Jagadish Reddy: కేసీఆర్‌ని ఇరికించేసిన జగదీశ్ రెడ్డి.. అసెంబ్లీలో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్
విద్యుత్ ఒప్పందాలన్నింటిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలంటూ సభాపతిని కోరిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. కేసీఆర్‌ను, ఇతర బీఆర్ఎస్ నేతలను అడ్డంగా ఇరికించారు.

Jagadish Reddy: యాదాద్రి పవర్ ప్రాజెక్టులోగానీ, ఇతర పవర్ అగ్రిమెంట్లలో అక్రమాలు జరిగాయని అనిపిస్తే తనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా చత్తీస్‌గడ్‌తో విద్యుత్ ఒప్పందం, భద్రాది ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచరణకు ఆదేశించారు.
REVANTH REDDY: రేవంత్ రెడ్డి వేట మొదలైంది..! విద్యుత్‌పై జ్యుడీషియల్ ఎంక్వైరీ..
యాదాద్రి పవర్ ప్రాజెక్టుతో సహా విద్యుత్ ఒప్పందాలన్నింటిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలంటూ సభాపతిని కోరిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఇతర బీఆర్ఎస్ నేతలను అడ్డంగా ఇరికించారు. ఉద్దేశపూర్వకంగా అన్నారో.. తొందరపడి నోరు జారారో కానీ.. సర్కారు ఉచ్చులో మాజీ మంత్రి ఇరుక్కున్నారు. జ్యూడిషల్ ఎంక్వయిరీ అంటూ చేస్తే కచ్చితంగా పవర్ పర్చేసింగ్ ఎగ్రిమెంట్స్‌లో ఉన్న లోపాలు బయటకు వస్తాయి. ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అసలు లోపాలు వెతకాలి అనే లక్ష్యంతో మొదలైతే నూటికి నూరు శాతం అన్నీ బయటపడతాయి. సిట్టింగ్ జడ్జితో గనుక విచారణ చేయిస్తే ఆ రిపోర్టుపై హైకోర్టు స్టే కూడా ఇవ్వలేదు.
సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలకు దిగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా లోపలికి వెళ్తారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అనవసర ఆవేశానికిలోనై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. చిత్రంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షమే ఛాలెంజ్ చేసి ఇరుక్కుంది. విద్యుత్ ఒప్పందాలపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరగాలని జగదీశ్వర్ రెడ్డి స్వయంగా కోరడంతో ప్రభుత్వం పని సులువు అయింది. ఈ జ్యడిషియల్ ఎంక్వయిరీ భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.