పాక్‌ను ధ్వంసం చేస్తున్న బలూచ్ ఫైటర్స్ పీవోకే విలీనానికి ఇదే సరైన సమయమా?
విధ్వేషం, విభజన పునాదులపై ఏర్పడ్డ పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా? 75 ఏళ్ల బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం పతాక స్థాయికి చేరడం ఇస్లామాబాద్ పతనానికి ఆరంభమేనా? ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు పాక్ నుంచి వేరు పడే టైం దగ్గర పడిందా?

విధ్వేషం, విభజన పునాదులపై ఏర్పడ్డ పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా? 75 ఏళ్ల బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం పతాక స్థాయికి చేరడం ఇస్లామాబాద్ పతనానికి ఆరంభమేనా? ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు పాక్ నుంచి వేరు పడే టైం దగ్గర పడిందా? పాకిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల చేతులు కలిపిన బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. పాకిస్తాన్‌ను కలలో కూడా ఉలిక్కిపడేలా దాడులు తీవ్రం చేశాయి. ఏకంగా ఒక రైలునే హైజాక్ చేసి వందల మంది ప్రయాణికుల్ని, 100 మంది సైనికులను బందీలుగా పట్టుకోవడం పాకిస్తాన్ పాలకులను పరుగులు పెట్టించింది. ఈ పోరాటం ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకూ, బలూచిస్తాన్‌లో అసలేం జరుగుతోంది? ట్రైన్ హైజాక్ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? పాకిస్తాన్ మూడు ముక్కలు కావడం ఖాయం అని ఆ దేశ పాలకులే ఎందుకు డిసైడ్ అయిపోతున్నారు? టాప్ స్టోరీలో చూద్దాం..
జాఫర్ ఎక్స్‌ప్రెస్.. నిన్నటివరకూ పాకిస్తాన్ ప్రజలకు మాత్రమే తెలిసిన రైలు ఇది. ఇప్పుడు ఈ ట్రైన్ పేరు ప్రపంచం మొత్తానికీ తెలిసింది. అందుకు కారణం జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ కావడమే. హైజాక్ చేయడమే తెలిసిన పాకిస్తాన్‌కు ఫస్ట్ టైం హైజాక్‌కు గురైతే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. బందీలను విడిపించడానికి పడే ఇబ్బందులేంటో తెలిసొచ్చాయి. బాధితుల పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుం దో అర్ధమైంది. ఒకరు ఇరిద్దరూ కాదు అక్షరాలా 350మంది ప్రయాణికులు ఆరైలులో ఉన్నారు. వారితో పాటు 100మంది పాక్ సైనికులు కూడా ఉన్నారు. వారందరినీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ బందీలుగా పట్టుకుంది. వారిలో సుమారు 30మంది సైనికుల్ని చంపేసింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు బలూచ్ పౌరులను విడిచిపెట్టి.. 182 మందిని బందీలుగా తమ దగ్గర ఉంచుకున్నారు. తమపై ఎలాంటి మిలిటరీ యాక్షన్‌కు దిగినా వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడరనీ పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ సైన్యం జోక్యం గనక చేసుకుంటే బందీలుగా ఉన్న వారిని ఉరితీస్తామని హెచ్చరించింది. పాక్ పతనంలో ఇది తొలి అడుగు మాత్రమే.. ఎందుకంటే, ఆల్రెడీ పాకిస్తాన్ ముక్కలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇది ఆ దేశ పాలకులే ఒప్పుకున్నారు.
బలూచిస్తాన్ , ఖైబర్ ఫఖ్తుంఖ్వా మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ప్రకటించారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి సర్కార్, సైన్యంతో పాటు ISI కూడా కారణమే అని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో బలూచ్ ఉద్యమం ఊపందుకుంది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాక్ ఒక విఫల రాజ్యమనీ, బలూచిస్తాన్, సింధ్, ఆక్రమిత కశ్మీర్ సంపదని అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తోందని ఆరోపించారు. దీనికి చైనా తోడై పాకిస్తాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకుందని వివరించారు. పాక్, చైనాలను బలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇప్పుడు ఆ దిశగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు పెంచింది.
నిజానికి.. బలూచిస్తాన్ వివాదం భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత నుంచే ప్రారంభమైంది. 1948లో పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్‌ను కలిపేసుకుంది. నాటి నుంచీ అక్కడ జాతీయవాదులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి విభజన సమయంలో బలూచిస్తాన్‌లోని అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన ఖాన్ ఆఫ్ కలాత్.. భారత్‌లో చేరాలని కోరుకుంది. ఆ తర్వాత జిన్నా సమక్షంలో బలవంతంగా బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్‌లో చేరాల్సి వచ్చింది. పాలన అయినా సక్రమంగా చేశారా అంటే అదీ లేదు. బలూచిస్తాన్‌లో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది ఇస్లామాబాద్. తమకు ఎదురు తిరిగిన వాళ్ల ఆచూకీ లేకుండా చేసింది. ఇవన్నీ సరిపోవన్నట్టు లెక్కకుమించిన ఉగ్రవాద సంస్థలకు బలూచిస్తాన్‌ను కేరాఫ్ అడ్రస్ చేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇస్లామాబాద్‌పై తిరగబడ్డారు. ఆ పోరు ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. ఇక మిగిలింది బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం ఒక్కటే. కానీ, ఇది ఇక్కడితో ఆగదు.. ఎందుకంటే, ఇస్లామాబాద్ పాలనను కాదనుకుంటోంది బలూచిస్తాన్ ఒక్కటే కాదు.. మరో మూడు ప్రాంతాలు కూడా.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్, సింధ్, పాక్ ఆక్రమిత కశ్మీర్.. బలూచిస్తాన్‌తో పాటు స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ప్రాంతాలే ఇవన్నీ. ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలో భారత్‌లో విలీనం అవుతుందని ప్రకటించారు. కశ్మీర్ సమస్యకు అదొక్కటే పరిష్కారం అని తేల్చి చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పలు సందర్భాల్లో పీవోకే విలీనం తథ్యం అన్నారు. అందుకు తగ్గట్టే కార్గిల్‌లో ఇండియన్ నేవీ బాహుబలి విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్‌ను కూడా మోహరించారు. ఈ పరిణామాలన్నీ త్వరలోనే పీవోకే విలేనమే లక్ష్యంగా యాక్షన్ ఉండబోతోందని చెబుతున్నాయి. అటు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు ఆల్రెడీ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లి పోయింది. అక్కడ కూడా పాకిస్తాన్ సర్కార్ ప్రభావం లేదు. సింధ్ ప్రాంతంలో కూడా ఇంచుమించు ఇవే పరిస్థితులున్నాయి. చివరికి పాకిస్తాన్‌కు మిగిలేది పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే అనేది విశ్లేషకుల అంచనా.
ఆ లెక్క ప్రకారం బలూచిస్తాన్ ఆరంభం మాత్రమే.