IT Raids: తెలంగాణ, తమిళనాడుల్లో ఐటీ దాడులు.. అధికార పార్టీ నేతలే టార్గెట్.. ఎన్నికల ముందు బీజేపీ వ్యూహమా..?

రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆయా పార్టీలు విమర్శిస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా మరోసారి ఈ దాడులు జరగడంతో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2023 | 03:56 PMLast Updated on: Jun 14, 2023 | 3:56 PM

It And Ed Raids On Opposition Parties In Telangana And Tamilnadu Opposition Targeted By Bjp

IT Raids: తెలంగాణ, తమిళనాడుల్లో అధికార పార్టీ నేతలపై ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీపై ఐటీ శాఖ దాడులు చేయగా, తమిళనాడులో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేసింది. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆయా పార్టీలు విమర్శిస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా మరోసారి ఈ దాడులు జరగడంతో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేత, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డితోపాటు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. అలాగే నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్స్‌లో కూడా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచి వీరికి చెందిన వ్యాపార సంస్థలు, ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక తమిళనాడుకు సంబంధించి అధికార డీఎంకే నేత, విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 17 గంటలు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బాలాజీ, అశోక్‌ను అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి తరలించారు. అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో బాలాజీకి ఛాతీనొప్పి రాగా ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. సెంథిల్ బాలాజీ ఆస్పత్రిలో చేరడంతో ఆ పార్టీ నేతలు, అతడి అనుచరులు ఆస్పత్రి ఎదుటకు చేరుకున్నారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రతిపక్షాల ఆగ్రహం
డీఎంకే నేతలపై ఈడీ దాడులు చేయడాన్ని ఆ పార్టీతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎన్సీపీ వంటి పార్టీలు ఖండించాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ శరద్ పవార్ ఈ దాడులను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ నేతలు ఈ దాడులను ఖండించారు. ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తూ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆ పార్టీ నేతలు విమర్శించారు.
పార్టీలను దారికి తెచ్చుకునేందుకేనా..?
ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడుల ద్వారా ప్రతిపక్ష నేతల్ని తమదారికి తెచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పార్టీలు అంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. కానీ, అది సాధ్యం కావడం లేదు. అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది. కేరళలో ఇప్పుడప్పుడే అవకాశం లేదు. ఏపీపై బీజేపీకి ప్రస్తుతం ఆసక్తి లేదు. మిగిలింది తెలంగాణ, తమిళనాడు. అందుకే ఈ రాష్ట్రాల్లోనే ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర వైఖరిని పార్టీలు తిప్పికొడుతున్నాయి. తమ పార్టీ నేతలపై దాడులు చేయడం ద్వారా తమను చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ విమర్శిస్తున్నాయి. కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాయి. అయితే, ఎన్నికల సమయంలో ఇలా దాడులు చేసి.. దీని ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీ ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది.