టీడీపీ, జనసేన మధ్య చిచ్చు రాజుకుందా ? పవన్ పై దుమ్మెత్తిపోస్తున్న టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజుకుంటోందా ? పిఠాపురం వేదికగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి నాదెండ్ల మనోహర్, నాగబాబు...కావాలనే మంట పెట్టేలా వ్యవహరించారా ?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజుకుంటోందా ? పిఠాపురం వేదికగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి నాదెండ్ల మనోహర్, నాగబాబు…కావాలనే మంట పెట్టేలా వ్యవహరించారా ? ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి…రెండు పార్టీలు విడిపోవడం ఖాయమా ? టీడీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరిస్తున్నా…జనసేన రెచ్చగొడుతోందా ? ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్స్ ను పచ్చ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారా ?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే తెలుగుదేశం, జనసేన మధ్య రాజకీయ మంటలు రేగుతున్నాయి. 9 నెలల పాటు రెండు పార్టీల నేతలు సైలెంటుగా ఉన్నప్పటికీ…పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో అగ్ర నేతలు బరస్ట్ అయ్యారు. తమ మనసులో ఏముందో…దాన్ని బయటకు కక్కేశారు. యథాలాపంగా అన్నారా ? లేదంటే రెచ్చగొట్టడానికే చేశారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదలుకొని…మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ తో రాజకీయ రచ్చ షురూ అయింది. సోషల్ మీడియా లో రెండు పార్టీల అభిమానుల మధ్య వార్ జరుగుతోంది. పరస్పరం ట్వీట్లు, కామెంట్లు, కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు.
ఐదేళ్ల పాటు ఎన్నో అవమానాలు భరించాం, ఎన్నో దౌర్జన్యాలు ఎదురుకున్నాం. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. మనం నిలబడ్డాం…పార్టీని నిలబెట్టాం…మనం నిలదొక్కుకున్నాం…మనం నిలదొక్కుకోవడం కాకుండా…నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. టీడీపీ నిలబెట్టామని వ్యాఖ్యానించడంతో…జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య నిప్పు రాజుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటలతూటాలు పేల్చుకుంటున్నారు. సోషల్ మీడియా లో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
కష్టసమయంలో చెయ్యి అందించిన విషయాన్ని గుర్తించుకొని చంద్రబాబు నాయుడు… ఉప ముఖ్యమంత్రి స్థానంలో నిల్చునే అవకాశం కల్పించాడంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకి కృతఙ్ఞతలు తెలియ చేసిన విషయాన్ని మర్చిపోయారు కానీ, పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ నిలబడిందన్న కామెంట్స్ తో ఒంటికాలిపై లేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఉన్న ఓటింగ్ శాతం ఎంత అని ప్రశ్నిస్తున్నారు. పార్టీని నిలబెట్టే మగాడివే అయితే…2019లో ఎందుకు రెండు చోట్ల ఓడిపోయావంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాన్ కు, జనసేనకు జనంలో బలమే ఉంటే…భీమవరం, గాజువాక ఓటర్లు ఎందుకు బండకేసి కొట్టారని సెటైర్లు వేస్తున్నారు. 2019లో పరాజయాన్ని తట్టుకోలేకే…ఒంటరిగా పోరాటం చేయలేకే…టీడీపీతో జట్టు కట్టారని గుర్తు చేస్తున్నారు. పొత్తు పెట్టుకుంటామని పవన్ కల్యాణ్ వద్దకు చంద్రబాబు వెళ్లలేదని…టీడీపీ గెలుస్తుందన్న సంకేతాలు రావడంతో…పవన్ కల్యాణ్ పొత్తులకు ముందుకొచ్చిన విషయాన్ని మరచిపోవద్దని హెచ్చరిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ల చరిత్ర ఉందని…ఎన్నో ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాలను సాధించిందని…ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని అంటున్నారు. అప్పుడు కూడా జనసేన ఉందా ? తెలుగుదేశం పార్టీ కేడర్ కు జనసేనతో పోలికా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు లేకపోతే జనసేనకు మనుగడ లేదని విషయాన్ని గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎవరు గొప్ప అనే అంశాన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచిస్తున్నారు. ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.