Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా..? రాహుల్ గాంధీ అంచనా ఇదే..!
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుంది. తెలంగాణలో దాదాపు గెలిచే అవకాశాలున్నాయి. రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ గెలిచే అవకాశం ఉంది. ఈ విషయాల్ని బీజేపీ కూడా అంతర్గతంగా అంగీకరిస్తోంది.
Rahul Gandhi: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరంలలో ఎన్నికలు జరుగుతాయి.
ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిపై రాహుల్ మాట్లాడారు. “మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుంది. తెలంగాణలో దాదాపు గెలిచే అవకాశాలున్నాయి. రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ గెలిచే అవకాశం ఉంది. ఈ విషయాల్ని బీజేపీ కూడా అంతర్గతంగా అంగీకరిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సర్‌ప్రైజ్ ఇస్తాం. మీడియాను బీజేపీ అదుపులో పెట్టుకుంటున్నప్పటికీ మేం ఆ పరిస్థితికి తగ్గట్లు మారుతున్నాం. తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేదు. అక్కడ బీజేపీ కథ ముగిసింది” అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రాహుల్ అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఇతర పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అధికార బీఆర్ఎస్‌తోపాటు, బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది.
కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న తెలంగాణ వంటి రాష్ట్రాలపై ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే వరుసగా తెలంగాణలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో జోష్ తెస్తోంది. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో సభలు నిర్వహించిన కాంగ్రెస్ రాబోయే రోజుల్లో మరిన్ని సభలకు ప్లాన్ చేస్తోంది.