YCP: వైసీపీ ఆత్మరక్షణలో పడిందా..?
చాలా చేశామని వైసీపీ చెప్పుకుంటున్నా.. చేయాల్సింది ఇంకేదో ఉందని ప్రజలు తీర్పు చెప్పారు. ఇన్నాళ్లూ వైసీపీ నేల విడిచి సాము చేసిందని ఇప్పుడు తేలింది. మరి ఇప్పుడైనా వైసీపీ మేల్కొంటుందా.. లేకుంటే సజ్జల చెప్పినట్లు వాళ్లు ఓటర్లు వేరే ఉన్నారని సర్ది చెప్పుకుంటారా..?
ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మింగుడు పడని అంశం. మూడు పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరిగితే మూడింటినీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అసలు తెలుగుదేశం పార్టీ ఉనికే రాష్ట్రంలో లేదని.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలిపి తీరుతామనే ధీమాలో ఇన్నాళ్లూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం వైసీపీ పరిస్థితికి అద్దం పడుతోంది.
పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని.. ప్రభుత్వంపై రెఫరెండం కూడా కాదని అభిప్రాయపడ్డారు. ఇది సజ్జల అభిప్రాయం అయి ఉండొచ్చు. లేదా పార్టీ స్టాండ్ కూడా ఇదే కావచ్చు. కానీ పైకి ఇలా చెప్తున్నా లోలోన ఎందుకిలా జరిగిందని ఆ పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టభద్రులు అన్ని వర్గాలనూ ప్రతిబింబించరని.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వాళ్లు ఈ ఎన్నికల్లో ఓట్లేయలేదని సజ్జల చెప్పుకొచ్చారు. తమ పాలనలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో లబ్ది కలిగిందని చెప్తోంది వైసీపీ. అలాంటప్పుడు ఆ లబ్దిదారుల కుటుంబాల్లో పట్టభద్రులు కూడా భాగమే కదా. మరి వాళ్లు ఎందుకు వైసీపీకి ఓటేయలేదు?
గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన ప్రాంతాలు వైసీపీకి కంచుకోటలుగా పేరొందినవే. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో గత ఎన్నిక్లలో వైసీపీ ఘన విజయం సాధించింది. అలాంటిచోట ఇప్పుడు ఆ పార్టీ ఘోరంగా వెనుకబడింది. ఉత్తరాంధ్రలో టీడీపీకి, వైసీపీ మధ్య దాదాపు 18 శాతం ఓట్ల గ్యాప్ ఉంది. తూర్పు రాయలసీమలో 16 శాతం ఉంది. పశ్చిమ రాయలసీమలో 3శాతం ఉంది. దీన్నిబట్టి తమకు బాగా పట్టుందని విర్రవీగుతున్న వైసీపీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు, కృష్ణా లాంటి చోట ఇలాంటి ఓటమి ఎదురై ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఈ స్థాయిలో ఓటమి అంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.
విశాఖను రాజధానిగా చేస్తున్నందున ఉత్తరాంధ్ర ప్రజలు ఈసారి తమకు పట్టం కడతారని వైసీపీ అంచనా వేసింది. అయితే చదువుకున్న పట్టభద్రులే వైసీపీని ఇక్కడ ఘోరంగా ఓడించారు. ఏ దశలోనూ టీడీపీకి వైసీపీ అభ్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఇక్కడ రాజధాని అసలు సబ్జక్టే కాదని ప్రజలు భావిస్తున్నారా..? ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది? కచ్చితంగా బేరీజు వేసుకోవాల్సిన అంశాలే. ఇలాంటి పరిస్థితే తూర్పు రాయలసీమలో కూడా ఎదురైంది. కుప్పంలోనూ ఈసారి పాగా వేస్తామని చెప్పుకుంటోంది వైసీపీ. కానీ కుప్పం కాదు కదా.. తూర్పు రాయలసీమ మొత్తం వైసీపీ వైపు మొగ్గు చూపట్లేదని తేలింది. ఇక్కడ కూడా టీడీపీకి వైసీపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇక పశ్చిమ రాయలసీమలో మాత్రం హోరాహోరీ పోరు నడిచింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు వైసీపీ కంచుకోటలు. అలాంటి చోట జగన్ పురిటిగడ్డ పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలవడం మామూలు విషయం కాదు. ఇన్నాళ్లూ పులివెందులల వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. కానీ ఇప్పుడు భూమిరెడ్డి రూపంలో ఒకడొచ్చాడని టీడీపీ చెప్తోంది.
మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ అతి విశ్వాసాన్ని భారీగా దెబ్బకొట్టాయి. చాలా చేశామని వైసీపీ చెప్పుకుంటున్నా.. చేయాల్సింది ఇంకేదో ఉందని ప్రజలు తీర్పు చెప్పారు. ఇన్నాళ్లూ వైసీపీ నేల విడిచి సాము చేసిందని ఇప్పుడు తేలింది. మరి ఇప్పుడైనా వైసీపీ మేల్కొంటుందా.. లేకుంటే సజ్జల చెప్పినట్లు వాళ్లు ఓటర్లు వేరే ఉన్నారని సర్ది చెప్పుకుంటారా..?