Pawan Kalyan: ఎన్డీయే సమావేశానికి పవన్‌కు ఆహ్వానం.. కూటమిలో జనసేన చేరుతుందా..?
ఈనెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సమావేశానికి జనసేనను బీజేపీ ఆహ్వానించింది. పాత మిత్రులతోపాటు, కొత్త మిత్రులకు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. ఈ సమావేశం ద్వారా బీజేపీ, జనసేన ఒక్కటేనన్న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Pawan Kalyan: ఏపీలో జనసేన-బీజేపీ పొత్తు విషయంలో ఇంకా ఏదో అనుమానం కొనసాగుతున్నప్పటికీ బీజేపీ ఈ విషయంలో ఒక ముందడుగు వేసింది. ఈనెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సమావేశానికి జనసేనను బీజేపీ ఆహ్వానించింది. ఈ సమావేశం ద్వారా బీజేపీ, జనసేన ఒక్కటేనన్న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జాతీయ రాజకీయాల్లో ముందడుగు
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. దీనిలో భాగంగా ఎన్డీయే మిత్రపక్షాలు బలోపేతం చేయాలనుకుంటోంది. ముఖ్యంగా కొత్తమిత్రులను కలుపుకొనేందుకు చూస్తుంది. దీనికి ప్రధాన కారణం.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతోపాటు, ప్రతిపక్ష కూటమి బలపడుతుండటమే. గతంలో బీజేపీ చాలా బలంగా ఉండేది. ఈసారి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా దక్షిణాదిన బీజేపీ పరిస్థితి మరీ ఘోరం. అందుకే మిత్రపక్షాలను కలుపుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పాత మిత్రులతోపాటు, కొత్త మిత్రులకు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. అందుకే జనసేనను ఆహ్వానించింది. తెలుగు దేశం పార్టీకి కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది కానీ, ఈ విషయలో స్పష్టత లేదు.
అధికారంలో లేకున్నా
జనసేనకు ఏపీలో ఉన్నది ఒక్కరే ఎమ్మెల్యే. అది కూడా ఆ పార్టీకి దూరంగా, వైసీపీకి దగ్గరగా ఉంటున్నాడు ఆ ఎమ్మెల్యే. ఈ లెక్కన చూస్తూ జనసేనకు అసలు ప్రాతినిధ్యమే లేదని చెప్పాలి. అయినప్పటికీ ఎన్డీయే జాతీయ కూటమి సమావేశానికి జనసేనను ఆహ్వానించడం చెప్పుకోదగ్గ విషయమే. దీనికో కారణం ఉంది. ఇటీవలి కాలంలో జనసేన ఏపీలో బలపడుతోంది. కచ్చితంగా భవిష్యత్తులో నిర్ణయాత్మక శక్తిగా ఎదగగలదు. మరోవైపు ఎంతలేదన్నా వైసీపీ బలహీమవుతోంది. పైగా భవిష్యత్తులో ఆ పార్టీ బలహీనడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనతో ఉండటమే మంచిదనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్డీయేలో జనసేనకు తగిన ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.
టీడీపీకి ఆహ్వానం అందిందా..?
టీడీపీని కూడా బీజేపీ ఆహ్వానించిందని తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ స్పందించాల్సి ఉంది. ఇదే జరిగితే టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు ఎన్డీయే సమావేశానికి హాజరవుతారు. ఆయన సోమ వారం ఈ సమావేశానికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో టీడీపీ పాల్గొంటే.. ఏపీలో జనసేన-టీడీపీ-బీజేపీ పొత్త ఖాయమయ్యే ఛాన్స్ ఉంది. దీనవల్ల వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తప్పదు. గతంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా కూడా చేశారు. వాజ్‌పేయి హయాం నుంచి బీజేపీతో కలిసే ఉన్నారు. అయితే, 2018లో వైసీపీ రెచ్చగొట్టుడు ధోరణి వల్ల, ఆ ట్రాపులో పడి ఎన్డీయేకు టీడీపీ దూరమైంది. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన టీడీపీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ, బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
డిన్నర్ మీటింగే
ఎన్డీయే సమావేశాన్ని సాధారణ డిన్నర్ మీటింగ్‌గా చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. అయితే, పొత్తులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేయడంపై ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని జనసేన వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటివరకు ఏపీలో మాత్రమే పొత్తులో ఉన్నట్లు రెండు పార్టీలు ప్రకటించాయి. అయితే, జాతీయస్థాయిలో చర్చ జరగలేదు. ఎన్డీయే కూటమి సమావేశం తర్వాత ఎన్డీయే కూటమిలో జనసేన చేరే అంశంపై కూడ స్పష్టత రావొచ్చు.