YS Jagan Family: అవినాశ్ అరెస్ట్ చుట్టూ జగన్ భవిష్యత్..! పార్టీపై భారీ ఇంపాక్ట్..!?
ఇన్నాళ్లు నందమూరి కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రత్యర్థులందరూ వై.ఎస్.ఫ్యామిలీని కూడా ఇదే విధంగా టార్గెట్ చేయడం ఖాయం. వీటికి వైసీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే సునీత, షర్మిల సంధించే ప్రశ్నలకైనై వాళ్లు స్పందించక తప్పదు.
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. సీబీఐ ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తుందో.. దాని ప్రభావం ఎవరిపై ఎలా పడుతుందో అస్సలు ఊహించడానికి వీల్లేకుండా ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేస్తే అవినాశ్ రెడ్డి అరెస్టుపై క్లారిటీ వస్తుంది. ఒకవేళ అవినాశ్ రెడ్డి అరెస్టు అయితే దాని ప్రభావం జగన్ తో పాటు కడప జిల్లాపైన కూడా పడుతుంది. సొంత కుటుంబసభ్యులే వివేకానంద రెడ్డిని హత్య చేశారని అందరూ చెప్పుకంటారు. ఇది పార్టీకి, జగన్ కు పెద్ద తలనొప్పి.
వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టయితే దాని ప్రభావం కడప జిల్లా రాజకీయాలపై గణనీయంగానే పడుతుంది. ఇన్నాళ్లూ వై.ఎస్.ఫ్యామిలీకి కడప జిల్లాలో తిరుగులేదు. ఆ కుటుంబం చెప్పినట్టు జిల్లా మొత్తం నడుచుకుంటోందనే చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు జిల్లా మొత్తానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కడప ఎంపీ స్థానానికి జగన్ మరొకరిని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొని, అరెస్ట్ అయిన అవినాశ్ రెడ్డిని మళ్లీ ఎన్నికల బరిలోకి దింపడం పెద్ద సాహసమే అవుతుంది. ఆ పని జగన్ చేయకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ఎవరిని బరిలోకి దింపాలనేదానిపై జగన్ అప్పుడే ఆలోచించడం మొదలు పెట్టారని తెలుస్తోంది.
కడప జిల్లాలో వై.ఎస్.ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని ప్రత్యర్థులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ అవకాశం ఇచ్చినట్లే. అవినాశ్ అరెస్టు ద్వారా ప్రత్యర్థులందరూ ఏకం కావడం తథ్యం. అంతేకాక వై.ఎస్. కుటుంబంలోని సునీత కూడా ప్రత్యర్థులతో కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లూ ఫ్యామిలీలో ఎన్ని మనస్ఫర్థలు ఉన్నా వై.ఎస్. కుటుంబీకులంతా కలసిమెలసి సాగారు. కానీ వివేకా హత్య వాళ్ల మధ్య విభేదాలను తారస్థాయికి తీసుకెళ్లింది. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శించుకునే స్థాయికి వెళ్లాయి మాటలు. ఒకవైపు సునీత అవినాశ్ ఫ్యామిలీపై ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమైంది. మరోవైపు షర్మిల ద్వారా జగన్ తో విభేదాలు బయటకు వచ్చాయి.
కుటుంబంలోని పరిణామాలు జగన్ కు పెద్ద సమస్యగా మారాయి. ఇన్నాళ్లు నందమూరి కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రత్యర్థులందరూ వై.ఎస్.ఫ్యామిలీని కూడా ఇదే విధంగా టార్గెట్ చేయడం ఖాయం. వీటికి వైసీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే సునీత, షర్మిల సంధించే ప్రశ్నలకైనై వాళ్లు స్పందించక తప్పదు. మరి ఇలాంటి వాటన్నింటినీ ఎదుర్కోవడం జగన్ కు కత్తిమీద సామే. అటు కుటుంబం నుంచి, ఇటు జిల్లా ప్రజల నుంచి, పార్టీ నేతల నుంచి.. ఇలా నలువైపుల నుంచి వచ్చే సూటిపోటి మాటలు జగన్ ను ముప్పతిప్పలు పెట్టడం ఖాయం. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో పార్టీపైన ప్రభావం చూపించడం మాత్రం ఖాయం.