జబర్దస్త్ టూ కేబినేట్, అప్పుడు రోజా ఇప్పుడు నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు ఏపీ క్యాబినెట్ లో అడుగుపెట్టడం దాదాపుగా లాంఛనం అయిపోయింది. ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు చేస్తారని ముందు నుంచి ప్రచారం జరిగినా చివరకు ఆయనను క్యాబినెట్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపించారు.
మెగా బ్రదర్ నాగబాబు ఏపీ క్యాబినెట్ లో అడుగుపెట్టడం దాదాపుగా లాంఛనం అయిపోయింది. ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు చేస్తారని ముందు నుంచి ప్రచారం జరిగినా చివరకు ఆయనను క్యాబినెట్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ లోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ముందు నుంచి కూడా ఆ పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు.
ప్రజారాజ్యం సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబు ప్రజారాజ్యం పార్టీలో రైతు రాజ్యం అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన తర్వాత సినిమా నిర్మాతగా మారి రామ్ చరణ్ హీరోగా ఆరెంజ్ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఆయనకు దారుణంగా షాక్ ఇవ్వడంతో ఆ తర్వాత కాస్త సైలెంట్ అయి మళ్లీ ఆయన కుమారుడు వరుణ్ తేజ్ సినిమాల్లోకి రావడం, ఇక అదే సమయంలో జబర్దస్త్ అనే షో మొదలు పెట్టడంతో నాగబాబు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయిన నాగబాబు… జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి టైమింగ్ తో అప్పుడప్పుడు పంచులు వేస్తూ నవ్వించారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంతో అటు జబర్దస్త్ అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేస్తూ జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. దీనితో 2019 ఎన్నికల్లో ఆయనకు నరసాపురం పార్లమెంట్ సీటును పవన్ కళ్యాణ్ కేటాయించగా అప్పుడు ఘోర ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత నాగబాబు జనసేన పార్టీలో మళ్లీ కీలకంగా పనిచేసి 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వచ్చారు. ఇక 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి కలిపి కూటమిగా పోటీ చేయడంతో నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ సీట్ అడిగారు. అయితే అనకాపల్లి పార్లమెంట్ సీటును బిజెపి నేత సీఎం రమేష్ కు కేటాయించాల్సి రావడంతో ఆ సమయంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.
అయితే ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండటంతో ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే రాజ్యసభ స్థానాన్ని బిజెపి తీసుకుని ఆర్ కృష్ణయ్యను నిలబెట్టడంతో ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన పార్టీ తీసుకోవాలని భావించింది. కానీ చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించకపోవడంతో ఇక పవన్ కళ్యాణ్ నాగబాబును ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లోకి తీసుకోవాలని పట్టుబట్టారు. దీనితో చంద్రబాబు అందుకు అంగీకారం తెలిపారు.
ఏపీలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటి అంటే జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి జడ్జిలుగా ఫేమస్ అయిన ఆర్కే రోజా అలాగే నాగబాబు ఇద్దరు మంత్రులుగా ఏపీ క్యాబినెట్లో అడుగు పెట్టడం గమనార్హం. వైసిపి ప్రభుత్వంలో ఆర్కే రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అదే జబర్దస్త్ షోలో మరో జడ్జిగా వ్యవహరించిన నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.
ఇక నాగబాబుకు కూడా పర్యాటక శాఖలో కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా 15 ఏళ్ల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన నాగబాబు ఎట్టకేలకు మంత్రిగా కేబినేట్ లో అడుగు పెట్టడం పట్ల జనసేన కార్యకర్తలు అలాగే మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ మంత్రి పదవికి టీడీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నా సరే ఇలా చేయడం కరెక్ట్ కాదని, నాగబాబు అప్పట్లో దారుణంగా మాట్లాడారని విమర్శలు చేస్తున్నారు టీడీపీ క్యాడర్.