Kavitha Arrest: అరెస్ట్ ముంగిట కవిత హంగామా..?
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో తను అరెస్ట్ అయితే వీలైనంత మైలేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే కవిత ఇలా హడావుడి చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ.
‘తన అరెస్ట్ ఖాయమని కవితకు అర్థమైంది. అందుకే కొంతకాలంగా ఆమె హడావుడి చేస్తోంది.’ అనేది బీజేపీ నేతలు చేస్తున్న విమర్శ. బహుశా అది నిజమేనేమో..! వాస్తవానికి ఎంపీగా ఉన్నప్పటితో పోల్చితే ఎమ్మెల్సీ అయ్యాక కవిత పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. అడపాదడపా మాత్రమే ఆమె మీడియా ముందుకొచ్చేవారు. గతంలో లాగా జాగృతి కార్యక్రమాలు కూడా ఉండట్లేదు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాతే ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వ్యవహారం అరెస్ట్ దాకా రావడంతో ఆమె మరింత హడావుడి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సమయం, సందర్భం లేకపోయినా ఇటీవల కవిత పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అదేమంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకోసమట. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా దీనిపై పోరాటాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఇది వాస్తవ రూపం దాల్చలేదు. ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కవిత.. ఇప్పుడే ఈ బిల్లుపై ఎందుకు ఉద్యమిస్తున్నారనేది అంతు చిక్కడం లేదు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలి విడతలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఇది ఎన్నో విమర్శలకు దారి తీసింది కూడా. అలాంటి పార్టీ నేత ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో తను అరెస్ట్ అయితే వీలైనంత మైలేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే కవిత ఇలా హడావుడి చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. అరెస్టులకు భయపడం.. తెలంగాణ తలవంచదు.. లాంటి భారీ డైలాగులతో కవిత సెంటిమెంటు రాజేసే ప్రయత్నం చేస్తున్నారనేది ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. తన అరెస్టును తెలంగాణకు ఆపాదిస్తూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వారంటున్నారు. ఐదేళ్లక్రితం సొంతిల్లు కూడా లేని కవిత ఇప్పుడు లగ్జరీకార్లు, వాచ్ లు, ఇళ్లు ఎలా పొందగలగిందనేదానికి సమాధానం లేదు. పైగా ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్ అయిపోయారు. ఇప్పుడు సెంటిమెంటుతో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు కవిత అరెస్ట్ అయితే ఢిల్లీతో పాటు తెలంగాణవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఈ మేరకు సంకేతాలు పంపించింది. దీన్ని దేశవ్యాప్తంగా ఇష్యూ చేయడం, ప్రతిపక్షాలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించడం బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.