PM MODI: నియంతృత్వానికి అడుగు దూరంలో.. ఇక సుప్రీంకోర్టుకు తాళం వేసేద్దాం..!
దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి క్రమంగా లోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.. తీసుకొస్తున్న చట్టాలు.. సామాజిక, రాజకీయ అంశాలపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చూస్తుంటే ప్రజాస్వామ్యం ముసుగులో ఈ దేశం కూడా నియంతృత్వానికి క్రమంగా అలవాటు పడుతుందేమోననిపిస్తోంది.
PM MODI: అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలిని, గడాఫీ, సద్దాం హుస్సేన్.. వీళ్లందరూ చరిత్రలో నియంతలుగా మిగిలిపోయారు. వీళ్లకు మించిన నియంతలు, నియంతృత్వ ప్రభుత్వాలు వర్తమానంలో కూడా ఉన్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటూ ప్రపంచానికి పాఠాలు నేర్పించే స్థాయిలో ఉన్న భారత దేశం క్రమంగా నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందా అన్న భావన ఈ మధ్య కాలంలో బుద్ధిజీవులకు కలుగుతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి క్రమంగా లోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.. తీసుకొస్తున్న చట్టాలు.. సామాజిక, రాజకీయ అంశాలపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చూస్తుంటే ప్రజాస్వామ్యం ముసుగులో ఈ దేశం కూడా నియంతృత్వానికి క్రమంగా అలవాటు పడుతుందేమోననిపిస్తోంది.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా చెప్పుకునే వ్యవస్థల మధ్య దూరం పెరగడం, ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఢిల్లీ అధికారానికి సంబంధించిన చట్టాల గురించే మాట్లాడుకుందాం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్న ఢిల్లీలో నిర్ణయాధికారం ఆ ప్రజాప్రభుత్వం చేతిలోనే ఉండాలన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన సుస్పష్టమైన తీర్పు. కేంద్రపాలిత ప్రాంతం అయినంత మాత్రాన ప్రజాప్రభుత్వంపై పెత్తనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కూడా ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గౌరవించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కాస్తోకూస్తో ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగస్పూర్తితో తీర్పులిస్తారని పేరున్న ప్రస్తుత చీఫ్ జస్టిస్ జస్టిస్ సీవై చంద్రచూడ్ ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనానికి నాయకత్వం వహించారు. అధికారాల పరిధికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలను ప్రస్తావించిన చంద్రచూడ్ ఢిల్లీ ప్రజాప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం చెల్లదంటూ రూలింగ్ ఇచ్చారు.
నిజంగా ప్రజాస్వామ్య స్పూర్తిని గౌరవించే పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఈ తీర్పును ఎలా చూడాలి. తాము ఇప్పటి వరకు చేస్తున్నది తప్పని.. చెంపలేసుకుని సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలి. తమను వ్యతిరేకించే పార్టీ పాలిస్తుందన్న కారణంగా కక్షపూరితంగా వ్యవహించకుండా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి అధికారాలను బదలాయించాలి. చీటికీమాటికీ ఢిల్లీ పాలనావ్యవహారాల్లో తలదూర్చకుండ సుప్రీంకోర్టు తీర్పును తూ.చ. తప్పకుండా పాటించాలి. కానీ మన విశ్వగురువు ఏం చేశారు..? రాజ్యాంగ స్పూర్తిని మంటగలిపారు. ఢిల్లీపై పెత్తనాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని కాషాయదళం సుప్రీంకోర్టు ఆదేశాలను బైపాస్ చేసేలా ఢిల్లీ అధికారాల చట్టానికి పార్లమెంట్‌లో సవరణ తీసుకొచ్చి ఆమోదించుకున్నారు. అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చినా.. అవి రాజ్యాంగ స్పూర్తితో అమలు కావన్న విషయం అర్థమైపోయింది. రాజ్యాంగ విలువలకు కట్టుబడిన ఏ ప్రభుత్వమైనా ఈ పని చేయగలుగుతుందా..? చేయలేదు.
కేవలం తమకు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకున్న వాళ్లు మాత్రమే ఇంత తెగింపుతో ముందుకెళ్లగలరు. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. ఈ దేశ ప్రజలే దాన్ని పార్లమెంట్‌కు కట్టబెట్టారు. ఇక అధికార కూటమికి పార్లమెంట్‌లో ఉన్న బలం, బలగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ గేమ్‌లో విజేతలు అయ్యేది వాళ్లే కాబట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కూడా పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉండే చట్టాలను చేసుకోగలగుతున్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అనాలా.. నియంతృత్వం అనాలా..? బీజేపీ నియంతృత్వ విధానాలు ఇక్కడితే ఆగిపోలేదు. చివరకు ఎన్నికల కమిషన్‌ను కూడా తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు వీలుగా చట్టాలను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకం నుంచి ఎన్నికల నిర్వహణ వరకు మొత్తం ప్రక్రియ రాజ్యాంగ స్పూర్తితో జరగాలంటే ఎన్నికల కమిషన్ సర్వస్వతంత్రంగా వ్యవహరించాలని, కమిషన్ సభ్యుల నియాకమాల విషయంలో రాజకీయ ప్రయోజనాలకు తావుండకూడదని సుప్రీంకోర్టు భావించింది. అందుకే ఈ ఏడాది మార్చిలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన వ్యక్తి, వ్యక్తులనే కమిషన్ సభ్యులుగా నియమించాలని తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును కూడా గంగలో కలిపేస్తూ కేంద్రం కొత్త బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది.
సీఈసీ, ఈసీలను నియమించే సెర్చ్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని కమిటీలో చేర్చేలా బిల్లును తీసుకొచ్చి రాజ్యసభ ముందు ఉంచారు. ఇది ఆమోదం పొందితే ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, కేంద్ర మంత్రి ఈ ముగ్గురుతో కూడిన కమిటీ ఎవరిని నియమిస్తే వాళ్లే ఎన్నికల కమిషనర్లు, చీఫ్ ఎన్నికల కమిషనర్ అవుతారు. ఉన్న ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ వైపు నుంచే ఉంటారు. ప్రతిపక్షనేత కమిటీలో ఉన్నా ఆయన ప్రతిపాదనలు, అభ్యంతరాలకు పెద్దగా విలువుండదు. తమకు అనుకూలంగా ఉండాలనుకున్న వాళ్లను మాత్రమే నియమించుకుని ఎన్నికల కమిషన్‌ను చెప్పుచేతల్లో పెట్టుకునే దుర్మార్గపు ఆలోచన ఇది. ప్రతిపక్షాలు దీన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా ఇది చట్టంకాకుండా ఆగదు.
ఢిల్లీ అధికారాల చట్టం, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరును చూస్తే భవిష్యత్తులో మన దేశంలో ప్రజాస్వామ్యానికి పెద్దగా విలువుండదేమోనని పిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలు తాము ఏది కోరుకుంటే అదే జరిగేలా చట్టాలు చేసుకోగలవు. రాజ్యాంగాన్ని పరిరక్షించే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులను కూడా పార్లమెంట్ సాక్షిగా పనికిరాకుండా చేయగలరు. అంతిమంగా ప్రజాస్వామ్య స్పూర్తికి భిన్నంగా ఈ దేశాన్ని తాము కోరుకున్నట్టు మాత్రమే నడుపుతారు. ఏరకంగా చూసుకున్నా ఈ పోకడలు భారత్ వంటి ప్రజాస్వామ్య దేశానికి మేలు చేయవు. సమాఖ్య స్పూర్తిని, డెమొక్రటిక్ స్పిరిట్‌ను పట్టించుకోకుండా తమకున్న బలం, బలగాన్ని చూసుకుని చట్టాలు చేసుకుంటూ పోతే ఈ దేశంలో అంతా ఏకపక్షంగా మారిపోతుంది. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజల పక్షాన తీర్పులు ప్రకటించే సుప్రీంకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాలకు కూడా విలువ లేకుండా పోతుంది. డియర్ మోడీజీ.. అధికారం మీ చేతిలో ఉంది.. కానివ్వండి.. సుప్రీకోర్టుకు తాళం వేసేయండి.. మీకు నచ్చిన చట్టాలు చేసుకోండి.. ఈ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించండి. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన, చేస్తున్న వ్యక్తిగా, పార్టీగా మిమ్మల్ని, మీ పార్టీని ఈ దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.