Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు.. ఎన్డీయే భేటీకి పవన్.. అధికార పార్టీలకు దక్కని ఆహ్వానం
బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం జరుగుతుండగా, బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల భేటీ జరుగుతోంది. ఎన్డీయే సమావేశానికి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు.
Pawan Kalyan: జాతీయ రాజకీయాల్లో ఎన్డీయే భేటీ, ప్రతిపక్షాల భేటీ ఆసక్తికరంగా మారింది. మంగళవారం రోజే అటు బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం జరుగుతుండగా, బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల భేటీ జరుగుతోంది. ఈ సమావేశాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట దక్కనుంది.
అయితే, తెలంగాణ, ఏపీకి మాత్రం పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నవి ప్రాంతీయ పార్టీలే. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు ఆహ్వానం దక్కకపోవడం విశేషం. అయితే, లోక్‌సభలో ఎలాంటి ప్రాతినిధ్యం లేని జనసేనకు మాత్రం ఎన్డీయే తరఫున ఆహ్వానం అందింది. ఎన్డీయే సమావేశానికి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ జాతీయ కూటమి బలంగా ఉండాలన్నా ప్రాంతీయ పార్టీలు చాలా కీలకం.
అందులోనూ అధికారంలో ఉన్న పార్టీలకు ఆహ్వానం కచ్చితంగా ఉంటుంది. విచిత్రంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు ఏ కూటమి నుంచి పిలుపు రాకపోవడం విశేషం. దీనికి కొన్ని కారణాలున్నాయి. తెలంగాణలో కొంతకాలంగా బీజేపీకి, కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉంటూ వస్తోంది. ఈ మధ్య కాలంలో మాత్రం బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగా బీజేపీపై గతంలోలాగా బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు చేయడం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాల కూటమి నుంచి బీఆర్‌ఎస్‌కు ఆహ్వానం లేదు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉన్నా అది బహిరంగంగా చెప్పుకొనే అవకాశం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్‌తో కలిసిపోయిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ కూడా పక్కనబెట్టింది. ఏపీకి సంబంధించి వైసీపీ ఎలాగూ బీజేపీకి అనుకూలంగా ఉంటోంది.
ఎన్డీయే కూటమిలో చేరకపోయినప్పటికీ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటోంది. దీంతో కాంగ్రెస్ కూటమి సమావేశానికి వైసీపీకి ఆహ్వానం అందలేదు. తమకు మద్దతుగా ఉన్నప్పటికీ కూటమిలో చేరలేదు కాబట్టి.. బీజేపీ కూడా ఎన్డీయే సమావేశానికి పిలవలేదు. దీంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ, బీఆర్ఎస్‌లు నేటి సమావేశానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే, టీడీపీకి కూడా ఆహ్వానం అందకపోవడం మరో ఆసక్తికర అంశం. గతంలో ఎన్డీయే కూటమిలోనే టీడీపీ ఉండేది. 2018 వరకు ఆ కూటమితోనే ఉంది. ఆ తర్వాత విబేధించి టీడీపీ బయటికొచ్చింది. ఇప్పుడు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా బీజేపీ అంగీకరించడం లేదు. దీంతో టీడీపీని ఎన్డీయే సమావేశానికి పిలవలేదు. ప్రతిపక్షాలు కూడా దూరం పెట్టాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు కూటముల్లో సమావేశానికి హాజరవుతున్న ఒకే ఒక పార్టీగా జనసేన నిలిచింది. భవిష్యత్తులో ఎన్డీయేతో జనసేన ఏ స్థాయిలో కలిసి పని చేస్తుందో చూడాలి.