Janasena Tension: జనసేనను కలవరపెడుతున్న టీడీపీ కేడర్..!
గతంలో ఇతర పార్టీలకు సీట్లు కేటాయించిన చోట టీడీపీ నేతలు రెబెల్స్ గా పోటీ చేసారు. దీంతో ఓట్లు చీలిపోయేవి. కొన్ని చోట్ల రెబెల్స్ గెలిచి ఆ తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరేవారు. ఇలాంటి పరిస్థితి ఈసారి కూడా ఉంటుందేమోననే భయం జనసేనకు పట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందనే టాక్ చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పటివరకూ దీనిపై ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా జరగబోయేది అదేనని అందరూ నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో కలవకుండా తప్పు చేశామనే భావన జనసేనలో కనిపిస్తోంది. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్తోంది. ఈసారి జగన్ ను ఎలాగైనా ఓడిస్తామని.. అందుకోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే టీడీపీ కేడర్ విషయంలో జనసైనికులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని పని చేసింది. పొత్తులనేవి ఉభయతారకంగా ఉండాలి. పొత్తు పెట్టుకున్న పార్టీలన్నింటికీ మేలు జరిగేలా ఉండాలి. కానీ గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు లబ్ది పొందింది తక్కువే అని చెప్పొచ్చు. పొత్తుల వల్ల టీడీపీకే ఎక్కువ మేలు కలుగుతోంది కానీ ఆ పార్టీతో కలిసి పనిచేసిన ఇతర పార్టీలకు పెద్దగా మేల జరగట్లేదు. ఇందుకు టీడీపీ కేడర్ సహకరించకపోవడమేనని తెలుస్తోంది. ఇప్పుడు జనసేనకు కూడా ఇదే భయం పట్టుకుంది.
టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే ఇరు పార్టీలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. జనసేనకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ నేతలు, కేడర్ కూడా గాజు గుర్తుకు ఓటేయాల్సి ఉంటుంది. కానీ అలా జరుగుతుందే అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇతర పార్టీలకు సీట్లు కేటాయించిన చోట టీడీపీ నేతలు రెబెల్స్ గా పోటీ చేసారు. దీంతో ఓట్లు చీలిపోయేవి. కొన్ని చోట్ల రెబెల్స్ గెలిచి ఆ తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరేవారు. ఇలాంటి పరిస్థితి ఈసారి కూడా ఉంటుందేమోననే భయం జనసేనకు పట్టుకుంది. అదే జరిగితే జనసేనకు తీరని నష్టం జరుగుతుంది. పొత్తు ప్రయోజనం కూడా ఇరువురికి కలుగుతుంది. ఒకవేళ టీడీపీ కేడర్ సహకరించకపోతే ఎక్కువ నష్టం జనసేనకే. ఈ విషయంపై జనసేనానికి ఆ పార్టీ నేతలు ఇప్పటికే హెచ్చరించినట్లు తెలుస్తోంది. జనసేనకు సీట్లు కేటాయించేచోట టీడీపీ పూర్తిగా సహకరించేలా ముందు జాగ్రత్త పడితే తప్ప అంతిమ ప్రయోజనం ఉండదు.