జగన్‌ దెబ్బ అదుర్స్ కదా.. ప్రతిపక్ష హోదా సంగతేంటి ?

రానని చెప్పి వచ్చినప్పుడే.. ఊరికే రారు మహానుభావులు అనుకున్నారంతా ! ఏపీ అసెంబ్లీ ఓవరాల్ ఎపిసోడ్ చూశాక అదే నిజం అనిపిస్తోంది కూడా ! కూటమి అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ లేనంత ఆసక్తి రేపాయ్ ఈసారి అసెంబ్లీ సమావేశాలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 09:12 PMLast Updated on: Feb 24, 2025 | 9:12 PM

Jagan Is Demanding That He Will Not Come To The Assembly Even If He Is Given Opposition Status

రానని చెప్పి వచ్చినప్పుడే.. ఊరికే రారు మహానుభావులు అనుకున్నారంతా ! ఏపీ అసెంబ్లీ ఓవరాల్ ఎపిసోడ్ చూశాక అదే నిజం అనిపిస్తోంది కూడా ! కూటమి అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ లేనంత ఆసక్తి రేపాయ్ ఈసారి అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని.. లేదంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తూ ఉంటానని చెప్పిన జగన్‌.. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడమే దీనికి కారణం. సభకు వచ్చిన జగన్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఆందోళనకు దిగారు. పోడియం ఎదుట.. ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరసనలు చేసిన తర్వాత.. ప్రభుత్వం తీరు, గవర్నర్ స్పీచ్‎కు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.

సభకు వచ్చినట్లే వచ్చిన జగన్.. 20 నిమిషాల్లోనే పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేయటం కొత్త చర్చకు కారణం అయింది. జగన్ అలా వచ్చి ఇలా వెళ్లడం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారంటూ అధికార పార్టీ నేతలు ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీకి వైసీపీ హాజరుపై.. కొంతకాలంగా భారీ మాటల యుద్ధం జరుగుతోంది. స్పీకర్ చైర్‌లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉండగా.. జగన్‌ను సభలో కూర్చొబెట్టాలని అధికార పార్టీ ఆశపడింది. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేగాని సభకు రానంటూ జగన్‌ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ సరికొత్త అస్త్రాన్ని తెరమీదకు తీసుకవచ్చింది. 60 రోజులు సభకు రాకపోతే.. చట్టప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని స్పీకర్‌ అయ్యన్నతో పాటు.. డిప్యూటీ స్పీకర్ రఘురామ వార్నింగ్ ఇచ్చారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత ప్రమాదం నుంచి బయటపడాలంటే.. సభకు వచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో రాజకీయం రసవత్తరంగా కనిపించింది.

ఇలాంటి టైమ్‌లో వస్తారా రారా అనుకుంటే.. ఎమ్మెల్యేలను వెంటేసుకొని వచ్చేశారు జగన్‌. ఐతే ఇక్కడే జగన్ మార్క్ స్ట్రాటజీ కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఏ టెక్నికల్ ఇష్యూను అడ్డుపెట్టుకొని వైసీపీని సభకు రాబట్టాలని కూటమి సర్కార్ గేమ్ స్టార్ట్ చేసిందో.. అదే టెక్నికల్ పాయింట్‌తో.. కూటమికి జగన్‌ షాక్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. వరుసగా 60రోజులు రాకపోతే సభ్యత్వం రద్దు అని కూటమి సర్కార్ అంటే.. ఒకరోజు వచ్చి సంతకాలు చేసి.. అలా వెళ్లిపోయి.. అదే రూల్స్‌ను ఆయుధంగా వాడుకున్నారు జగన్‌. ఇక ఏమీ చేయలేరు అంటూ సంకేతాలు పంపించారు. ఇక పనిలో పనిగా మళ్లీ ప్రతిపక్ష హోదా నినాదం ఎత్తుకున్నారు. రాదని.. ఇవ్వలేరని తెలిసినా.. కూటమి సర్కార్‌ను టార్గెట్‌ చేసేందుకు చేశారేమో అనిపించింది కొన్నిసార్లు జగన్ మాటలు వింటే ! ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఇదే జగన్.. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు.. 23మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆరుగురిని లాక్కుంటే.. హోదా గల్లంతు అంటూ వార్నింగ్ ఇచ్చారు కూడా. అలాంటి జగన్‌..

ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడగడం ఏంటనేది అసలు ప్రశ్న. పదిశాతం ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంటే 175 మందికి గాను.. కనీసం 18మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఐతే వైసీపీకి 11 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఐనా సరే ప్రతిపక్ష హోదా డిమాండ్ ఏంటో.. కావాలని రచ్చ కాకపోతే అనేది చాలామంది అభిప్రాయం. ఐతే ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో లేదని.. ఇక ప్రజాపోరాటమే అని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చి.. విపక్ష హోదా మీద వైసీపీ మైండ్‌ ఫిక్స్ చేసే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. ఏమైనా.. ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.