MLC Kavitha: నెక్స్ట్ కవితేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిని అరెస్టు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ అరెస్ట్ కవితదేనేమో అనే అనుమానాలు తలెత్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2023 | 04:20 PMLast Updated on: Feb 14, 2023 | 4:20 PM

Is Cbi Going To Arrest Kavitha Soon

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. వరుస అరెస్ట్ లతో నిందితుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒకవైపు సిబిఐ, మరోవైపు ఈడి ఎపుడు ఎవరిని అరెస్ట్ చేస్తాయోననే ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు వ్యాపారవేత్తలకు పరిమితమైన అరెస్టులు.. ఇప్పుడు రాజకీయ నాయకుల వారసుల దాకా చేరాయి.

లిక్కర్ స్కాంలో తాజా పరిమాణాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండి దర్యాప్తు సంస్థలు తమ అరెస్టుల్లో వేగం పెంచాయి. ఇప్పటి వరకు సిబిఐ ముగ్గురిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయగా, ఈడి మాత్రం ఏకంగా 9 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22ను రూపొందించడంలోనూ, అమలు చెయ్యటంలోనూ అవినీతి, అక్రమాలు జరిగాయని గత ఏడాది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దాంతో కేంద్ర హోంశాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరపాలని లేఖ రాసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం, ఆయన బంధువుల నివాసాల్లోనూ సిబిఐ సోదాలు నిర్వహించింది. ఆగస్ట్ 17న సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో 15 మంది నిందితులతో పాటు ఇతరులపై FIR నమోదు చేసింది.

లిక్కర్ స్కాం FIRలో సిబిఐ ఢిల్లీ డిఫ్యూటీ CMను A1గా చేర్చింది. ఈ కేసులో CBI తొలి అరెస్ట్ సెప్టెంబర్ 7న ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కోఆర్డినేటర్ విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 10న తెలంగాణకు చెందిన అభిషేక్ బోయిన్ పల్లిని అరెస్ట్ చేసింది CBI.. ఫిబ్రవరి 8న చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చి బాబును సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నవంబర్ 25న సిబిఐ ఏడుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. సిబిఐ చార్జి షీట్ లో విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి, ముత్తా గౌతమ్, రాంచంద్ర అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్ర, ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులైన కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ లను నిందితులుగా చేర్చింది.

లిక్కర్ స్కాంను CBI దర్యాప్తు చేస్తుండగానే, మనీ లాండరింగ్ అంశాలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. రంగంలోకి దిగిన ED సెప్టెంబర్ 27న ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసింది. ఈ కేసులో సమీర్ తో పాటూ అతని కంపెనీలు చాలా కీలకం అని ఈడి ఆరోపించింది. ఆ తర్వాత నవంబర్ 10న శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబులను అరెస్ట్ చేసింది ఈడి, నవంబర్ 30న అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది ఈడి. ఈలోగా సిబిఐ కేసులో బెయిల్ పొందిన విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి లను రిలీజ్ కాక ముందే ఈడి అదుపులోకి తీసుకుంది. తాజాగా మరోసారి దూకుడు పెంచిన ఈడి ముగ్గురిని అరెస్ట్ చేసింది. గౌతం మల్హోత్రా, రాజేష్ జోషి, మాగుంట రాఘవ రెడ్డి అరెస్ట్ లతో సంచలనం రేకెత్తించింది. లిక్కర్ కేసులో ఈడి నవంబర్ 26న మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసింది.

అయితే లిక్కర్ కేసులో అమిత్ అరోరాను ఎపుడైతే అరెస్ట్ చేశారో.. అతని రిమాండ్ రిపోర్ట్ లో సౌత్ గ్రూప్ ప్రస్తావన్ తెరపైకి తెచ్చింది ఈడి. ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, అభిషేక్ బోయిన్ పల్లి ఒక గ్రూప్ గా ఏర్పడి వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మి పార్టీకి చేరవేసి, ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ ద్వారా కిక్ బ్యాగ్ ల రూపంలో లబ్ది పొందారని ఆరోపించింది.. ఇందులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఢిసెంబర్ 11న విచారణ కూడా జరిపింది సిబిఐ. ఈ కేసులో ఒక్కొక్కరిని విచారిస్తూ.. వారిని అరెస్టు చేసుకుంటూ వస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ కోవలో నెక్స్ట్ అరెస్ట్ కవితదేనేమో.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.