Fact Check: మోడీకి ఆస్కారా… నోబెలా…?

ప్రధాని నరేంద్రమోడీకి నోబెల్ ఫ్రైజ్.... పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ వార్త ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. ప్రతిపక్షాలు మోడీకి ఆస్కార్ ఇవ్వాలంటుంటే సడన్‌గా నోబెల్ ఎక్కడ్నుంచి వచ్చిందన్నది పెద్ద ప్రశ్నై కూర్చుంది...? ఇంతకీ మోడీ నోబెల్ ఫ్రైజ్‌కు నామినేట్ అయ్యారా...? ఏది నిజం...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2023 | 11:47 AMLast Updated on: Mar 18, 2023 | 11:47 AM

Is Pm Narendra Modi Nominated For Noble Prize

ప్రధాని నరేంద్రమోడీకి నోబెల్ ఫ్రైజ్…. పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ వార్త ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. ప్రతిపక్షాలు మోడీకి ఆస్కార్ ఇవ్వాలంటుంటే సడన్‌గా నోబెల్ ఎక్కడ్నుంచి వచ్చిందన్నది పెద్ద ప్రశ్నై కూర్చుంది…? ఇంతకీ మోడీ నోబెల్ ఫ్రైజ్‌కు నామినేట్ అయ్యారా…? ఏది నిజం…?

ఎవరు సృష్టించారో తెలియదు కానీ ప్రధాని నరేంద్రమోడీ నోబెల్‌కు నామినేట్ అయ్యారన్న వార్త మాత్రం తెగ షికారు చేసింది. ఈ ఏడాది శాంతి బహుమతికి ఆయన గట్టిపోటీదారంటూ నోబెల్ అకాడమీ డిప్యుటీ ఛైర్మన్ అసే టోజ్ చెప్పినట్లు వార్త సృష్టించారు. ఇంకేముంది మోడీ భక్తులు దిగిపోయారు. అది నిజమో కాదో తెలుసుకోకుండానే మోడీకి మించి నోబెల్‌కు అర్హత ఎవరికి ఉందంటూ తెగ ఊదరగొట్టారు. మోడీ ఘనత ఇదంటూ చాంతాడంత లిస్టు బయటకు తీశారు. ఇక మీడియా సంస్థలు స్ర్కోలింగ్‌లు, బ్రేకింగ్‌లు అదరగొట్టాయి… కానీ సీన్‌ కట్‌ చేస్తే అసలది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. స్వయంగా అసే టోజే రంగంలోకి ఆ వార్తలను ఖండించారు. తాను అసలు అలాంటి వ్యాఖ్యలే చేయలేదని స్పష్టం చేశారు. దీంతో ఎంత వేగంగా మొదలైందో అంత వేగంగా వార్త చల్లబడిపోయింది. యూట్యుబుల్లో మీడియా బ్రేకింగ్ న్యూస్ వీడియోలు మాయమైపోయాయి.

ఇంతకీ టోజే చెప్పిందేంటి…? యుక్రెయిన్‌ యుద్ధంలో రష్యా అణ్వాయుధాలు వాడకుండా చూడటంలో భారత్‌ పాత్ర ఘనమైనదన్నారు. భారత్ ఇలాంటి బాధ్యతలను భుజాన వేసుకోగలదని, ప్రపంచ శక్తిగా ఎదిగే శక్తి ఉందంటూ ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. నమ్మదగ్గ వ్యక్తి అంటూ ప్రధాని మోడీ పాలనపై ప్రశంసలు గుప్పించారు. దాన్నే కొందరు మార్చి నోబెల్ శాంతి బహుమతికి మోడీ ప్రధాన పోటీదారని చెప్పారంటూ ప్రచారం చేశారు. నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం అసలు శాంతి బహుమతికి ఎవరిని నామినేట్‌ చేశారో చెప్పరు… ఆ బహుమతిని ప్రకటించిన 50ఏళ్ల వరకు ఆ వివరాలను బహిర్గతం చేయరు. బయటకు వచ్చే పేర్లన్నీ ఊహాగానాలు మాత్రమే. అంత రహస్యాన్ని పాటిస్తారు.

మోడీ నోబెల్‌ ప్రచారంపై ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. ఆయనకు ఇవ్వాల్సింది నోబెల్ కాదని ఆస్కార్ అని అంటున్నాయి. మోడీని మించిన నటుడు అసలు ఎవరున్నారని కౌంటర్లు వేస్తున్నాయి. మోడీ పేరును కనుక నామినేషన్‌కు పంపి ఉంటే ఖచ్చితంగా ఆయనకే ఉత్తమ నటుడి అవార్డు దక్కేదని సెటైర్లు పేలుతున్నాయి. ఈ మధ్యే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా మోడీపై ఇలాంటి కామెంట్లే చేశారు. మోడీ పేరును కనుక బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీకి పంపి ఉంటే దేశానికి ఇంకో అవార్డు వచ్చి ఉండేదన్నారు. విదేశాల్లో కానీ, దేశంలో ఏదైనా రాష్ట్రానికి వెళ్లినప్పుడు కానీ మోడీ ఎక్స్‌ప్రెషన్స్‌పై విపక్షాలు చాలాకాలంగా సెటైర్లు వేస్తూనే ఉన్నాయి. అంత అద్భుతంగా నటించడం ఎవరికీ రాదంటున్నాయి. మహానటుడు మోడీ అంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పుడు నోబెల్ ప్రచారం తెరపైకి రావడంతో మరోసారి తమ విమర్శలకు పనిచెబుతున్నాయి. విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రధాని మాత్రం సైలెంట్… ఆ సమయంలో ఎవరికీ అర్థం కాదు ఆయన ఎక్స్‌ప్రెషన్‌..

(KK)