నోటి దూలే కొంపముంచిందా ? వంశీ అరెస్టు వెనుక కథ వేరే ఉందా?

తెలుగు మీడియాకు చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ దొరికింది. అదేంటంటే వల్లభనేని వంశీ అరెస్టు. హైదరాబాద్ లో అరెస్టు చేయడం...విజయవాడకు తరలించడం...చకచకా జరిగిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2025 | 11:13 AMLast Updated on: Feb 15, 2025 | 11:13 AM

Is There A Different Story Behind Vamsis Arrest

తెలుగు మీడియాకు చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ దొరికింది. అదేంటంటే వల్లభనేని వంశీ అరెస్టు. హైదరాబాద్ లో అరెస్టు చేయడం…విజయవాడకు తరలించడం…చకచకా జరిగిపోయాయి. వంశీని అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు..ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్నాయి. 8 నెలలు కావొస్తున్నా…వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వారిని అరెస్టు చేయకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండి కూడా…వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారిని ఏం చేయలేకపోతోందన్న నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. కొందరు లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ నేతలను నిలదీయాలన్న నిర్ణయానికి వచ్చారు. బాబు మనసు మారలేదు, చిన్నబాబు రెడ్ బుక్ అజ్ఞాతంలోకి వెళ్లిందా అన్న ప్రశ్నలు వేసుకున్నారు.

సరిగ్గా ఇలాంటి టైంలోనే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. దెబ్బతో ఛానల్స్ అన్ని అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్ లో అరెస్టు చేసినప్పటి నుంచి విజయవాడలో జైలుకు తరలించే వరకు వంశీ అరెస్టునే హైలెట్ చేశాయి. ఎందుకంటే వంశీ ఏం మాములు వ్యక్తి కాదు. గన్నవరం నుంచి రెండు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగానే…వైసీపీకి జైకొట్టారు. టీడీపీ నుంచి నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించినా…వైసీపీ గూటికి చేరిపోయారు. సైలెంట్ గా వైసీపీలోకి వెళ్లిపోతే…వంశీకి నో ప్రాబ్లమ్. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక పనులు చేసుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ తో సన్నిహితంగా మెలికారు. అక్కడి వరకు కథ బాగానే ఉంది. బెజవాడలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సమయంలో…ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. అయినా 2019 ఎన్నికల్లోనూ టీడీపీ వంశీకే టికెట్ ఇచ్చింది. వైసీపీ సునామీలోనూ వల్లభనేని వంశీ…గన్నవరం నుంచి గెలుపొందాడు. తెలుగుదేశం పార్టీ జస్ట్ 23 సీట్లకే పరిమితం అయింది.

వైసీపీ అధికారంలోకి రాగానే ఇక అక్కడితో మనోడిలో అపరిచితుడు మేల్కొన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యాడు. వైసీపీకి జైకొట్టాడు. నీ దారి నువ్వు చూసుకున్నావ్ సరే అని టీడీపీ అనుకుంది. పోతూ పోతూ…మంత్రి లోకేశ్ ను పప్పు అన్నాడు…ఇంకా ఇంకా ఎన్నో అనరాని కారుకూతలు కూశాడు. వంశీ ఎంత మాటోస్తే అంత మాటన్నా టీడీపీ శ్రేణులు పట్టించుకోలేదు. చంద్రబాబును విమర్శించినా…లోకేశ్ ను బూతులు తిట్టినా పార్టీ కార్యకర్తలు బాధ పడలేదు. జగన్ కు దగ్గరయ్యేందుకు అలా మాట్లాడి ఉంటారని అనుకున్నారు. టీడీపీ శ్రేణుల నుంచి వంశీకి సరైన కౌంటర్లు రాకపోవడంతో…మరింత రెచ్చిపోయాడు. ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై క్షమించరాని వ్యాఖ్యలు చేశాడు. మంత్రి లోకేశ్ పుట్టుకనే ప్రశ్నించాడు. మనిషన్నవాడు చేయని జుగుప్సాకరమైన…టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. వైసీపీలోని కొందరు నేతలు వంశీ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. సంస్కారం, విలువలు, విజ్ఞత ఉన్న ఎవరైనా మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరికి జరిగిన ఆ అవమానాన్ని తమదిగా భావించారు. కొన్ని రోజుల తర్వాత భువనేశ్వరికి…చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాడు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తర్వాత నారా లోకేశ్ రెడ్ బుక్ తో అందరి లెక్కలు తేలుస్తానని అన్నాడు. లోకేశ్ వ్యాఖ్యలను గడిపోచలా తీసిపారేశారు.

ఐదేళ్లు అలా గడిచిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది…తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ పాలనకు 8 నెలలు గడిచాయి. ఇంకెప్పుడు అరెస్టులు అంటూ టీడీపీ శ్రేణుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి టైంలోనే సైలెంట్ గా వంశీని అరెస్టు చేసి…గంటల పాటు విచారించారు. తర్వాత బొక్కలో వేశారు. చేసిన పాపం ఊరికే పోదని అంటారు. అది వంశీ విషయంలో అక్షరాల నిజమైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేశామని చెబుతున్నా…అసలు కథ భువనేశ్వరిని అనరాని మాటలు అనడమేనన్న చర్చ జరుగుతోంది. పొలిటిషియన్లు బీ కేర్ ఫుల్…
వల్లభనేని వంశీ కథ జైలుకెళ్లింది. టీడీపీ పై నోరు పారేసిన ప్రతి ఒక్క వైసీపీ ముఖ్య నేతలు ఎలుకల మాదిరి కలుగులోకి వెళ్లాల్సిందే. ఇన్నాళ్లుగా తమ మనోభావాలను పట్టించుకోరా ? తమ మనసిక క్షోభను అర్ధం చేసుకోరా అంటూ నిట్టూర్చిన టీడీపీ శ్రేణులు వల్లభనేని అరెస్టుతో సంబరాలు చేసుకుంటున్నారు.