Vivek: మరో రిచెస్ట్ పొలిటీషియన్.. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి !
ఎంపీ వివేక్ కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
త్వరలో బీజేపీకి బిగ్ షాక్ తగలబోతోందని తెలుస్తోంది. ఆ పార్టీ కీలక నేత పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి తన రాజకీయ పుట్టినిల్లు కాంగ్రెస్ గూటిలోకి మళ్లీ వెళ్లబోతున్నారని సమాచారం. హస్తం పార్టీలో వివేక్ చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని చెబుతున్నారు. ఆగస్టు 30న ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడం.. తన తర్వాత పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్ కు పెద్ద పోస్ట్ ఇవ్వడంతో వివేక్ బాధపడ్డారట. అందుకే ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారట. సీఎం కేసీఆర్ పై దూకుడుగా దూసుకుపోయిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడే .. తెలంగాణలో కమల దళం గ్రాఫ్ పడిపోయిందనే ఒపీనియన్ ఆయనకు వచ్చిందట. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీలో ఉన్నా.. పెద్దగా ఫలితంగా ఉండదని వివేక్ అనుకుంటున్నారట.
కాంగ్రెస్ పెద్దలతో సీక్రెట్ మీటింగ్స్..
ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పెద్దలతో సీక్రెట్ మీటింగ్స్ కు హాజరైన ఆయన .. పెద్దపల్లి లోక్ సభ టికెట్ పై హామీని తీసుకున్నారట. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉన్న వివేక్ చేరిక.. అక్కడ తమ బలాన్ని మరింత పెంచుతుందని హస్తం పార్టీ అధినాయకత్వం భావిస్తోందని తెలిసింది. ఆ లోక్ సభ సీటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు కూడా వివేక్ సహకరిస్తారనే ఆశాభావంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వివేక.. 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయాక బీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారన్న విమర్శలతో పార్టీ ఆయన్ని పక్కనబెట్టింది.
చెన్నూరు నియోజకవర్గంలో..
ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ మాల రిజర్వేషన్ ఉంది. దీంతో ఎంతోమంది అభ్యర్థులు ఈ నియోజకవర్గంపై కన్నేస్తున్నారు. వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ఇన్నాళ్లూ ప్రచారం జరిగింది. ఈవిషయంలో వివేక్ కు కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందా ? ఇవ్వలేదా ? అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఏదిఏమైనప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలోని రిచెస్ట్ పొలిటీషియన్స్ ను తన వైపు లాగడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతోంది. రాష్ట్రంలోనే ధనిక రాజకీయ నాయకులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ లను కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీకి జై కొట్టారు. ఇప్పుడు వివేక్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఫ్యూచర్ లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక ఈటల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారనే ఆందోళనతోనే ఆయనకు బీజేపీ అధినాయకత్వం కీలకమైన బాధ్యతను కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించే నాటికి తెలంగాణ రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి.