Viveka Murder: వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ నేతల డ్రామాలు..!?
వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ అభాసుపాలవుతున్నారు. తమ మెడకు చుట్టుకుంటోందని భావించే ఇప్పుడు వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ కేసు వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుటుంబ వ్యవహారం కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. వివేకా హత్య కేసులో మొదటి నుంచి ఎన్నో అనుమానాలు, మలుపులు సంభవించాయి. ఇప్పుడిప్పుడే ఇది ఒక కొలిక్కి వస్తోంది. అయితే వివేకా హత్య మొదలు ఇప్పటి దాకా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిస్తోంది.
వివేకానంద రెడ్డి బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్నారు. ఆయనకు గుండెపోటు సంభవించిందని.. నోటి నుంచి రక్తం కారిందని.. మొదటి వార్త బయటికొచ్చింది. ఇది నిజమేనని అందరూ నమ్మారు. అయితే ఆ తర్వాత కాసేపటికి వివేకానంద రెడ్డి శరీరంపై గాయాలున్నాయనే వార్త బయటికొచ్చింది. దీంతో ఇది అనుమానాస్పద మృతిగా తెరపైకి వచ్చింది. ఆరోజు సాయంత్రానికి వివేకానంద రెడ్డిని ఎవరో దారుణంగా హత్య చేశారని వార్తలు బయటికొచ్చాయి. అంతేకాదు.. ఇదే సందర్భంలో వివేకానంద రెడ్డి స్వయంగా రాసిన లేఖ కూడా ఒకటి బయటికొచ్చింది. దీంతో ఇది మరింత సంచలనానికి కారణమైంది.
వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో ఇది ప్రభుత్వ హత్యేనని వైసీపీ నేతలు ఆరోపించారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి తదితరులు ఈ హత్యకు పాల్పడ్డారని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అదే సమయంలో వైసీపీ పత్రికలో నారాసుర రక్త చరిత్ర పేరుతో ఫుల్ పేజ్ ఆర్టికల్ ఒకటి ప్రచురితమైంది. దీంతో దీని వెనుక వై.ఎస్.కుటుంబ వ్యతిరేకుల హస్తం ఉండొచ్చనే అనుమానాలు కూడా తలెత్తాయి.
అయితే వై.ఎస్.వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రంగంలోకి దిగాక సీన్ మారిపోయింది. తనకు ఈ హత్యపై అనుమానాలున్నాయని, వివేకా సన్నిహితులే ఈ హత్య చేసి ఉండొచ్చని ఆమె పలు అనుమానాలు లేవనెత్తింది. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. అప్పటివరకూ దీనిపై సిట్ విచారణ జరపగా.. ఆ తర్వాత సునీత డిమాండ్ తో కేసును సీబీఐకి అప్పగించింది జగన్ ప్రభుత్వం. అయితే ఆ తర్వాత సీబీఐకి రాష్ట్ర అధికారులు సహాయ నిరాకరణ చేశారు. దీంతో ఈ కేసును విచారించడం తమ వల్ల కావట్లేదని సీబీఐ సాక్షాత్తూ కోర్టుకు వెల్లడించింది.
ఇప్పుడు ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి దగ్గర ఆగింది కేసు వ్యవహారం. ఇప్పుడేమో వైసీపీ నేతలు ఇది వై.ఎస్.సునీత, ఆమె భర్తే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. వివేకానండ రెడ్డి రెండో భార్య కుమారుడికి ఆస్తి రాసిస్తాడనే కోపంతో సునీత కుటంబమే ఈ హత్యకు పాల్పడి ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఇలా వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ అభాసుపాలవుతున్నారు. తమ మెడకు చుట్టుకుంటోందని భావించే ఇప్పుడు వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.