బెంగాల్ హింసలో బంగ్లా ఉగ్రముఠా, మమత స్వార్ధమే కొంప ముంచిందా?
జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్.. బంగ్లాలో షరియా చట్టం ఆధారంగా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఉగ్రసంస్థ.

జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్.. బంగ్లాలో షరియా చట్టం ఆధారంగా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఉగ్రసంస్థ. ఇప్పుడు ఇదే ఉగ్రసంస్థ బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లో అడుగు పెట్టింది. అంతేకాదు, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఆసరగా చేసుకొని దేశంలో అలజడి సష్టించడానికి కుట్రలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాయి. కానీ, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాన్నే నమ్ముకున్న దీదీ.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముర్షిదాబాద్ హింసకు దీదీ వైఖరే కారణంఅన్న విమర్శలు కూడా ఉన్నాయి.ఇంతకూ, అసలేంటి జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్? ఈ ఉగ్రముఠా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి ఎలా ఎంటరైంది? బెంగాల్ ఆందోళనలు దేశ వ్యాప్తంగా విస్తరించబోతున్నాయా? టాప్ స్టోరీలో చూద్దాం..
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. కానీ, వెస్ట్ బెంగాల్‌లో మాత్రం ఎప్పట్లానే హింసాత్మకంగా మారాయి. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని, మత స్వేచ్ఛను హరిస్తాయని ఆరోపిస్తూ అక్కడ నిరసనలు ప్రారంభించారు. ముర్షిదాబాద్‌లో ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. జంగీపూర్, ధూలియాన్ ప్రాంతాల్లో నిరసనకారులు రైల్వే స్టేషన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. ముగ్గురు హిందువులను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ చంపేశారు. ఆ తర్వాత పరిస్థి తులు మరింత దారుణంగా మారాయి. ఎప్పుడు ఏంజరుగుతుందో అన్న భయంతో 400 కుటుంబాలు ధులియాన్ నుంచి సమీపంలోని మాల్డా ప్రాంతానికి వలసవెళ్లినట్టు వెస్ట్ బెంగాల్ శాసన సభ విపక్ష నేత సువేందు అధికారి సోషల్ మీడియాలో తెలిపారు. బాధితులంతా స్థానిక నదిని దాటి మాల్దా జిల్లాలోని బైస్నాబ్‌నగర్ ఉన్న పాఠశాలలో తలదాచుకుంటున్నారని తెలిపారు.
ముర్షిదాబాద్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి బాధితులు వలస వెళుతున్న ఈ వీడియోలు చూస్తే చాలు. కానీ, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడా లేనంత హింస వెస్ట్ బెంగాల్‌లో ఎందుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఒక ప్రకటనే. వక్ఫ్ సవరణ బిల్లును పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయబోమని, మతపరమైన విభజన రాజకీ యాలను సహించబోమని దీదీ ప్రకటించారు. ఇది ముస్లింల ఆందోళనలకు ఆజ్యం పోసిందన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. 2019 సీఏఏ సమయంలోనూ బెంగాల్‌లో నిరసనలు తీవర హింసాత్మకంగా మారాయి. ఇప్పుడు కూడా అలా జరుగుతుందని తెలిసీ దీదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనేది విశ్లేషకుల మాట.
బెంగాల్‌లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్రం లో ముస్లింలు మొత్తం జనాభాలో సుమారు 27శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ లెక్క 30శాతం వరకు ఉంటుందని అంచనా. ముస్లింలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లో ఎదిగిన మమతా బెనర్జీ సొంత పార్టీ పెట్టుకోవడంతో వారంతా ఆమె వైపు వెళ్లారు. వారి మద్దతు కాపాడుకో డానికి మమత చేయగలిగినంతా చేస్తూంటారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఆమెకు మరో ఆయుధంగా దొరికింది అనేవారూ ఉన్నారు. ఈ బిల్లును అమలు చేయబోమని చెప్పడం ద్వారా ముస్లింలను మమత మరింత రెచ్చగొట్టారనీ.. అల్లర్ల విషయంలో కట్టడి చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. హింస ప్రేరేపించే వారిపై ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చర్యలు తీసుకోలేదన్న వాదనలూ బలపడుతున్నాయి. కేంద్ర బలగాల మోహరింపు కోసం చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటేనే బెంగాల్‌లో మమత సర్కార్ తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ, సమస్య కేవలం బెంగాల్ కాదు.. అంతకుమించి జరగబోతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఉగ్రశక్తులు చొరబడుతున్నాయి కాబట్టి.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఉగ్ర కన్నుపడింది. భారత్‌లో ఇలాంటి ఒక అవకాశం కోసమే ఎదురుచూస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రశక్తులు బెంగాల్‌లో ఎంట్రీ ఇచ్చాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వాటిలో జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో బెంగాల్‌లో దాడులు నిర్వహించిన ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ JMB మళ్లీ క్రియాశీలంగా మారుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న ఏడు జిల్లాల్లో మాడ్యూళ్లు ఏర్పాటు చేసి, మదర్సాల ద్వారా యువకులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ముర్షిదాబాద్, మాల్డా జిల్లాలు JMB కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 2019లో సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ఉపయోగించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మమతా బెనర్జీని హెచ్చరించినా సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరిపించాలనీ డిమాండ్ చేస్తోంది. చూస్తుంటే ఈ వ్యవహారం రాజకీయంగానూ సెగలు రేపబోతున్నట్టు కనిపిస్తోంది.