Kavitha: కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఇదేనా?

ఇప్పుడు కవితను విడిచి పెట్టినంత మాత్రాన ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా..? ఇక కవితను అరెస్ట్ చేయరా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 09:35 AMLast Updated on: Mar 12, 2023 | 9:35 AM

Is This The Reason Why Kavitha Was Not Arrested

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. ఢిల్లీలో ఈడీ విచారణ తర్వాత కవిత అరెస్ట్ ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే హడావుడి చేసేందుకు బీఆర్ఎస్, ఆప్ శ్రేణులు రెడీ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఈడీ ట్విస్ట్ ఇచ్చింది. కవితను అరెస్ట్ చేయకుండా ఈడీ విడిచిపెట్టింది. 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

ఇప్పుడు కవితను విడిచి పెట్టినంత మాత్రాన ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా..? ఇక కవితను అరెస్ట్ చేయరా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఇక మిగిలింది కవిత, మాగుంట శ్రీనివాస రెడ్డి మాత్రమేనని.. త్వరలోనే వీళ్లిద్దరి అరెస్టు కూడా ఖాయమని ఢిల్లీలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం సాగుతోంది. మాగుంటకు ఇంకా నోటీసులు రాలేదు. కవితకు ఈడీ నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. దీంతో కవిత అరెస్టు ఖాయమనుకున్నారు అందరూ. కానీ అలా జరగలేదు.

కవితను అరెస్టు చేయకుండా వదిలిపెట్టడానికి అనేక కారణాలున్నాయని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా కవిత అరెస్ట్ ఖాయమని బీఆర్ఎస్, ఆప్ శ్రేణులు పక్కాగా అంచనా వేశాయి. అదే జరిగితే అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో పెద్దఎత్తున ఆందోళనలకు దిగాలని రెడీ అయ్యాయి. పార్టీ కేడర్ కు ఈ మేరకు సంకేతాలిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని ప్లాన్ వేశాయి. తద్వార బీజేపీ కక్ష సాధిస్తోందనే విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాయి. అయితే ఆ పార్టీల స్కెచ్ ఫెయిల్ అయింది.

కవితను అరెస్టు చేస్తే ఢిల్లీ, తెలంగాణలో ఆప్, బీఆర్ఎస్ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయనే విషయాన్ని బీజేపీ పసిగట్టింది. అందుకే కవిత అరెస్టును కేంద్రం పోస్ట్ పోన్ చేయించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాగే ఒకటి, రెండు సార్లు విచారణకు పిలిపించి చివర్లో అరెస్టు చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అప్పటికే బీఆర్ఎస్, ఆప్ కేడర్ కూడా నీరసించిపోతుందని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.