KCR : బీఆర్ఎస్ బలం, బలగం బీజేపీ, కాంగ్రెస్సేనా?

సీఆర్ సర్కార్ పైన విపక్షాలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. జనం పట్టించుకోవట్లేదు. ఇందుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లతో పోల్చితే కేసీఆరే బెటర్ అని వాళ్లు భావిస్తుండడమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2023 | 12:49 PMLast Updated on: Apr 21, 2023 | 12:49 PM

Is Kcr Confident Over Hatrick Win In Telangana

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలూ ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. సమర్థులైన అభ్యర్థులకోసం వెతుకుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈసారి ఎలాగైనా ఓడిస్తామని అటు బీజేపీ, అటు కాంగ్రెస్ బీరాలు పోతున్నాయి.  కానీ ఆ రెండు పార్టీలకూ అంత సీన్ ఉందా.. అంటే డౌటే. బీఆర్ఎస్ తో పోల్చితే ఆ రెండు పార్టీలు చాలా వీక్. అర్థికంగా కానీ, కేడర్ పరంగా కానీ ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ కు ఉన్నంత శక్తి లేదు. మరి ఈ రెండు పార్టీలూ కేసీఆర్ ను ఎలా ఓడిస్తాయనేది ఆశ్చర్యం కలిగించే అంశమే.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా తెలంగాణలో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ చెప్తోంది. బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ బాగానే హడావుడి చేస్తోంది కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి అంత సీన్ లేదు. గ్రామస్థాయిలో కేడర్ లేదు. అంతెందుకు.. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా ఆ పార్టీకి కరువే. ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీది. ఉన్న కొద్దిమంది బలమైన లీడర్లలో కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది. సీఎం కుర్చీకోసం కనీసం నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. ఇది బీజేపీకి పెద్ద మైనస్.

ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో.. ఎవరు ఎవరికింద గోతులు తీస్తారో తెలీదు. అందరు కలిసి ఉన్నట్టే కనిపిస్తారు.. అంతలోనే ఎవరిదారి వాళ్లదే అన్నట్టు నడుచుకుంటూ వెళ్తుంటారు. హైకమాండ్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో పడిపోయింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక అతనికి వ్యతిరేకంగా సీనియర్లంతా ఏకమయ్యారు. పార్టీని గట్టెక్కించాలని రేవంత్ ట్రై చేస్తుంటే.. దాన్ని జీర్ణించుకోలేని ఓల్డ్ బ్యాచ్ అంతా అతని కింద గోతులు తీసేందుకు సీరియస్ గా ట్రై చేస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవల్లో కేడర్ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నేతలున్నారు. కానీ నేతల మధ్య అనైక్యతే ఆ పార్టీకి పెద్ద శాపం.

ఇక బీఆర్ఎస్ లో ఇలాంటి సీన్లు పొరపాటున కూడా కనిపించవు. కేసీఆర్ లేదా కేటీఆర్ మాట మాత్రమే ఫైనల్. వాళ్లిద్దరూ ఎలా చెప్తే అలా నడుచుకోవడం తప్ప కేడర్ కు మరో మార్గం లేదు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి రావడంతో పార్టీ పటిష్టంగా ఉంది. ఆర్థికంగా కూడా ఆ పార్టీని కొట్టేవాళ్లే లేరు. పోల్ మేనేజ్ మెంట్లో కేసీఆర్ సిద్ధహస్తులు. కేసీఆర్ సర్కార్ పైన విపక్షాలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. జనం పట్టించుకోవట్లేదు. ఇందుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లతో పోల్చితే కేసీఆరే బెటర్ అని వాళ్లు భావిస్తుండడమే. కాబట్టి కాంగ్రెస్, బీజేపీలు ఇలా ఉన్నంతకాలం తెలంగాణలో బీఆర్ఎస్ కు తిరుగుండదు.