Pawan Kalyan: ఆడుకుంటున్న బీజేపీ.. దిక్కుతోచని స్థితిలో పవన్..!
పవన్ కల్యాణ్ అశించినట్లు బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవచ్చు. ఒక వేళ అలా రాకపోతే పవన్ కల్యాణ్ తన దారి తాను చూసుకోవాల్సి ఉంటుంది. బహుశా ఇప్పుడిప్పుడే పవన్ కల్యాణ్ కు అర్థమవుతూ ఉండొచ్చు తాను పులి మీద స్వారీ చేస్తున్నానని!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ పర్యటనపై మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవాలని పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అయితే మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. చివరకు నడ్డాతో సుదీర్ఘంగా భేటీ అయి తాను వచ్చిన ఉద్దేశాన్ని పవన్ కల్యాణ్ పూసగుచ్చినట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితితో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నడ్డాతో పవన్ చర్చించారు. తన మనసులో ఏముందో చెప్పిన పవన్ … బీజేపీ ఉద్దేశమేంటో చెప్పేందుకు కాస్త గడువు ఇచ్చారు.
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నా.. బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకే ఆయన పర్యటన సాగినట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పొత్తులపై క్లారిటీ కోసం ఆయన ప్రయత్నించారు. ఏపీలో అధికార వైసీపీని ఓడించాలంటే పొత్తులు తప్పనిసరి అని పవన్ తేల్చేశారు. బీజేపీ – జనసేన కలిస్తే సరిపోదని, టీడీపీని కూడా కలుపుకుని ముందుకు వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని కమలం పార్టీ హైకమాండ్ కు కుండబద్దలు కొట్టారు. మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తే కలిగే ప్రయోజనాలపై పవన్ నివేదిక సమర్పించారు.
పవన్ కల్యాణ్ చెప్పినవన్నీ జేపీ నడ్డా ఆసక్తిగా విన్నారు. ఇటీవలికాలంలో ఏపీలో జరిగిన పరిణామాలు, తాజా సర్వేలు, పార్టీల బలాబలాలు, ఏ పార్టీ ఎవరితో కలిస్తే ఎవరికి ప్రయోజనం.. లాంటి అనేక అంశాలను నివేదిక రూపంలో నడ్డాకు సమర్పించారు పవన్. తాను చెప్పినవన్నీ నడ్డా ఆసక్తిగా విన్నారని పవన్ అనుకుంటున్నారు. కచ్చితంగా త్వరలోనే బీజేపీ హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. నడ్డాతో పాటు పార్టీ సీనియర్ నేత శివప్రకాశ్, రాష్ట్ర ఇన్ ఛార్జ్ మురళీధరన్ తో కూడా ఇదే అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. బీజేపీ హైకమాండ్ తో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చించడం ఇదే తొలిసారి. అయితే బీజేపీ ప్రశ్నలకు పవన్ నీళ్లు నమలినట్లు తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఎందుకు మద్దతివ్వలేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అయితే తాను వైసీపీ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చినట్టు చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు శాటిస్ ఫై కాలేదు.
అయితే పవన్ కల్యాణ్ చెప్పినట్టు చేస్తే అది బీజేపీ ఎందుకవుతుంది? ఎవరికో వెళ్తే ప్రయోజనమో లెక్కలేసుకుని తను చేయాల్సింది చేస్తుంది. ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా ఏపీలో అన్ని పార్టీలూ బీజేపీ భజన చేస్తున్నాయి. ఇప్పుడు టీడీపీతో కలిసి వెళ్తే వైసీపీ దూరమవుతుంది. వైసీపీతో బీజేపీకి చాలా ప్రయోజనాలు సమకూరుతున్నాయనేది టాక్. అలాంటప్పుడు ఏ పార్టీతో అయినా వైరం ఎందుకు కోరుకుంటుంది. కాబట్టి పవన్ కల్యాణ్ అశించినట్లు బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవచ్చు. ఒక వేళ అలా రాకపోతే పవన్ కల్యాణ్ తన దారి తాను చూసుకోవాల్సి ఉంటుంది. బహుశా ఇప్పుడిప్పుడే పవన్ కల్యాణ్ కు అర్థమవుతూ ఉండొచ్చు తాను పులి మీద స్వారీ చేస్తున్నానని!