనాభా ఉంటే.. వారిలో 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. వీరిలో.. దాదాపు సగం మంది ఈ మహా కుంభమేళా సమయంలో.. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహా శివరాత్రి నాటికి.. ఈ సంఖ్య 60 కోట్లు కూడా దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మహా కుంభమేళా మొదలవడానికి ముందు.. 45 కోట్ల మంది యాత్రికులు మాత్రమే వస్తారని అంచనా వేశారు. కానీ.. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడది.. 55 కోట్ల మార్క్‌ని చేరుకుంది. ఒక్క జనవరి 29న విశేషమైన మౌని అమావాస్య రోజునే.. దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. అదే.. మకర సంక్రాంతి రోజున మూడున్నర కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి.. ఇదో గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. ఈ భూమండలంలోనే.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హిందూ మహోత్సవంగా.. కుంభమేళా రికార్డులు సృష్టిస్తోంది. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఆధ్యాత్మిక వైభవాన్ని కనులారా చూసేందుకు.. తనివితీరా ఆస్వాదించేందుకు.. కోట్లాది మంది ప్రజలు త్రివేణి సంగమానికి వెళ్తున్నారు. పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి.. పుణ్యాత్ములవుతున్నారు.