Ali : గుంటూరు బరిలో అలీ…! వైసీపీ వ్యూహమేంటి..?
సినీనటుడు, వైసీపీ నేత అలీ గుంటూరు నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా...? అలీని దించాలన్న ఆలోచనలో వైసీపీ ఎందుకుంది...? అలీని దింపడం వెనక వైసీపీ వ్యూహమేంటి...?
సినీనటుడు, వైసీపీ నేత అలీ గుంటూరు నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా…? అలీని దించాలన్న ఆలోచనలో వైసీపీ ఎందుకుంది…? అలీని దింపడం వెనక వైసీపీ వ్యూహమేంటి…?
గుంటూరు ఎంపీగా ప్రస్తుతం టీడీపీ నేత గల్లా జయదేవ్ ఉన్నారు. అయితే ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగా పలు పేర్లను పరిశీలిస్తోంది. 2019లో గల్లా జయదేవ్ చేతిలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కేడర్‌కు దూరమయ్యారు. నేనేంటి నా పనేంటి అన్నట్లు ఉంటున్నారు. అసలు ఆయన నియోజకవర్గంలో ఎక్కడా తిరగడం లేదు… ఏ నేతతోనూ మాట్లాడటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ పోటీ చేయడం అనుమానంగా మారింది. దీంతో వైసీపీ ప్రత్యామ్నాయంగా పలు పేర్లను పరిశీలిస్తోంది. సినీనటుడు అలీని బరిలోకి దింపితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తోంది. అలీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని చాలా కుతుహులంతో ఉన్నారు. 2019లోనే ఆయన పోటీకి సై అన్నా కుదరలేదు.
అలీనే ఎందుకు…?
అలీని దించాలన్న ప్రతిపాదన వెనక పెద్ద వ్యూహమే ఉంది. గుంటూరు లోక్‌సభ స్థానంలో దాదాపు పదకొండున్నర శాతం మంది ముస్లింలు ఉన్నారు. అలీని రంగంలోకి దించితే ఆ ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయని ఆ పార్టీ ఆశిస్తోంది. దీనికి తోడు ఎస్సీలు దాదాపు 19.5శాతం ఉన్నారు. వారిని కూడా తమవైపు తిప్పుకోగలిగితే గెలుపు గ్యారెంటీ అన్నది ఆ పార్టీ లెక్క. అలీని బరిలోకి దించితే గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ముస్లిం ఓట్లన్నీ చెక్కు చెదరకుండా తమవైపే ఉంటాయని లెక్కగడుతోంది. అది అసెంబ్లీ అభ్యర్థులకు కూడా కలసి వస్తుందని ఆలోచిస్తోంది. గతంలో టీడీపీ ఇక్కడ ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించి విజయం సాధించింది. ఈసారి అదే అస్త్రాన్ని టీడీపీపై ప్రయోగించాలన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. 1991 సాధారణ ఎన్నికల్లో లాల్‌జాన్ భాషా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎన్జీరంగాపై 14వేల 744ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు. గుంటూరు ఎంపీగా పనిచేసిన ఏకైక ముస్లిం లాల్‌జాన్‌భాషానే… అయితే ఆ తర్వాత ఆయన వరుసగా రెండుసార్లు బలమైన రాయపాటి చేతిలో ఓడిపోయారు. మరి దీన్ని వైసీపీ గమనించిందో లేదో మరి…!
అలీకి పోటీ లేదా…?
నిజానికి గుంటూరు ఎంపీ స్థానంలో వైసీపీ తరపున పోటీచేసేందుకు భారీ పోటీ అయితే కనిపించడం లేదు. 2014లో మోపిదేవి, 2019లో మోదుగుల ఓడిపోయారు. మూడోసారి ఇక్కడ ఓడిపోకూడదన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ పలు పేర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు నుంచి ఎంపీగా బరిలోకి దించొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఆయన టీడీపీలో చేరతారంటూ ఆ మధ్య పెద్ద టాకే నడిచింది. ఒకవేళ మోదుగుల పోటీ చేయాలని భావిస్తే మాత్రం ఆయన్ను నర్సరావుపేటకు పంపి లావు శ్రీకృష్ణదేవరాయులును ఇక్కడ బరిలోకి దించొచ్చన్నది మరో ప్రచారం.
టీడీపీ అభ్యర్థి ఎవరో…?
టీడీపీ నుంచి గల్లా జయదేవ్ రెండుసార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. అయితే కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. తమ ఎంపీని గుంటూరు ప్రజలు బయట చూసి చాలా కాలమైంది. మీడియాలో కూడా కనిపించడం లేదు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం మరోసారి గల్లానే పోటీ చేయవచ్చని అంటున్నాయి. ఒకవేళ గల్లా బరిలోకి దిగితే అలీ సినీగ్లామర్ కలిసి వస్తుందన్నది వైసీపీ ఆలోచన.
అలీ వచ్చే ఎన్నికల్లో గుంటూరు బరిలో దిగుతారా లేక ఆ సమయానికి కొత్త పేర్లు తెరపైకి వస్తాయా అన్నది చూడాల్సి ఉంది. దిగితే మాత్రం పోరు రసవత్తరమే అంటున్నారు పరిశీలకులు.