Bandi Sanjay: ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బండి సంజయ్…!

బండి హయాంలోనే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపు వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే ముందుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆ బాధ్యతలు బండి సంజయ్‌కు అప్పగించాలని డిసైడైనట్లు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2023 | 05:37 PMLast Updated on: Jul 29, 2023 | 5:37 PM

Is Bandi Sanjay Going To Be Ap Bjp In Charge

మీరు సరిగానే విన్నారు… ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బండి సంజయ్‌ను నియమించబోతున్నారట. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్‌టాపిక్. తెలంగాణలో బీజేపీకి ఊపుతెచ్చిన బండి అయితేనే ఏపీలో కూడా పార్టీ పట్టాలెక్కుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

బీజేపీ జాతీయ కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించిన సమయంలో ఆయన్ను కేంద్రమంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ పెద్దల ఆలోచన మాత్రం వేరేగా ఉంది. బండిని పార్టీ అవసరాల కోసమే వాడుకోవాలని వారు నిర్ణయించారు. అందుకే ఎన్నికల వేళ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. బండి సంజయ్ కూడా ఆరేడు నెలలు ఉండే మంత్రి పదవిపై ఆసక్తిని చూపలేదు. దీంతో ఆయన్ను జాతీయ స్థాయి పదవి వరించింది.

జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఛార్జ్‌ బాధ్యతలు కూడా బండి సంజయ్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా… ఈ దిశగా ఈపాటికే నిర్ణయం జరిగిపోయినట్టు పార్టీ ఇంటర్నల్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో కమలం ఐసీయూలో ఉంది. తట్టి లేపినా, తన్నిలేపినా లేచే పరిస్థితి లేదు. ఉన్న కొద్ది పాటి నేతలది తలో వర్గం. ఏపీ బీజేపీ అనగానే ఠక్కున చెప్పడానికి పట్టుమని పదిపేర్లు కూడా గుర్తురావు. కేంద్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ఈ దుస్థితి ఏంటన్న ఆలోచన హైకమాండ్‌లో ఉంది. పార్టీని గాడిన పెట్టే కార్యక్రమంలో భాగంగానే ఇటీవల సోమువీర్రాజును రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించారు. చిన్నమ్మ కాస్త దూకుడుగా వెళుతున్నారు. అయితే అది సరిపోదని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఏపీలోనూ అమలు చేయాలని భావిస్తోంది.

బండి సంజయ్‌ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక పార్టీకి కొత్త ఊపు వచ్చింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వివాదాస్పద అంశాలను నెత్తికెత్తుకున్నారు. అవసరమైతే తానే వివాదాల్లో నిలిచారు. పార్టీ కేడర్‌ను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి ప్రయత్నించారు. బండి హయాంలోనే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపు వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే ముందుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆ బాధ్యతలు బండి సంజయ్‌కు అప్పగించాలని డిసైడైనట్లు సమాచారం. ఏపీ గురించి ఎంతో కొంత అవగాహన ఉన్న బండి అక్కడ పార్టీకి కొత్త ఊపు తీసుకురాగలరన్నది అమిత్‌షా ఆలోచనగా కనిపిస్తోంది. సో ఇక ఏపీలో బండి మార్క్‌ రాజకీయం కనిపించబోతోందన్నమాట..