లోకేశ్ సొంత టీంను తయారు చేసుకుంటున్నాడా ? పార్టీలో సీనియర్లను ఇంటికి పంపడం ఖాయమేనా ?

టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు త్వరలో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు...80 ఏళ్లకు దగ్గర పడుతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2025 | 08:20 PMLast Updated on: Apr 01, 2025 | 8:20 PM

Is Lokesh Forming His Own Team Is It Safe To Send Seniors Home From The Party

టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు త్వరలో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు…80 ఏళ్లకు దగ్గర పడుతాయి. 2029 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. శరీరం సహకరిస్తే పోటీ చేసే ఛాన్స్ లేకపోలేదు. చంద్రబాబు వయసు దృష్ట్యా…తెలుగుదేశం పార్టీ బలోపేతంపై నారా లోకేశ్ ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మొత్తం లోకేశ్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే తెరవెనుక పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక… ఆ తర్వాత కేబినెట్ కూర్పులోనూ లోకేశ్ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీల ఎన్నిక…నామినేటేడ్ పోస్టుల భర్తీలోనూ లోకేశ్ చెప్పిన వారికి పదవులు వరించినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. అటు ప్రభుత్వంలో…ఇటు పార్టీలో లోకేశ్ చెప్పిందే సాగుతోంది. ప్రస్తుతం పార్టీలో లోకేశ్ కు ఎదురు చెప్పే నేతలే లేరు.

2029 ఎన్నికల నాటికి పార్టీలోని పలువురు సీనియర్లకు ఉద్వాసన పలకాలని లోకేశ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం పార్టీలో ఉండి…అనేక పదవులు అనుభవించిన నేతలను పక్కన పెట్టాలని ఓ అంచనా వచ్చినట్లు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. 2029 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వీలయినంత ఎక్కువ మంది యువకులకు టికెట్లు ఇచ్చేందుకు మంత్రి లోకేశ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలను ఎంపిక చేసుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించి…తన మార్క్ ను చూపించుకున్నారు. 2029 ఎన్నికల నాటికి పూర్తి తన ప్రభావం ఉండేలా…ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మంత్రి లోకేశ్. గత ఎన్నికల్లో అనేక మంది యువతకు టికెట్లు ఇచ్చారు. అందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ హరీశ్ మాథుర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, పుత్తా చైతన్య రెడ్డి, టీడీపీ ఐటీ సెల్ ఇన్ చార్జ్, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ పాత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు ఉన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా లాంటి వారికి…2029లో టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని సమాచారం. మాజీ మంత్రి యనమలకు…ఆయన కూతురు, అల్లుడి చేసిన ఘనకార్యాలతో చెక్ పెట్టేశారు. దానికి తోడు ఆయన లేఖ రాసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇదే సమయంలో వయసు మీద పడిన నేతలతో పాటు వరుసగా పదవులు అనుభవించిన నేతలను లోకేశ్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీనియర్ నేతలను…వచ్చే ఎన్నికల్లో దూరం పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో వరుసగా మూడుసార్లు పదవులు అనుభవించిన వారికి…2029 ఎన్నికల్లో టికెట్లు దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. సీనియర్ నేతల అవినీతి, అక్రమాలపై నివేదికను తెప్పించుకున్నారట లోకేశ్. సుదీర్ఘ కాలంగా పాటు పార్టీలో ఉన్న వారి స్థానంలో కొత్త నేతలు, యువకులకు టికెట్లు ఇవ్వాలని నారా లోకేశ్ ఓ అంచనా వచ్చేసినట్లు తెలుస్తోంది.