నెక్స్ట్ టార్గెట్ మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయీదేనా ? అబూ ఖతల్ హత్యతో భయం పట్టుకుందా ?
లష్కరే తోయిబా చీఫ్, 26/11 దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు...పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. ప్రస్తుతం అతడు ఉగ్రకార్యకలాపాల ఆరోపణలపై లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

లష్కరే తోయిబా చీఫ్, 26/11 దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు…పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. ప్రస్తుతం అతడు ఉగ్రకార్యకలాపాల ఆరోపణలపై లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి కల్పించిన భద్రతను పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సమీక్షించింది. మరోవైపు హఫీజ్ కుటుంబీకులకు సైతం భద్రతను కట్టుదిట్టం చేసింది. కిస్తాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హత్య తర్వాత…నెక్స్ట్ టార్గెట్ హఫీజ్ సయీద్ కావడంతో ఐఎస్ఐను సెక్యూరిటీని పెంచింది. లష్కరేలోని మరో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్‌ను గుర్తుతెలియని గన్‌మెన్లు హత్య చేశారు. దాదాపు 10 నుంచి 20 రౌండ్లు అతడిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతడితోపాటు.. ఓ సెక్యూరిటీ గార్డ్ కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది రియాసీలో యాత్రికుల బస్సుపై దాడి చేసిన కేసులో ఇతడు ప్రధాన సూత్రధారి. ఖతాల్ మరణంతో లష్కరేకు గట్టి ఎదురు దెబ్బతగిలిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. హఫీజ్ సయీద్ సన్నిహితుడు చంపేశారని…అంటే వారిని ట్రాక్ చేస్తున్న వారు హఫీజ్ కు దగ్గరగా చేరుకున్నారని రక్షణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 26/11 ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు త్వరలో ఇలాంటి గతి పడుతుందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు.
హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడు. జమాత్ ఉద్ దావాను స్వయంగా స్థాపించాడు. హఫీజ్ ముహమ్మద్ సయీద్…జూన్ 5 1950లో పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించాడు. హఫీజ్ కుటుంబం…హర్యానాలోని హిసార్ నుంచి పాకిస్తాన్ లోని పంజాబ్ కు వలస వెళ్లింది. రెండు మాస్టర్ డిగ్రీలను అందుకున్నాడు. అతని కుమారుడు తల్హా సయీద్ లష్కర్ ఈ తోయిబాలో సెకండ్ ఇన్ కమాండ్ పని చేస్తున్నాడు. 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై జరిగిన దాడిలో సయీద్ ప్రమేయం ఉందని భారత్ వాదించింది. దీంతో పాకిస్తాన్ డిసెంబర్ 21, 2001న సయీద్‌ను అదుపులోకి తీసుకుంది . అతన్ని మార్చి 31, 2002 వరకు నిర్బంధంలో ఉంచింది. తరువాత విడుదల చేసి, మే 15న తిరిగి కస్టడీలోకి తీసుకున్నారు. అతని భార్య మైమూనా సయీద్ అక్రమ నిర్బంధంలోనే ఉంది.
హఫీజ్ ఇటీవల తరచూ దాడులకు టార్గెట్ అయ్యాడు. 2021లో అతడి ఇంటి వద్ద భారీ పేలుడు చోటు చేసుకొంది. దాని నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. 2023లో ఇద్దరు టాప్ లష్కరే ఉగ్రవాదులు, హంజ్లా అదన్నాన్, రియాజ్ అహ్మద్‌లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వరుసగా హఫీజ్ సన్నిహితులపై దాడులు జరగడం లష్కరేలో భయం పుట్టిస్తోంది. డిసెంబర్ 2024లో జరిగిన దాడిలో హఫీజ్ తర్వాతి స్థానంలోని అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి చెందాడు. దీంతో భయపడిన హఫీజ్ అతడి అంతిమయాత్రలో కూడా పాల్గొనలేదు. అతడి కుమారుడు మాత్రమే వెళ్లాడు. ఈ యాత్రలో పాక్‌లోని పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులు పాల్గొన్నారు. అబూ ఖతల్…కాశ్మీర్, రాజౌరి, పూంచ్, పీఓకేలలో అనేక దాడులలో పాల్గొన్నట్లు విదేశాంగ నిపుణుడు సచ్‌దేవా తెలిపాడు. తన మేనల్లుడి హత్య తర్వాత సయీద్ భద్రతను కట్టుదిట్టం చేసింది పాకిస్తాన్.
2008 నవంబరు 26న ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన విషాదం వెనుక హఫీజ్ సయీద్ కీలక సూత్రధారి. ఈ దారుణంతోపాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన పాత్ర పోషించాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో 160 మందికి పైగా జనం మృతి చెందారు. అలాగే పుల్వామా దాడికి కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు స్థాపించిన లష్కరే తొయిబాను ఐరాసతో పాటు భారత్, యూకే, అమెరికా, ఈయూ, ఆస్ట్రేలియా, రష్యా ఉగ్రసంస్థగా గుర్తించాయి. హఫీజ్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. వీటితో పాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి. హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను కోరింది ఇండియా.