సజ్జలకు జగన్ వార్నింగ్.. సాయి రెడ్డి ఎఫెక్ట్…?
వైసీపీ ప్రస్తుత ఉన్న పరిస్థితికి కారణం వైయస్ జగన్ తో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. 2019లో 151 స్థానాలతో అత్యంత ఘనవిజయం సాధించిన పార్టీ...

వైసీపీ ప్రస్తుత ఉన్న పరిస్థితికి కారణం వైయస్ జగన్ తో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. 2019లో 151 స్థానాలతో అత్యంత ఘనవిజయం సాధించిన పార్టీ… 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడాన్ని వైసిపి కార్యకర్తలు అసలు జీర్ణించుకోవడం లేదు. అటు వైసీపీ నేతలకు కూడా ఈ ఓటమి ఇంకా మింగుడు పడటం లేదని చెప్పాలి. 2010 నుంచి కష్టపడి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైయస్ జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు వైసీపీని బాగా ఇబ్బంది పెట్టాయి.
దానికి తోడు పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం… పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేసిందని చెప్పాలి. ఇంకా పార్టీ నేతలను జగన్ కు దూరం చేయడం కూడా వైసిపి పతనానికి కారణమనే అభిప్రాయాలు చాలామంది నుంచి వినిపించాయి. ముఖ్యంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి… వైయస్ జగన్ కు పార్టీ కార్యకర్తలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ… జగన్ ను కార్యకర్తలకు, పార్టీ నాయకులకు దూరం చేశారనే అభిప్రాయాలు అప్పట్లో చాలా వరకు వైసిపి నేతల నుంచే వినిపించాయి.
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏం చేయాలన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అప్పట్లో. ఇక వైసిపి సోషల్ మీడియా కూడా విజయసాయిరెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాక్కున్నారు. వైసీపీలో రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి పెత్తనమే ఎక్కువగా కనపడింది. దీనితో విజయసాయిరెడ్డి విసిగిపోయి జగన్ కు దూరమయ్యారు. సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అదే. ఈ విషయాన్ని స్వయంగా విజయ సాయి రెడ్డి వెల్లడించారు.
అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో వైయస్ జగన్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు రామకృష్ణారెడ్డిని దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నారట. పార్టీ నేతలతో కూడా ఎటువంటి సమావేశాలు నిర్వహించొద్దని… పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉండవద్దని సజ్జల రామకృష్ణారెడ్డికి… జగన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. గతంలో ఆయన సాక్షిలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు కూడా సాక్షికి పరిమితం కావాలని జగన్ చెప్పినట్లు సమాచారం. సాక్షిలో ఎడిటర్ గా సజ్జల వైసీపీ అనుకూలంగా ఎన్నో కథనాలు రాసేవారు.
పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది బాగా ఉపయోగపడేది. ఇప్పుడు దానికి మాత్రమే ఆయన పరిమితం కావాలని… కొన్నాళ్లపాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది అని జగన్ సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. అలాగే తాడేపల్లి నివాసంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండకూడదు అని జగన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి వ్యవహారంతో కంగుతిన్న వైయస్ జగన్… మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రామకృష్ణారెడ్డిని దూరంగా పెడుతున్నట్లు సమాచారం.