తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే కొంప ముంచిన ట్రంప్

పెద్దన్న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాగానే తమ్ముడు మోడీ ఎగేసుకుంటూ అందరికంటే ముందే అమెరికా వెళ్ళాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ముచ్చట్లాడుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 01:50 PMLast Updated on: Feb 26, 2025 | 1:50 PM

Intersting News About India And America

పెద్దన్న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాగానే తమ్ముడు మోడీ ఎగేసుకుంటూ అందరికంటే ముందే అమెరికా వెళ్ళాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ముచ్చట్లాడుకున్నారు. గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని కరాకండిగా చెప్పేశాడు ట్రంప్‌. మోడీ నా మిత్రుడు అంటూనే.. భారత్‌ను గౌరవిస్తానూ అంటూనే.. సుంకాల విషయంలో మినహాయింపులు లేవంటున్నాడు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా నుంచి వచ్చే ఉత్పత్తులపైన 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించగా.. ఆయా దేశాలు స్పందించడంతో.. నెల రోజులు వాయిదా వేశారు.

తర్వాత చైనా ప్రొడక్ట్స్‌పైన 10 శాతం సుంకాలు ప్రకటించారు. ప్రతీకార సుంకాల విషయంలో భారత్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చేశారు. 2021-24 మధ్య కూడా భారత్‌కు అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ చర్యల వల్ల భారత్‌పై ఎంత ప్రభావం పడుతుందన్నది ఆందోళనకరంగా మారింది. సాధారణంగానే ఇతర దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపుగా ప్రతి దేశం సుంకాలు విధిస్తుంటుంది. ముఖ్యంగా స్వదేశంలో తయారీని ప్రోత్సహించేందుకు, ఖజానాకు ఆదాయం సమకూర్చేందుకు ఇలా చేస్తుంటాయి. ఇప్పుడు ప్రతీకార సుంకం అంటే.. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే.. ఆ తరహాలోనే ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైనా అమెరికా టారిఫ్స్ విధిస్తుందన్నమాట. ఇక్కడ దేశీయ పరిశ్రమను రక్షించాలనుకుని.. విదేశీ ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు విధించడం వల్ల కొన్ని సార్లు దేశీయ వినియోగదారులపై అధిక భారం పడే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు దేని తయారీ కోసమైనా ఇతర దేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సి వస్తే అప్పుడు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ముడిపదార్థాల ధరలు పెరిగి.. అంతిమంగా ఆ వస్తువుల ధరల్నే పెంచాల్సి వస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం.. డెయిరీ , పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వులు, నూనెగింజలు, నూనెలు, పొగాకు, పానీయాలు వంటి వాటిపై అమెరికానే భారీ సుంకాలు విధిస్తోంది. ఇంకా కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలపై, చేపల ఉత్పత్తులపై, రసాయనాలపైనా భారీగానే సుంకాలు ఉన్నాయి. ఇండియాకు సంబంధించి.. అమెరికా సుంకాల నేపథ్యంలో ఔషధాలు, రత్నాభరణాలు, ఇనుము- ఉక్కు, వాహనాలు, ఎలక్ట్రిక్ మెషీనరీ, వస్త్రాలు, జౌళి, ఆహార పదార్థాలు వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

ట్రంప్ పరస్పర సుంకాల వల్ల భారత్ కు ఏటా 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అమెరికా సుంకాల కారణంగా కెమికల్స్, మెటల్స్, ఆర్నమెంట్స్ ఎక్కువగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. వ్యవసాయ రంగం వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమెరికా దిగుమతి సుంకాల ప్రభావం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అమెరికా వాణిజ్య లోటులో భారత్ వాటా కేవలం 3.2 శాతం మాత్రమే. అయినప్పటికీ, ట్రంప్ ఇప్పటికే బ్రిక్స్ దేశాలను బెదిరించారు. ఇందులో భాగమైన చైనాపై చర్యలు కూడా తీసుకున్నారు. భారత్ కూడా బ్రిక్స్ గ్రూపులో భాగమే. ట్రంప్ మరిన్ని చర్యలకు దిగొచ్చు. మొదటి పదవీకాలంలో స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధించారు. అయితే, హార్లే డేవిడ్‌సన్ బైకుల దిగుమతులపై భారత్ సుంకాలను తగ్గించింది. పన్నులు పెంచుతామని ట్రంప్ నిరంతరం బెదిరింపులకు దిగుతున్నప్పటికీ, భారత అతిపెద్ద మార్కెట్‌ అనే విషయాన్ని అమెరికా విస్మరించలేదు. ట్రంప్ హెచ్చరికలతో సుంకాల వ్యవహారంపై భారత్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై సుంకాన్ని కాస్త తగ్గించే యోచన చేస్తోంది. ఇలాంటి నిర్ణయం వల్ల దేశంలోని పరిశ్రమలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు దేశీయ పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశ్యంతో విదేశీ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

ఉదాహరణకు, ఒక వాహన కంపెనీ తమ దేశంలో తయారు కాని విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది ముడి పదార్థాల ధరలను పెంచి, అంతిమ ఉత్పత్తి ధరను కూడా పెంచుతుంది. ఫలితంగా, ఇలాంటి సుంకాలు దేశీయ వినియోగదారులపై కూడా భారం అవుతాయి. సరకుల ఎగుమతుల్లో భారత్‌కి యూఎస్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్ వంటి టెక్ దిగ్గజాలు, అలాగే అమెజాన్, వాల్‌మార్ట్ వంటి ఇ-కామర్స్ లీడర్స్ సహా అమెరికన్ కంపెనీలకు భారతదేశం కీలకమైన మార్కెట్. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో అతిపెద్ద యూజర్‌ బేస్‌ని కలిగి ఉన్నాయి. ఇది వస్తువుల వ్యాపారం కంటే యూఎస్‌కి విలువైన మార్కెట్‌గా మారింది. పరస్పర సుంకాలను సెట్ చేయడానికి యుఎస్ ప్రయత్నం చేసినా.. ఇరు దేశాల ఎగుమతి ప్రొఫైల్‌లలో తేడాలు ఉన్నందున ఇది భారత్ ను ఎక్కువ దెబ్బతీయకపోవచ్చనే వాదన కూడా ఉంది. 2021-24 సందర్భంగా అమెరికా భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశం మిగులు ఉన్న కొన్ని దేశాలలో యుఎస్ ఒకటి. 2023-24లో, యునైటెడ్ స్టేట్స్ 119.71 బిలియన్ డాలర్ల వస్తువులలో ద్వైపాక్షిక వాణిజ్యంతో భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కానీ ట్రంప్ వైఖరి చూస్తుంటే సుంకాల విషయం వెనక్కితగ్గేలా కనిపించటం లేదు.

ఓవైపు మోడీని, భారత్ ను గౌరవిస్తూనే.. ఆయన ప్రతీకార సుంకాల గురించి మాట్లాడుతున్నారు. కనీసం కొన్నాళ్లపాటైనా ట్రంప్ సుంకాలు తప్పవు. ఔషధాల దిగుమతులపైనా సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. ఇది అమెరికా మార్కెట్‌పైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న భారత దిగ్గజ ఫార్మా కంపెనీలకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. దిగుమతులపైన 25 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఏప్రిల్ 2న నిర్ణయం ప్రకటించనున్నారు. మనదేశం నుంచి అమెరికాకు మందులు ప్రధానంగా జనరిక్ ఔషధాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఏటా బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతుంటుంది. భారత్‌కు ప్రధాన మార్కెట్ ఇక్కడ అమెరికానే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఔషధాల ఎగుమతుల్లో అమెరికా వాటానే 31 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, లుపిన్, అరబిందో ఫార్మా వంటివి ఉన్నాయి. భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్న ఆర్థిక సాయం నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా దగ్గరచాలా డబ్బుంది. ప్రపంచంలో ఎక్కువ పన్నులు వేసే దేశాలలో ఇండియా కూడా ఒకటి.

మేమెందుకు ఆ దేశానికి 21 మిలియన్ డాలర్లు చెల్లించాలి. వాళ్లు మాపై అత్యధిక పన్నులు వేస్తున్నారు కాబట్టి మేము కూడా వేస్తాం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనేక దేశాలకు ఆర్థిక సహాయం అందుతోంది. భారత్‌కు కూడా అనేక ప్రాజెక్టుల కోసం నిధులు విడుదలయ్యాయి. గత ఏడాది మాత్రమే భారత్‌కు రూ. 1,228 కోట్ల సాయం అందింది. ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణ, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, విద్య రంగాల్లో ఈ నిధులు ఉపయోగపడ్డాయి. భారత్‌లో క్షయ వ్యాధి నివారణ, HIV నియంత్రణ, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు అమెరికా ఆర్థిక సహాయం ఎంతో కీలకంగా మారింది. స్వచ్ఛ భారత్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఈ నిధులు ఉపయోగపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, తాజా పరిణామాల్లో అమెరికా తన విదేశీ సాయాన్ని తగ్గించనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దీనివల్ల భారత్‌పై తక్కువ లేదా అసలు ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే భారత్ స్వయం సమృద్ధి దిశగా ప్రయాణిస్తోంది.

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో, విదేశీ సహాయంపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను స్వతంత్రంగా అమలు చేయగల సామర్థ్యాన్ని పెంచుకుంది. అంతేకాకుండా, స్వదేశీ నిధులతోనే అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఓవైపు సుంకాల పేరుతో భారత్ ను బెదిరిస్తున్న ట్రంప్.. ఇండియాలో పెట్టే పెట్టుబడుల్‌ని కూడా నిరుత్సాహపరుస్తున్నారు. భారత్ లో టెస్లా ను లాంచ్ చేయాలని ఎలాన్ మస్క్ గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే టెస్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసి కార్లను తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ముంబై, ఢిల్లీలో షోరూంల కోసం ప్లేస్ ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఏప్రిల్ నుంచి దిగుమతి చేసుకున్న టెస్లా కార్లను భారత్ లో విక్రయించాలనే ప్రణాళికతో ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం అమెరికా ప్రయోజనాల దృష్ట్యా సరికాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద ట్రంప్ హయాంలో భారత్ కు చేదు గుళికలు మింగక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనుకోవచ్చు.