China: చైనా మరో గాల్వాన్‌కు తెరతీయబోతోందా..?

చైనా మరో గాల్వాన్ తరహా కుట్రకు సిద్ధమవుతోందా...? గతంలో తమను చావుదెబ్బ కొట్టిన భారత సైనికులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఆయుధాలు సిద్ధం చేస్తోందా...? పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. రాతియుగం నాటి ఆయుధాలకు డ్రాగన్ ఎందుకు ఆర్డర్ ఇస్తోంది...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2023 | 03:24 PMLast Updated on: Mar 14, 2023 | 3:24 PM

Is China Going To Open To Another Galvan

చైనా మరో గాల్వాన్ తరహా కుట్రకు సిద్ధమవుతోందా…? గతంలో తమను చావుదెబ్బ కొట్టిన భారత సైనికులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఆయుధాలు సిద్ధం చేస్తోందా…? పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. రాతియుగం నాటి ఆయుధాలకు డ్రాగన్ ఎందుకు ఆర్డర్ ఇస్తోంది…?

మన పక్కనే ఉంటూ సరిహద్దుల్లో నిత్యం కుంపట్లు రగిలించడమే చైనా పని… గతంలో గాల్వాన్‌లో భారత సైన్యంపై అనాగరిక దాడికి పాల్పడి 20మంది సైనికుల్ని బలితీసుకుంది. ఆ ప్రయత్నంలోనే భారీగా సైనికుల్ని కోల్పోయింది. కర్రలకు ముళ్లకంచెలు చుట్టినట్లుగా ఉన్న ఆయుధాలతో చైనీయులు దాడికి దిగితే… ఒట్టి చేతులతో వారిని ఎదిరించి పరుగులు పెట్టించారు భారత సైనికులు..మాతృభూమి పరిరక్షణకోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడారు మన అమరవీరులు. అసలు ఆ ఘటనలో ఎంతమంది చనిపోయారో చెప్పుకోలేని స్థితిలో ఉన్న డ్రాగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. సరిహద్దుల్లో మరోసారి అలాంటి భారీ కుట్రలకు తెరతీయాలని డ్రాగన్ భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తున్నాయి.

చైనా, భారత్ మధ్య చాలా ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలున్నాయి. ఈసారి ఎక్కడ ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందో తెలియదు.. ఒకచోట చొచ్చుకువస్తుందో ఒకేసారి చాలా ప్రాంతాల్లో దాడులకు తెగబడుతుందో తెలియదు. కానీ భారీగా ఆయుధాలకు మాత్రం ఆర్డర్ ఇస్తోంది. అయితే అవేమీ అత్యాధునిక ఆయుధాలు కాదు. రాతియుగంలో వాడినటువంటి ఆయుధాలు… ఇనుప పైపులకు భారీగా ముళ్లు లాంటి వాటిని ఏర్పాటు చేస్తారు. చివర్లు మొనతేలి ఉంటాయి. ఒక్కోటీ 1.8మీటర్ల పొడవు ఉంటుంది. ముందుభాగం 50సెంటీమీటర్ల వ్యాసార్ధంతో గదలాగా కనిపిస్తుంది. దానిపైన కూడా ఇనుప ముళ్లను వెల్డింగ్ చేసి ఉంచుతారు. చేతితో వీటిని కర్రల్లాగా ఉపయోగించొచ్చు. వీటితో దాడికి దిగితే ఎదుటి వారి శరీరంలోకి చొచ్చుకుపోయి తూట్లు పొడిచి తక్షణమే ప్రాణాలు తీస్తాయి. ఇలాంటివి ఒకటి రెండు కాదు వేలల్లో సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. జనవరిలో వీటికి ఆర్డర్ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ఇవన్నీ చైనా సైన్యానికి చేరాయి. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం సరిహద్దుల్లో తుపాకులు ఉపయోగించకూడదు. అందుకే చైనా గాల్వాన్‌లో ఇలాంటి ఆయుధాలు వినియోగించింది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అలాంటి ఆయుధాలను అందించడం ద్వారా మరిన్ని చొరబాట్లకు చైనా కుట్ర పన్నుతోందా అన్న అనుమానాలు లేకపోలేదు. వీటిని ఎలా వినియోగించాలన్నదానిపై చైనా తన సైనికులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటిని సామన్యులపై వినియోగించేందుకే అని కొందరు చైనీయులు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోలీసులు ఇలాంటి వాటిని వాడారు కూడా… అందుకే ఆ అనుమానాలున్నాయి. అయితే ఈ ఆయుధాల టెండర్ల వివరాలు చైనా సైనిక వెబ్ సైట్ లో ఉంచడంతో సైనికుల కోసమేనని విశ్లేషకులు అంటున్నారు.

గాల్వాన్ ఘర్షణలో పరువు పోగొట్టుకున్న తర్వాత చైనా సరిహద్దుల్లో వినియోగం కోసం చైనా కొత్త తరహా ఆయుధాలను సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రిక్ షాక్ వెపన్స్‌ కూడా భారీగానే సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సరిహద్దుల్లో భారీ కుట్రలకే చైనా తెరతీస్తున్నట్లు కనిపిస్తోంది. మన సైన్యం కూడా దానికి తగ్గట్లుగా సిద్ధం కావాల్సి ఉంది. శీతాకాలంలో చొరబాట్లకు అవకాశం తక్కువ. దీంతో చైనా ఈ వేసవిలోనే సరిహద్దుల్లో మరింత కల్లోలం రేపే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు.

చైనా ఇటీవల సరిహద్దు సమస్యపై సామరస్యంగా స్పందిస్తోంది. ఇరుదేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నట్లు మాట్లాడుతోంది. చైనా మాటలు తీయగా ఉన్నాయంటే దాని వెనక విషం ఉన్నట్లే లెక్క.. అంతా ప్రశాంతం అనుకుంటే దాని వెనక పెద్ద కల్లోలం రేపబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. మనం చర్చలను నమ్ముకుంటే డ్రాగన్ మాత్రం మోసాన్నే నమ్ముకుంటోంది.

(KK)