Karnataka Elections: లింగాయత్‌లనే నమ్ముకున్న కాంగ్రెస్

కర్ణాటకలో మేజర్ కులాలు లింగాయత్, వక్కలిగ.. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు కూడగడితే ఆ పార్టీ గెలిచినట్లే. అయితే రెండు వర్గాలు ఒకరికే మద్దతు ఇవ్వడం అరుదు. అయితే ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2023 | 11:07 AMLast Updated on: Mar 26, 2023 | 11:07 AM

Is Karnataka Pcc Hoping On Lingayath Votes This Time

కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కుల మంత్రాన్ని పాటిస్తోంది. తొలి విడతలో 124సీట్లను ప్రకటించిన అన్ని కులాలకు జాగ్రత్తగా టికెట్లు ఇచ్చింది. అదే సమయంలో నిర్ణయాత్మక లింగాయత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాస్త ఎక్కువ సీట్లు వారికి కేటాయించింది. యడ్యూరప్ప లోటును క్యాష్ చేసుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన.

కర్ణాటక ఎన్నికలంటే కులాలతో ముడిపడి ఉంటాయి. అక్కడ ఓటర్ల కంటే మఠాధిపతులను నమ్ముకుంటాయి పార్టీలు. లింగాయత్ ఓట్లు నిర్ణయాత్మక స్థాయిలో ఉంటాయి. దీంతో అన్ని పార్టీలు ఆ కులం ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు పడుతుంటాయి. కాంగ్రెస్ కూడా ఈసారి లింగాయత్‌లను ఆకట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తొలి విడతలోనే 28మంది లింగాయత్‌లకు టికెట్లు కేటాయించింది. ఏడుగురు పంచమశాలి లింగాయత్, ఐదుగురు రెడ్డి లింగాయత్, ముగ్గురు సదర్ లింగాయత్ మరో ముగ్గురు వీరశైవ లింగాయత్, ముగ్గురు బంజిగ లింగాయత్.. ఇలా లింగాయత్‌ల్లో అన్ని శాఖలకు అతి జాగ్రత్తగా టికెట్లు కేటాయించింది. 22మంది వక్కలిగలకు కూడా టికెట్లు కేటాయించడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనే యత్నం చేసింది. ఇక నలుగురు తండ్రీ కూతుళ్లు. ఇద్దరు తండ్రీ కొడుకులకు టికెట్లు కేటాయించింది.

లింగాయత్‌లు మహాశివుడ్ని పూజిస్తారు. 12వ శతాబ్దంలో బసవన్న ఈ మార్గాన్ని ప్రభోదించారు. భక్తి ఉద్యమ సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కులాల్లోనే అధిక, అధమ అంటూ తేడాలతో పాటు హిందూమతం ఆచరించే కొన్న విశ్వాసాలను వ్యతిరేకించింది. ఇక వీరశైవులు కూడా పరమశివుడ్ని పూజిస్తారు. లింగాయత్‌లు, వీరశైవులు కర్ణాటక జనాభాలో 18శాతం ఉంటారు. 100 సీట్ల ఫలితాలను వీరు తారుమారు చేయగలరు. కర్ణాటక ఉత్తర ప్రాంతంలో వీరి ప్రాబల్యం ఎక్కువ. సంప్రదాయంగా వీరు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రుల్లో 9మంది ఈ వర్గానికి చెందిన వారే. అయితే ఈసారి ఎక్కువగా లింగాయత్‌లకు సీట్లు ఇవ్వడం ద్వారా వారిని తనవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

బీజేపీ ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలకు ఇచ్చే 4శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా లింగాయత్‌ల అభిమానాన్ని పొందేందుకు కష్టపడింది. ఆ నాలుగుశాతంలో లింగాయత్‌లకు 2శాతం, వక్కలిగలకు 2శాతం రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది. గతంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా జరిగింది. నిజానికి లింగాయత్‌లు గతంలో కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేవారు. అయితే అప్పట్లో రాజీవ్‌గాంధీ…. కర్ణాటక ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్‌ను అవమానించి పదవి నుంచి తప్పించడం వారిని పార్టీకి దూరం చేసింది. ఎయిర్‌పోర్ట్‌లోనే పాటిల్‌ను తప్పిస్తున్నట్లు ప్రకటించడంతో లింగాయత్‌లు రగిలిపోయారు. అప్పట్నుంచి వారు కాంగ్రెస్ వైపు చూడలేదు. వారిని దగ్గర చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలు దక్షిణ, మధ్య కర్ణాటకలో లింగాయత్ పెద్దలు, మత గురువుల చుట్టూ తిరుగుతున్నారు.

2018లో కాంగ్రెస్ లింగాయత్‌లకు 17సీట్లు కేటాయించింది. అయితే ఈసారి తొలిదశలోనే 28మందికి టికెట్లు కేటాయించడం ద్వారా ఆ వర్గానికి ఎంత ప్రాధాన్యతను ఇచ్చిందీ చెప్పకనే చెప్పింది. లింగాయత్‌లు గంపగుత్తగా యడ్యూరప్ప వెంట నడిచేవారు. 2013లో బీజేపీ యడ్యూరప్పను దూరం చేసుకుని పార్టీని దెబ్బతీసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా లింగాయతే అయినా కులంపై ఆయన పట్టు తక్కువ. లింగాయత్‌ల్లోనే బలమైన వర్గమైన పంచమశాలీల అనుగ్రహం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

కర్ణాటకలో మేజర్ కులాలు లింగాయత్, వక్కలిగ.. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు కూడగడితే ఆ పార్టీ గెలిచినట్లే. అయితే రెండు వర్గాలు ఒకరికే మద్దతు ఇవ్వడం అరుదు. అయితే ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.