KCR : విపక్షాలను ఏకం చేయడంలో కేసీఆర్ సక్సెస్ అవుతున్నారా..?

కేసీఆర్ తో సత్సంబంధాలున్న స్టాలిన్, కుమారస్వామి సంతకాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి కొంతమంది నేతలు కేసీఆర్ కు దగ్గరైతే, మరికొంతమంది దూరమయ్యారని అర్థమవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2023 | 12:25 PMLast Updated on: Mar 06, 2023 | 12:25 PM

Is Kcr Succeeded In Unite The Opposition

దేశంలో నిరంకుశత్వ పాలన నడుస్తోందని.. రాజ్యాంగబద్ద సంస్థలను విపాక్షాలపై పురిగొల్పి రాక్షసానందం పొందుతున్నారని పలువురు విపక్ష నేతలు నేరుగా ప్రధాని మోదీకి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. నలుగురు ముఖ్యమంత్రులు సహా మొత్తం 8 మంది మోదీకి రాసిన లేఖలో సంతకాలు చేశారు. కేసీఆర్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్ ఈ లేఖలో సంతకాలు చేశారు. అయితే కేసీఆర్ కు దగ్గరగా ఉన్న పలువురు నేతలు ఈ లేఖలో సంతకాలు చేయకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయాలనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యం.  అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు మాత్రం ఆయన సిద్ధంగా లేరు. అందుకే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలుపుకుపోవడం ద్వారా కేంద్రంలో ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన తీవ్రంగానే శ్రమిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఉప మఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో విపక్షాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ కేసీఆర్ సహా పలువురు నేతలు ఘాటుగానే లేఖ రాశారు. ఇందులో బీజేపీతో పాటు కాంగ్రెసేతర పార్టీలు కూడా ఉన్నాయి.

ఇన్నాళ్లూ మమత బెనర్జీ బీజేపీకి కాస్త పాజిటివ్ గా కనిపించారు. పశ్చిమ బెంగాల్లో మొన్నటివరకూ గవర్నర్ కు, సీఎంకు మధ్య వార్ నడిచేది. అయితే కొత్త గవర్నర్ నియాకమం సమయంలో కేంద్రానికి, మమత బెనర్జీకి మధ్య సయోధ్య కుదిరింది. అప్పటి నుంచి ఆమె బీజేపీతో సన్నిహితంగానే మెలుగుతూ వచ్చారు. ఇప్పుడు కేంద్రంతో ఆమెకు ఎలాంటి గొడవలూ లేవు. అయినా ఆమె లేఖలో సంతకం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణిస్తున్న శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఈ లేఖలో సంతకాలు చేయడం కూడా అనూహ్యమే. కాంగ్రెస్ తో కలిసేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. కానీ కాంగ్రెస్ తో పొత్తు ఉన్న ఈ రెండు పార్టీల నేతలు కేసీఆర్ తో కలిసి ప్రయాణించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రయాణం ఈ లేఖ వరకే పరిమితం అవుతుందా.. లేకుంటే సార్వత్రిక ఎన్నికల వరకూ సాగుతుందా.. అనేది చూడాలి.

మరోవైపు కేసీఆర్ ముందు నుంచి వెనకేసుకొస్తున్న స్టాలిన్, కుమార స్వామి సహా లెఫ్ట్ పార్టీలు ఈ లేఖకు దూరంగా ఉన్నాయి. కేసీఆర్ తో సత్సంబంధాలున్న స్టాలిన్, కుమారస్వామి సంతకాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి కొంతమంది నేతలు కేసీఆర్ కు దగ్గరైతే, మరికొంతమంది దూరమయ్యారని అర్థమవుతోంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.