Kiran Kumar Reddy: హడావుడి మాత్రమే.. ఇప్పుడు పత్తాకు లేరు.. బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్టా..? లేనట్టా..?
కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ఉపాధి లేకుండా పోయింది. జై సమైక్యాంధ్ర అనే పార్టీ పెట్టి.. ఆ తర్వాత కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్లాడు. అక్కడా భవిష్యత్ లేదని డిసైడ్ అయి.. చివరకు బీజేపీలో చేరారు.
Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఏపీకి చివరి సీఎం. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించి సాధ్యంకాక, చేతులెత్తేసి.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీదే ఎదురెళ్లిన వ్యక్తి. ఆ తర్వాత ఓ పార్టీ పెట్టి ఫెయిల్ కావడం.. మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లడం.. ఆ తర్వాత హస్తానికి హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరడం.. షార్ట్ కట్‌లో చెప్పాలంటే ఇదీ ఆయన రాజకీయ జీవితం. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ఉపాధి లేకుండా పోయింది. జై సమైక్యాంధ్ర అనే పార్టీ పెట్టి.. ఆ తర్వాత కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్లాడు. అక్కడా భవిష్యత్ లేదని డిసైడ్ అయి.. చివరకు బీజేపీలో చేరారు కిరణ్‌కుమార్ రెడ్డి.
ఆయన అనుభవాన్ని వాడుకుంటాం.. సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని బీజేపీ చెప్తోంది. ఐతే అది ఎలా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే! కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి లాభమా.. లేక బీజేపీ వల్ల కిరణ్‌కు లాభమా అన్న సంగతి పక్కనపెడితే.. ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన సమయంలో రెండు రోజులు హడావుడి చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి ఆ తర్వాత మళ్లీ పత్తా లేకుండా పోయారు. నిజానికి హైలైట్ అయ్యే అవకాశాలు దక్కినా.. పెద్దగా బయట కనిపించడంలేదు. చివరికి మీడియాకు కూడా చిక్కలేదు. కాదు కాదు చిక్కకుండా అలా ఉండిపోయారు అంతే! ఈ మధ్యే మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా కమలం పార్టీ శ్రేణులు పెద్ద పండగలా చేసుకున్నాయి. ఇలాంటి కార్యక్రమంలోనూ పెద్దగా కనిపించలేదు కిరణ్ కుమార్ రెడ్డి. పోనీ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారా అంటే.. అదీ లేదు.
పార్టీ నిర్వహించిన ఏ సభలోనూ, సమావేశంలోనూ పెద్దగా కనిపించడం లేదు ఆయన. చివరికి జనసేనతో బీజేపీ పొత్తుల వ్యవహారంలోనూ ఓ సీనియర్ నాయకుడిగా కనీసం నోరు కూడా ఎత్తడం లేదు. మరి.. తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి సేవలు వాడుకుంటారు.. సీమ బాధ్యతలన్నీ ఆయనకే అప్పజెప్తారు.. ఇలా వినిపిస్తున్న మాటలన్నీ ప్రచారంగానే మిగిలిపోతున్నాయి. కానీ, కిరణ్ నోటి నుంచి మాత్రం ఒక్క మాట వినిపించడం లేదు. బీజేపీలో చేరే ముందు కాంగ్రెస్‌ను తిట్టిపోసిన కిరణ్ కుమార్ బీజేపీలో ఏదో అద్భుతం చేస్తారు అనుకుంటే అకస్మాత్తుగా మాయం అయ్యారు. బీజేపీలోనే ఇలాంటి తీరుతో ఉన్నారా అంటే కానే కాదు.. కాంగ్రెస్‌లోనూ ఇలాంటి వ్యవహారశైలితోనే కనిపించారు కిరణ్ కుమార్ రెడ్డి.
జై సమైక్యాంధ్ర పార్టీ ఫ్లాప్ జర్నీ తర్వాత.. ఉన్నట్లుండి కాంగ్రెస్‌లో చేరిపోయారు. గేర్ మారుస్తాం.. హస్తానికి పరుగులు నేర్పిస్తాం అని ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. తీరా చూస్తే ఏళ్లకు ఏళ్లు సైలెంట్‌గా ఉండిపోయారు. పార్టీలో యాక్టివ్‌గా కనిపించ లేదు కనీసం. కట్ చేస్తే ఇప్పుడు బీజేపీలోకి వచ్చి చేరారు. కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అయినా దూకుడు చూపిస్తారు అనుకుంటే.. సేమ్ సీన్ మళ్లీ! కమలం పార్టీలోనూ, పార్టీతోనూ గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్నారా లేదా అని అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో. ఒక్కటి మాత్రం నిజం.. గెలవడం అంటే ఎదురొచ్చిన అన్ని విషయాలు కలిసిరావడం కాదు. అవకాశాలకు ఎదురెళ్లి కలుపుకోవడం. అప్పుడే విజయమైనా.. గుర్తింపైనా! సైలెన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా కనిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఇదే.