హామీల అమలు బీజేపీకి సవాలేనా ? ఢిల్లీ తొలి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిశ్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సిర్సా, కపిల్ మిశ్ర, రవిందర్ ఇంద్రజ్ ప్రమాణస్వీకారం చేశారు.

ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిశ్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సిర్సా, కపిల్ మిశ్ర, రవిందర్ ఇంద్రజ్ ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది సరే…మరి హామీల అమలు సంగతేంటి ? అన్న చర్చ మొదలైంది. ఎందకంటే అధికారంలోకి రావడం కోసం…బీజేపీ అలవిగాని హామీలు ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కు మించి…ఓటర్లకు వరాల జల్లు కురిపింది. దీంతో అందరి ఫోకస్…తొలి మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరుగుతుంది ? ఏ యే హామీలను ఆమోదిస్తారు ? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు…బీజేపీ మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించింది. ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూనే…హామీలు జల్లు కురిపించింది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. మహిళల కోసం మాతృ సురక్ష వందన పథకం కింద ప్రతి గర్భిణీకి ఆరు పోషకాహార కిట్లతో పాటు 21వేల నగదు, 60-70 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్లకు నెలకు 2,500, 70ఏళ్లు పైబడిన వారికి రూ.3,000 పెన్షన్ ప్రకటించింది. ప్రతి మహిళకు నెలకు 2,500 నగదు, పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, అటల్ క్యాంటిన్లతో 5 రూపాయలకే భోజనం అందిస్తామని చెప్పింది. ఆటో-టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటూనే..డ్రైవర్లకు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15 వేల ఆర్థిక సాయం. బీఆర్ అంబేడ్కర్ స్టైపెండ్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా వెయ్యి ఇస్తామని హామీ ఇచ్చింది.
ఢిల్లీ జనాభా.. 1.55 కోట్లు. ఇందులో 83.49 లక్షలు పురుషులు. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు. 20 నుంచి 29 సంవత్సరాల వయస్సున్న యువ ఓటర్లు 25.89 లక్షలు. 18 నుంచి 19 సంవత్సరాల వారు 2.08 లక్షలు. దీంతో బీజేపీకి హామీల అమలు అంటే…కత్తి మీద సాములా మారింది. ఎందుకంటే…మహిళా ఓటర్లే 71 లక్షల మంది ఉన్నారు. ఒక్క మహిళా సమృద్ధి యోజన పథకం అమలుకే…నెలకు దాదాపు 1750 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పథకానికి సంవత్సరానికి 21వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. 5వందలకే గ్యాస్ సిలిండర్ కనీసం 30 లక్షల మందికి ఇస్తే…సంవత్సరానికి 18వందల కోట్లు బడ్జెట్ లో కేటాయించాలి. గర్భిణీలకు 21వేల ఆర్థిక సాయం, సీనియర్ సిటిజన్లకు నెలకు వెయ్యి కోట్లు లెక్క వేసుకున్నా…ఏడాదికి 12వేల కోట్లు ఖర్చు చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న పథకాలను కంటిన్యూ చేస్తూనే…ఇవన్నీ కొనసాగించాలంటే అప్పులు చేయాల్సిందేనని నిఫుణులు చెబుతున్నారు.
మహిళల ఆర్థిక సాయానికి 21 వేలు కోట్లు, గ్యాస్ సిలిండర్ పథకానికి 1800 కోట్లు, పెన్షన్ల స్కీంకు 12వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. మూడు పథకాలకే సంవత్సరానికి 35వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించాలి. వీటికి తోడు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు పది లక్షల బీమా, యువతకు 15వేల ఆర్థిక సాయం వంటివి అమలు చేయడం అంటే బీజేపీ ప్రభుత్వానికి అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. ఎండ డబుల్ ఇంజిన్ సర్కార్…ఢిల్లీలో ఉన్నప్పటికీ కేంద్ర చేసే సాయానికి ఒక హద్దు ఉంటుందనే వాదనలు ఉన్నాయి. సీఎం రేఖా గుప్తా నాయకత్వంలో…తొలి కేబినెట్ లో ఏ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ? వేటిని వాయిదా వేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.