ఏపీలో మద్యం బాలేదా..? సిక్కోలు నుంచి చిత్తూరు వరకు నాటు సారాకు భారీ డిమాండ్

సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ మద్యం ఉత్పత్తి, రవాణా అణిచివేతకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 09:15 PMLast Updated on: Apr 14, 2025 | 9:15 PM

Is Alcohol Bad In Ap Huge Demand For Natu Sara From Sikkolu To Chittoor

సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ మద్యం ఉత్పత్తి, రవాణా అణిచివేతకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తోంది. నవోదయం 2.0 కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులలోని కీలక ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించబడ్డాయి. ఈ దాడుల ద్వారా అనేక మద్యం ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి, వందలాది లీటర్ల బెల్లం ఊట, నాటు సారాతో పాటుగా ఇతర రాష్ట్రాల మద్యం భారీగా స్వాధీనం చేసుకున్నారు.

సాధారణ పరిపాలనా శాఖ (రాజకీయం) , ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా స్పష్టమైన ఆదేశాలతో.. ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ నేతృత్వంలో రాష్ట్రం నుంచి 228 మంది, పొరుగు రాష్ట్రాల నుంచి 153 మంది — మొత్తం 381 మంది అధికారులు ఈ మద్యం మాఫియా గుట్టు తేల్చేందుకు సిద్దమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది సహకారం కూడా తీసుకున్నారు. మొత్తం 56,200 లీటర్ల బెల్లం ఊట, 2,070 లీటర్ల నాటు సారా, 25 కిలోల అమోనియా స్వాధీనం చేసుకున్నారు. 50 మద్యం ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం 28 కేసులు నమోదు చేసారు.

శ్రీకాకుళం జిల్లాలో, ఏప్రిల్ 11న జరిగిన దాడుల్లో నరసన్నపేట, ఇచ్ఛాపురం, పాలసా తదితర స్టేషన్ల నుంచి 52 మంది ఎక్సైజ్ అధికారులు, ఒడిశాలోని చికుడి, జార్డా ప్రాంతాల నుంచి 80 మంది అధికారులు పాల్గొన్నారు. పోట్కాసింగ్, బుడజోలా, గోంగాపూర్ లాంటి మద్యం ఉత్పత్తి హాట్‌స్పాట్లపై దాడులు జరిపారు. 26,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడంతోపాటు, 1,750 లీటర్ల ఐడి మద్యం, 100 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జిల్లాలో మొత్తం 12 కేసులు నమోదు చేసారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో, ఏప్రిల్ 7, 8 తేదీలలో జరిగిన సంయుక్త దాడుల్లో పార్వతీపురం, కురుపాం, సాలూరు తదితర స్టేషన్ల నుంచి 71 మంది ఎక్సైజ్ సిబ్బంది, ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నుంచి 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఎగువ బోతడపల్లి, జయకోట, కుత్రుబంకిడి ప్రాంతాల్లో దాడులు జరిపి, 22,900 లీటర్ల పైగా బెల్లం ఊట ధ్వంసం చేశారు. 260 లీటర్ల ఐడి మద్యం, 15 కిలోల అమోనియా స్వాధీనం చేసుకోగా.. మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో, ఏప్రిల్ 3న తెలంగాణ సరిహద్దు వెంబడి గుండువారి గూడెం, పిచ్చుకులపాడు ప్రాంతాల్లో రెండు విడతల్లో దాడులు జరిగాయి. ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన 120 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. 25,300 లీటర్ల బెల్లం ఊట, 260 లీటర్ల ఐడి మద్యం, 120 కిలోల బెల్లం, 10 కిలోల అమోనియా స్వాధీనం చేశారు. గత డిసెంబర్ 24న వలువ, కెరడ ప్రాంతాల్లో కూడా 11,200 లీటర్ల బెల్లం ఊట, 200 లీటర్ల ఐడి మద్యం ధ్వంసం చేశారు. మొత్తం 3 కేసులు నమోదయ్యాయి.

చిత్తూరు జిల్లాలో, తమిళనాడు అధికారులతో కలిసి ఏప్రిల్ 5న రామకుప్పం మండలంలోని దేవరాజకుప్పం, కొర్నాలతండ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇక్కడ మద్యం తయారీకి సిద్ధం చేసిన 50 బ్రేవింగ్ యూనిట్స్ ను ధ్వంసం చేయడం జరిగింది. 2 కేసులు నమోదు చేసారు. అనంతపురం జిల్లాలో, ఏప్రిల్ 12న గూటి, కల్యాణదుర్గం, బీకే సముద్రం స్టేషన్ పరిధిలో కర్ణాటక సరిహద్దు వెంట దాడులు జరిపారు. అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈ ఎస్ టి ఎఫ్, గూటి, బీకే సముద్రం, కల్యాణదుర్గం స్టేషన్ల సిబ్బంది పాల్గొన్న ఈ దాడుల్లో 950 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 6 లీటర్ల ఐడి మద్యం స్వాధీనం చేసుకున్నారు. 6 మందిని నిందితులుగా గుర్తించారు.

ఏప్రిల్ 13న అనంతపురం , శ్రీ సత్యసాయి జిల్లాల్లో గుంటకల్, కల్యాణదుర్గం, కదిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు జరిగాయి. మొత్తం 5 కేసులు నమోదు కాగా, 745 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 26 లీటర్ల ఐడి మద్యం స్వాధీనం చేసుకుని 6 మందిని అరెస్టు చేశారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో తయారు చేస్తున్న మద్యానికి డిమాండ్ కూడా ఉండటం చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ప్రభుత్వ మద్యం తక్కువ ధరకే దొరుకుతున్నా.. నాటు సారాను ఎందుకు ఈ రేంజ్ లో తయారు చేస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ పెద్దలు సైతం నివేదికలు చూసి కంగు తిన్నారు. గతంలో తెలంగాణా పల్లెల్లో మాత్రమే ఇది ఎక్కువగా ఉండేది. ఏపీలో ఈ స్థాయిలో రవాణా, తయారి జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో మన్యంలోనే ఎక్కువగా తయారి ఉండగా.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల లీటర్ల మద్యం తయారు చేస్తున్నారు.