Top story: పవన్ ది వ్యూహమా..అర్ధం లేని యుద్ధమా?
కలిసి ఉంటేనే గెలుస్తామన్నాడు. ఆయనే మూడు పార్టీలను కలిపాడు. ఇప్పుడు అధికారం వచ్చాక ఎందుకో విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు. ఆయనకేం కావాలో స్పష్టంగా చెప్పడం లేదు.
కలిసి ఉంటేనే గెలుస్తామన్నాడు. ఆయనే మూడు పార్టీలను కలిపాడు. ఇప్పుడు అధికారం వచ్చాక ఎందుకో విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు. ఆయనకేం కావాలో స్పష్టంగా చెప్పడం లేదు.ఆయన వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడా? కూటమి సర్కార్ని ఇరుకున పెడుతున్నాడా? తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవాలనుకుంటున్నాడా? మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గడచిన ఐదు నెలల్లో వ్యవహరిస్తున్న తీరు ముఖ్యమంత్రి చంద్రబాబు కి తలనొప్పిగా మారింది.
పవన్ కళ్యాణ్ ఆవేశమే జనంలో కదలిక తీసుకొచ్చింది. జగన్ పార్టీని ఓడించింది. ఇప్పుడు ఆ ఆవేశం… చంద్రబాబు ఇరకాటంలో పెడుతుంది. పవన్ విపక్షంలో ఉన్నాడా? స్వపక్షంలో ఉన్నాడో? తెలియని పరిస్థితి చంద్రబాబుకు సృష్టించేశాడు జనసేనని. కొన్నిసార్లు పవన్ మాట్లాడే మాటలు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పై, ప్రభుత్వ వ్యవస్థలపై ఏ మాత్రం పట్టు లేదని విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఆవేశంలో పవన్ వదిలే మాటలు,తూటాల్లా… నేరుగా చంద్రబాబుకే తగులుతున్నాయి. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారు,? హోమ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, నేను హోంమంత్రిని అయితే పరిస్థితి మరోలా ఉంటుంది అని హెచ్చరించడం ద్వారా డిప్యూటీ శాఖ మంత్రి స్వయంగా తన ప్రభుత్వం పైనే తుపాకీ గురి పెట్టారు.
పవన్ మాటలు విని జనం ఆశ్చర్యపోయారు. ఏ క్యాబినెట్ లోనో, ఏ క్లోజ్ డోర్ మీటింగ్ లోనో మాట్లాడుకోవాల్సిన మాటలు ఒక బహిరంగ సభలో తన హోమ్ మంత్రిని తానే విమర్శిస్తుంటే భవిష్యత్తులో పవన్ ఇంకేం చేయబోతారోనని టిడిపి వాళ్లు ఇప్పటి నుంచే జుట్టు పీక్కుంటున్నారు. అంతటితో అయిపోలేదు తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాలు ద్వారా తీసిన నెయ్యిని వాడారంటూ చంద్రబాబు ఒక చిన్న అగ్గిపుల్ల గీసి వదిలేసారు. ఆ అగ్గిపులతో ఏకంగా కాగడా వెలిగించుకొని దాన్ని పట్టుకొని ఊరురా తిరిగారు పవన్ కళ్యాణ్. లడ్డు కల్తీ కి ఏకంగా సనాతన ధర్మాన్ని లింకు పెట్టి తనను తాను సనాతన వాదిగా ప్రచారం చేసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం 11 రోజుల దీక్ష చేసి జనంలో జోకర్ గా మిగిలిపోయారు పవన్.
అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండానే దాని గురించి విపరీతంగా మాట్లాడేసి తన గురించి జనం నవ్వుకునేలా చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు చంద్రబాబు రేపిన ఇష్యూ ని మొత్తం తన వైపు డైవర్ట్ చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షా ని ఇతర మంత్రులను కలిసి బయటకు వచ్చి విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు చాలా విచిత్రమైన జవాబు ఇచ్చారు. తాను హోం మంత్రిని కాదని, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదని… కనుక మీరు అడిగిన ప్రశ్న ముఖ్యమంత్రి కి చేరవేస్తానని… ఆయనే అడుగుతానని నేరుగా చెప్పారు పవన్.
ఇవన్నీ చూస్తుంటే పవన్ తాను ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా? లేక ప్రభుత్వంలోనే ఉండి చంద్రబాబును ఎప్పటికప్పుడు ఇరుకున పెడదామని అనుకుంటున్నారా అనే సందేహం రాక మానదు. పవన్ కళ్యాణ్ అడపాదడపా సృష్టించే ఈ అంతర్గత వివాదాలు వైసీపీకి బలం ఇచ్చినట్లు అవుతుందని టిడిపిలోనే గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పడి ఆరు నెలలు అయిపోయింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ,అధికారుల్ని ముఖ్యంగా పోలీసు అధికారులు తిట్టిపోస్తునే ఉన్నారు . తనకు అధికారులు సహకరించడం లేదంటూ ప్రతి వైఫల్యాన్ని అధికారులు మీద నెట్టేయడానికి చూస్తున్నారు. అధికారులంతా వైసీపీ వాళ్లలా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో జనానికి డౌట్ వస్తుంది. నీ ప్రభుత్వంలో ,నీ అధికారులు నీకు సహకరించకపోతే దానికి మరొకరిని ఎలా బాధ్యులు చేస్తావ్? నీ అధికారులు నీకు సహకరించట్లేదంటే…. అది నీ ప్రభుత్వంలో లోపమే కదా అది జనం నవ్వుకుంటున్నారు. కాకినాడ పోర్ట్ లో 16 వందల టన్నుల రేషన్ బియ్యం దొరికితే….48 గంటల తర్వాత అక్కడికి వెళ్లి పవన్ చేసిన హడావుడి చూసి జనం నవ్వుకున్నారు. అధికారుల బియ్యం పట్టుకుంటే అదంతా తానే పట్టుకున్నట్లుగా బిల్డప్ ఇస్తూ…. అధికారులని తిరిగి తిట్టడం.. సీజ్ ద షిప్ అని పదేపదే అనడం చూసి టిడిపి వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు.
కాకినాడ టిడిపి ఎమ్మెల్యే కొండబాబుని పట్టుకుని పవన్ చడమడ తిట్టేస్తుంటే…. అధికారులకి ,పొలిటిషన్లకి ఏం పాలు పోలేదు.
అంతేకాదు ఇప్పుడు పవన్ చెప్పినట్లు షిప్పుని ఎలా సీజ్ చేయాలో అర్థం కాక వాళ్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఇది అంతా నిశ్శబ్దంగా చంద్రబాబు చూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆయన రియాక్ట్ అవలేదు. బహుశా పవన్ కళ్యాణ్ శక్తి సామర్ధ్యాలు బాగా తెలిసిన వ్యక్తి ఏమో…. తనలో తానే నవ్వుకుంటున్నాడు ఏమో చంద్రబాబు. కానీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ చేసే హడావుడి…. ప్రతిపక్ష నేత లాగా ఆయన మాట్లాడే తీరు, ప్రతి చోటా తన నిజాయితీని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఓవరాల్ గా చంద్రబాబు సర్కార్ ని ఇరుకుని పెడుతున్నాయి. ఇది పవన్ వ్యూహాత్మకంగా చేస్తున్నాడా లేక అనుకోకుండా అలా ఆవేశపడిపోతున్నాడా అన్నది జనాలకు అర్థం కావడం లేదు. ఇక ఆయన సోదరుడు నాగబాబుకి రాజ్యసభ సీటు ఇప్పించడానికి చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నాడని దీనిలో భాగంగానే కూటమిలో ఎమ్మెల్యేలను, ప్రభుత్వ అధికారులను నిందిస్తూ తనదైన స్టైల్ లో వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.